రామారెడ్డి (గాంధారి), డిసెంబర్ 27: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచాడు. ఆయన గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ తీవ్రంగా కృషిచేశాడు.
దీన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ నాయకులు నర్సింహులు, బాలయ్య, సంతోష్ తదితరులు రంజిత్‌పై దాడి చేసేందుకు అదనుకోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో దావత్ ఇస్తామంటూ రంజిత్‌ను శుక్రవారం నర్సింహులు తన ఇంటికి ఆహ్వానించగా అతడు వెళ్లాడు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? అంటూ నర్సింహులు, బాలయ్య, సంతోష్ గొడ్డలితో రంజిత్‌పై దాడిచేశారు. ఈ దాడిలో రంజిత్ ఎడమ చెవి పక్కన, మెడపై తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే బాన్సువాడ దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌కు తరలించారు. ఇది కచ్చితంగా రాజకీయ దాడేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రంజిత్‌పై దాడి ఘటనలో నిందితుడు నర్సింహులుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. నర్సింహులుతోపాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దవాఖానకు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మోర్తాడ్, డిసెంబర్ 27: ముదెల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్‌పై జరిగిన కిరాతక దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచాడన్న అక్కసుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు అనుచరులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్తోనూ మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులపై ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అండతో అనుచరులు రెచ్చిపోవడం ప్రజల భద్రతకు ముప్పుగా మారిందని విమర్శించారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీని కోరారు.