GST | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : వ్యవస్థీకృత జీఎస్టీ (జీఎస్టీ) ఎగవేతదారులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ కొరడా ఝులిపించింది. డాటా అనలిటిక్స్, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించిన పక్కా సమాచారం ఆధారంగా, అంతర్రాష్ట్ర మోసపూరిత నెట్వర్లను నడుపుతున్న ఇద్దరు కీలక సూత్రధారులను అరెస్టు చేసింది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌కుమార్ అరెస్టు కావడం గమనార్హం.
ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సునీల్‌కుమార్ సుమారు రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించలేదు. ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ఎన్ కూడా సుమారు రూ.22 కోట్ల విలువైన నకిలీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సృష్టించి మోసానికి పాల్పడినట్టు తేలింది. నేరాల తీవ్రత దృష్ట్యా ఇద్దరినీ సీజీఎస్టీ చట్టం -2017 నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు.