హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ‘హస్తం వస్తుంది.. కొలువులిస్తుంది’ అన్నారు. ‘ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్’ అన్నారు. మెగా డీఎస్సీ అన్నారు. గద్దెనెక్కక ముందు కొలువుల జాతర అని గారడీ చేసి ఇప్పుడేమో ప్రైవేట్ జాబ్మేళాలే దిక్కంటున్నారు. ప్రభుత్వ కొలువులని మభ్యపెట్టి ప్రైవేట్ జాబులకు మంత్రుల నియోజకవర్గాల్లోనే మేళాలు నిర్వహిస్తున్న సర్కారు తీరుపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లకు సీఎం నియామకపత్రాలు ఇవ్వనున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కొలువులిచ్చినట్టు డప్పు కొట్టుకోనున్నారు.
ప్రైవేట్ మేళాలిలా..
ఉద్యోగాలు మహాప్రభో
రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక ప్రైవేట్ కొలువుల వైపు మొగ్గుతున్నారు. మధిరలో నిర్వహించిన జాబ్ మేళాకు 5 వేల మంది హాజరయ్యారంటే రాష్ట్రంలో నిరుద్యోగిత ఎంతగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. భూపాలపల్లిలో 3,500, గోదావరిఖనిలో 5,100 మంది నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో జాబ్‌మేళాకు 12 వేల మంది హాజరయ్యారు. హుజూర్‌నగర్‌లో రికార్డుస్థాయిలో 20,500 మంది పోటీపడ్డారు. సత్తుపల్లిలో 14,318, బెల్లంపల్లిలో 6,547 మంది చొప్పున నిరుద్యోగులు ప్రైవేట్ కొలువుల కోసం తరలివచ్చారు. మేళాల్లో మొత్తంగా 66,965 మంది పాల్గొన్నారు. దక్కిన ఉద్యోగాలు 23,650 మాత్రమే. 42 వేల మంది ఉత్త చేతులతోనే తిరుగుముఖం పట్టారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలివ్వక.. మరోవైపు ప్రైవేట్ జాబులు భర్తీ చేయక కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులను వంచించింది.
రెండెండ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్ అని మోస పుచ్చిన కాంగ్రెస్.. మొన్నటికి మొన్న మరో మోసానికి తెరలేపింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘అదిగో.. ఇదిగో..’ అంటూ లీకులిచ్చింది. రెండేండ్లలో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడంతో నిరుద్యోగుల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను చల్లబర్చేందుకు మాయమాటలు చెప్పింది. పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్, పోలీసు కొలువులు, విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగాలు అంటూ లీకులు వదిలింది. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రచారం చేసింది. త్వరలో నోటిఫికేషన్ల జాతర అంటూ మీడియాలో ఊదరగొట్టింది. పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడటంతో నోటిఫికేషన్ల ఊసేలేదు. 13 రకాల నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. అసెంబ్లీ సాక్షిగా 20 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఏప్రిల్‌లో మొదటి విడత.. నవంబర్‌లో రెండోవిడత నోటిఫికేషన్లు అని చెప్పిం ది. ఇప్పటి వరకు ఒక్కటీ విడుదల చేయకుం డా మొండిచెయ్యి చూపింది. అసెంబ్లీలో జా బ్ క్యాలెండర్ విడుదల చేసి 2024 జూలైకి ఏడాది. 5,089 ఉద్యోగాలిచ్చి 60 వేల ఉద్యోగాలిచ్చామని ప్రచారం చేసుకుంటున్నది.
ఒక్కోసారి ఒక్కో సాకు
నోటిఫికేషన్ల విడుదలపై నిరుద్యోగులు ప్రశ్నించిన ప్రతిసారీ ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటున్నది. మొదట ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అన్నది.. ఆ తర్వాత కుల గణన అంటూ కొత్త కత చెప్పింది. ఆ తర్వాత సిలబస్ సమీక్ష.. కమిటీ అని దాటేసింది. ఇప్పుడేమో ఉద్యోగాలెన్నో.. ఖాళీలెన్నో తేల్చేందుకు కమిటీ వేశామన్నది. ఇలా ప్రభుత్వం రోజుకో కుంటిసాకు చెప్తుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ‘ఆకలైనోడికి చదన్నంపెట్టినా పర్వాలేదు.. కానీ ఓ పదిరోజులాగు పరమాన్నం పెడుతా’ అన్నట్టుగా సర్కారు తీరున్నదని ఉద్యోగార్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉద్యోగాల కోసం రెండేండ్లు వేచి చూసిన నిరుద్యోగులు ఇక ప్రిపరేషన్‌ను దాదాపుగా వదులుకున్నారు. ఉద్యోగాల్లేక జీవనోపాధి కోసం ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ బాయ్‌లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది.