Chandrababu | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు.. అంటే తెలంగాణ వ్యతిరేక కుట్ర లు, కుయుక్తులకు కేరాఫ్. ఆయనలో నరనరాన తెలంగాణ వ్యతిరేకతే కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టడంలో చంద్రబాబు ను మించినవారుండరనేది చారిత్రక వాస్తవం. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పేరును ఉ చ్ఛరించేందుకు కూడా అనుమతించని దారుణ పరిస్థితులను తెలంగాణ చవిచూసింది.
స్వరాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అ దే తీరును ప్రదర్శించారు. ఏడు మండలాలను లాక్కుని, విద్యుత్తు సరఫరాను నిలిపివేసి అణువణువునా తెలంగాణను ఇబ్బందులపాలు చే శారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి సరికొత్త జగన్నాటకానికి తెరలేపారు.
విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎంల భేటీ అంటూ డ్రామా మొదలుపెట్టారు. తెలంగాణపై కసిపెట్టుకుని.. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చేందుకు రెడీ అయ్యారు. ఆకలిగా ఉన్నవాడి అన్నం లాక్కునే ప్రయత్నంచేసి.. అజీర్తి చేసిన వారికి సద్దికట్టినట్టుగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ అన్నాన్ని మళ్లీ లాక్కునేందుకే ఇలా చేస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.