హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించిందో వారికే తెలియదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ విషయంలో దేశంలో అందరికన్నా ముందు తామే గొంతు ఎత్తామని గుర్తుచేశారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి అనేక జాతీయ వేదికలమీద మాట్లాడింది బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ వచ్చామని అన్నారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వంపై భవిష్యత్తులోనూ పోరాటం చేస్తామని చెప్పారు. అయితే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఈనెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహిస్తున్న సమావేశానికి హాజరవుతామని, బీఆర్ఎస్ గళాన్ని బలంగా వినిపిస్తామని చెప్పారు.