Congress Govt | హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికలు అంటేనే వణుకు పుడుతున్నది. జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులకు క్షేత్రస్థాయి పర్యటనలు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం జనవరి 26న ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాల్లో మూడు పాక్షికంగా అమలు కావడం.. మండల, గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు, నాయకులకు ఆందోళన కలిగిస్తున్నది. అదే రోజున రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభమవుతుందని ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేదు. పైలట్ గ్రామాల్లోనూ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్ 21న నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలామంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గ్రామాలను సందర్శించాలని ఏప్రిల్ 15న జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయినా సీఎం ఆదేశాలపై చాలా మంది నాయకులు సానుకూలంగా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర నాయకత్వంతో తమ ఆందోళనలను వ్యక్తిగతంగా తెలిపారు. గత వారం నగరంలో జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. పెండింగ్ బిల్లుల జాప్యం వల్ల పంచాయతీ కార్యదర్శులు తమ భార్యల బంగారం, మంగళ సూత్రాలను తాకట్టు పెడుతున్నారని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాయడం గమనార్హం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నదని పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెకింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.