CM revanth Reddy | హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): దేశంలో కరెంట్ కనిపెట్టింది, రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ లేక మునుపు కరెంటే లేదా? కాంగ్రెస్ వచ్చిన తర్వాతే దేశంలో కరెంట్ వెలుగులు నిండాయా? అని విపక్షాల నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి కరెంట్ పితామహుడేమో అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ లేకపోతే ప్రజలు ఏమైపోయేవారో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అప్పులపై రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నట్టు వివిధ వేదికలపై చెప్తూ వస్తున్న సీఎం.. తమ ప్రభుత్వం ఐదేండ్లలో రూ.6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 14 నెలల్లోనే రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసినట్టు వెల్లడించారు.
బీఆర్ఎస్ అధికనేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. ఇప్పుడు మరోసారి కుటుంబ సభ్యులు ఆయనకు ఏదో హాని తలపెట్టేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తాను కక్ష తీర్చుకోవాలనుకుంటే వాళ్లెవరూ బయట తిరగబోరంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడమేంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థానంలో కూర్చున్నా రేవంత్ తీరు మారలేదని మండిపడుతున్నారు.