హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులు పడుతున్నదా? తేనెతుట్టెను కదిలించినట్టేనని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా? రెండు బెర్తులను మరికొంత కాలం ఖాళీగా ఉంచడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చారా? ఏఐసీసీ దూత మీనాక్షీ నటరాజన్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని ఢిల్లీకి నివేదించారా? అంటే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నాయి. గత విస్తరణలో అన్ని జిల్లాలకు తగినంత ప్రాధాన్యం దక్కలేదని, సామాజికవర్గాల కూర్పు సరిగా జరగలేదని అధిష్ఠానం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు, అగ్రవర్ణ సామాజికవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు ఫిర్యాదులు అందాయని సమాచారం. ఇప్పుడు మిలిగిన బెర్తులకు మళ్లీ అదే దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన అగ్రవర్ణ నేతలే పోటీ పడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు సీట్లు నింపడమంటే లేని గొడవలు తెచ్చిపెట్టుకోవడమే అని ఢిల్లీ కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అధిష్ఠానం మంతనాలు
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం చేశారు. ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరుముగ్గురికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారని, మంత్రుల శాఖల మార్పులుచేర్పులతోపాటు ఖాళీగా మిగిలిపోయిన రెండు సీట్లను కూడా భర్తీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు అనుకూలమైన వాతావరణం లేదని, ఇది అంతర్గత తిరుగుబాటుకు దారితీస్తుందని, వచ్చే రెండున్నరేండ్ల పాలన మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఏఐసీసీ దూత అధిష్ఠానానికి నివేదించినట్టు తెలిసింది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై మీనాక్షీనటరాజన్తోపాటు, మహేశ్‌కుమార్‌గౌడ్‌ను వేర్వేరుగా పిలిచి మాట్లాడినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రివర్గ ప్రక్షాళన మీదే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వపరమైన పదవుల మీద కూడా చర్చ జరిగిందట.
మళ్లీ రెడ్డి సామాజికవర్గం నేతలేనా
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు, ఉత్తర తెలంగాణలో ఒక మంత్రిని తొలగించాలని ముఖ్యనేత ఢిల్లీకి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. దీనిపై మీనాక్షి స్పందిస్తూ తెలంగాణలో బీసీ వాదం బలంగానే ఉన్నదని, ముఖ్యనేత ప్రతిపాదించిన మూడు పేర్లలో ఇద్దరు బీసీ నేతలే ఉన్నారని గుర్తుచేసినట్టు సమాచారం. దీంతో మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచాలే తప్ప కుదించాలనే ఆలోచన వద్దని రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు వంటి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారని ఆమె గుర్తు చేశారట. ఇప్పటికే మంత్రివర్గం నిండా రెడ్డి సామాజికవర్గం నేతలు ఉన్నారని, మళ్లీ వారికే అవకాశం ఇస్తే పార్టీలో అసంతృప్తి సెగలు రోడ్డు మీదికి వస్తాయని ఆందోళన వ్యక్తంచేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. రాజగోపాల్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంటు ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామీ ఇచ్చామని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారట. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టినా సమస్య తలెత్తుతుందని ఢిల్లీ దూత వివరించినట్టు తెలిసింది.
ఇప్పటికీ చోటు దక్కని రెండు జిల్లాలు
ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటిదాకా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని మీనాక్షి ప్రస్తావించినట్టు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకున్నా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు పదవి ఇచ్చామని, రంగారెడ్డి జిల్లాకు మాత్రం అవకాశం దక్కలేదని వివరించినట్టు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కాకుండా మంత్రికి సమానమైన హోదాతో కీలక పదవులను కట్టబెట్టాలని సూచించినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా మాజీ మంత్రి పీ సుదర్శన్‌రెడ్డిని సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుగా క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించామని మహేశ్‌కుమార్ గౌడ్ గుర్తు చేశారట. క్యాబినెట్ సమావేశాలకు కూడా ఆయనను ప్రత్యేక ఆహ్వానితునిగా పిలుస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. అయితే ఆయన సమాధానంతో అధిష్ఠానం సంతృప్తి చెందలేదని సమాచారం.
పదవులిచ్చినా వద్దంటున్నారు
మంత్రివర్గంలో ఎస్టీ, లంబాడీ సామాజికవర్గానికి స్థానం కల్పించాలనే డిమాండ్ ఉన్నదని, ఎస్టీ నుంచి సీతక్కకు అవకాశం ఇచ్చినా, ఆమె ఆదివాసీ తెగకు సంబంధించిన మహిళ అని, రెండు మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీలకు కేటాయిస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ సామాజికవర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రామచంద్రునాయక్‌కు గత ఏడాది డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చినా ఆయన ఇప్పటివరకు స్వీకరించలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు క్యాబినెట్ హోదాతో సమానమైన సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టలేదని సమాచారం. ఉత్తమ్ పద్మావతిరెడ్డ్డికి అంచనా పద్దుల కమిటీ చైర్పర్సన్ పదవి ఇచ్చినా ఆమె స్వీకరించలేదు. వీళ్లంతా మంత్రి పదవుల మీద ఆశతోనే ఇతర పదవులు తీసుకోవడం లేదని ఢిల్లీ దూత అధిష్ఠానానికి వివరించినట్టు తెలిసింది.
ఖాళీ బెర్తులతోనే కానిద్దాం
ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ కానీ, పునర్వ్యవస్థీకరణ కానీ చేయకపోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి అధిష్ఠానం పెద్దలు వచ్చారట. బెర్తులను అలాగే ఖాళీగా ఉంచాలని, ఆశావహులకు వాటిని చూపించి చల్లబరచాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకొంటున్నారు. దీంతో విస్తరణ ప్రక్రియ తాతాలికంగా వాయిదా పడినట్టు పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నదని, ఆలోగా ఇప్పటివరకు మంత్రి పదవులు దక్కని సామాజికవర్గాలను గుర్తించి, క్యాబినెట్ హోదాతో సమానమైన పోస్టులు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది.