Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వరకు మున్సిపాలిటీలు ఉన్నా యి. వాటిలో ఒకటి రెండు మినహాయిస్తే మిగతా మున్సిపాలిటీలలో అభివృద్ధి కుంటుపడింది. ఏడాది నుంచి పట్టణ అభివృద్ధిలో భాగంగా కొత్త పనులు ప్రారంభించలేక పోవడమే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను పూర్తి చేయడమే లేదు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, విస్తరణ, మొక్కలు నాటడం, కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి పనులకు కూడా మోక్షం లభించడం లేదు. వాటికి నిధులు మంజూరైనా విడుదల చేయడమే లేదు. మరో పక్క ఈ ఏడాది జనవరి నెలాఖరులో మున్సిపాలిటీల వారీగా పాలక మండళ్ల గడువు ముగిసింది.
వెంటనే ప్రత్యేక అధికారుల పాలనను సర్కారు అమలులోకి తెచ్చింది. పాలక మం డలి లేకపోవడంతో అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగే మున్సిపాలిటీల వారీగా చెత్త సేకరణ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రకరకాల సర్వేలు నిర్వహిస్తున్నది. అందుకు సంబంధించిన పనులను మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై రుద్దుతున్నది. దీంతో సిబ్బంది మొత్తం సర్వే పనులకే పరిమితం అవుతున్నారు తప్ప పట్టణాల్లో సమస్యలను పట్టించుకోవడమే లేదు. రాష్ట్రంలో దాదాపు మూడు నెలలకు పైగా సర్వేల పేరుతో సిబ్బంది మొత్తాన్ని రోజువారీ విధులకు దూరంగా ఉంచారు. రీ సర్వేపేరుతో మళ్లీ ఈ నెల 16 నుంచి 28 వరకు మున్సిపల్ సిబ్బందిని సర్వేకే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో పట్టణాల అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది.