తొర్రూరు (మహబూబాబాద్ ) : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఆరోపించారు. అమరవీరుల కుటుంబాల(families of martyrs)పై ఒలకబోస్తున్న ప్రియాంక గాంధీ తీరు నవ్వు తెప్పిస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే హత్య చేసి, శవంపై దండలు వేసి కన్నీరు కారుస్తున్న చందంగా ఉందని విమర్శించారు. 25 ఏండ్ల కిందనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, ఆత్మ బలిదానాలు జరిగేవా? అమర వీరుల కుటుంబాలు ఉండేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్చేసిన మోసంతోనే అనేక మంది బలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు.
దేశం కోసం మహాత్మా గాంధీ ఏ తరహాలో పోరాటం చేశారో, అదే తరహాలో తెలంగాణ కోసం కేసీఆర్( KCR) ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు లక్షా 33వేల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు(Government Emmployment) ఇచ్చామని, ఇంకా 80 వేలకు పై బడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) వేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని నిలదీశారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం గారడి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. బీజేపీ(BJP) అధికారంలోకి రాగానే రూ.200 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, రూ.1200 చేశారని మండిపడ్డారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి వివరాలను ప్రజలకు బీఆర్ ఎస్ శ్రేణులు వివరించాలని ఆయన సూచించారు.