హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్తులు పన్నింది. దానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే అధికార పార్టీ పావుగా వాడుకోజూసింది. తమ అభ్యర్థికి బీసీ సంఘాల మద్దతు కోసం పాచిక పన్నింది. దీనికి కొందరు నేతలు అనుకూలంగా మారడంతో ఒక్కసారిగా ఇతర నేతలు భగ్గుమన్నారు. తొలి నుంచీ ఇదే పాచిక పన్నుతూ వస్తున్న కాంగ్రెస్ వైఖరితో బీసీ సంఘాల్లో ఏకంగా చీలికకు దారితీసింది. దీనికి తోడు మరికొందరు బీజేపీకి మద్దతుగా మారడంతో ఇతర నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు బీసీ సంఘాల జేఏసీ నుంచి వైదొలగగా, అది మరింత అగాధంలోకి నెడుతుందని బీసీ మేధావులు, ఇతర నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రిజర్వేషన్లను అమలు చేయాల్సిన కాంగ్రెస్, బీజేపీని దోషులుగా నిలబెట్టాల్సిందిపోయి, బీసీలు మద్దతుగా నిలిచే యత్నాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేయగా, దానిని హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా పక్షం రోజుల క్రితమే ఆవిర్భవించాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు, ఎవరికి వారుగా కాకుండా ఐక్యంగా ముందుకెళ్లాలని బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా దాదాపు 40 బీసీ సంఘాలు, 110 బీసీ కులసంఘాలు ఏకతాటిపైకి వచ్చి బీసీ సంఘాల జేఏసీగా ఏర్పడ్డాయి. రిజర్వేషన్ల కల్పనలో విఫలమైన కాంగ్రెస్స, బీజేపీని దోషులుగా నిలబెట్టకపోగా, వాటితోనే కొందరు బీసీ సంఘాల ప్రతినిధులు అంటకాగడం, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకే వంతపాడుతుండటంపై ఇతర బీసీ నేతలు, మేధావులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల సాధనకు స్వతంత్ర బీసీ కమిటీ అవసరమని తేల్చిచెప్తూ ప్రస్తుత జేఏసీ నుంచీ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. వెరసి రిజర్వేషన్ల సాధనకు ఏర్పాటైన బీసీ జేఏసీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా పక్షం రోజుల క్రితమే ఏర్పడ్డాయి. చైర్మన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వరింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్‌గా వీజీఆర్ నారగోని, కో చైర్మన్లుగా రాజారాంయాదవ్, దాసు సురేశ్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణను ఎన్నుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలోనే ఈనెల 18న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించారు. బంద్ అనంతరం జేఏసీలో అన్ని కులసంఘాలతో కమిటీలను వేయాలని, క్షేత్రస్థాయిలో ఆ కమిటీలను విస్తరించాలని, ఐక్యత ద్వారానే బీసీ సమాజానికి విశ్వాసం కల్పించాలని ఆ రోజే నిర్ణయించారు. ప్రస్తుతం అదే బీసీ సంఘాల జేఏసీలో మళ్లీ చిచ్చురేగింది. జేఏసీ కమిటీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. అందుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని తెలుస్తున్నది.
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నాటి నుంచీ కొన్ని బీసీ, కుల సంఘాలు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాయి. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా బీసీ నాయకత్వాన్ని పట్టించుకోకవడం, కులగణన మినహా ఇతర డిక్లరేషన్ హామీల ఊసే ఎత్తలేదు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు మొదలు, అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం వరకూ కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉన్నదని వివిధ బీసీ సంఘాలు ఇప్పటికీ బాహాటంగా నిప్పులు చెరుగుతున్నాయి.
అదీగాక నిబంధనలన్నీ పాతరేసి, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా, కుట్రపూరితంగానే అనేక లోపాభూయిష్టమైన విధానాలను అనుసరించి ఇంటింటి సర్వే, ఇటీవల 42% బీసీ రిజర్వేషన్‌ను కల్పిస్తూ చట్టాలను రూపొందించిందని వివిధ బీసీ సంఘాలు, మేధావి వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదని బహిరంగంగా విమర్శించాయి. కులాల వారీగా లెక్కలను, డెడికేటెడ్ కమిషన్ నివేదికలను బయటపెట్టకుండా ఆది నుంచీ అడ్డదిడ్డంగా జీవోలు జారీ చేసిందని, ప్రస్తుత న్యాయపరమైన ఇబ్బందులకు కాంగ్రెస్సే కారణమని వారంతా మండిపడుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ససేమిరా అంటూ అడ్డుకుంటున్నది. మొత్తంగా రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీలే ప్రధాన అవరోధంగా నిలిచాయి. ఈ రెండు పార్టీలనే దోషులుగా నిలబెట్టాలని వివిధ బీసీ, కులసంఘాలు, బీసీ మేధావులు బాహాటంగానే పిలుపునిస్తున్నాయి. అయితే జేఏసీలోని కొందరు బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు మాత్రం నోరుమెదపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచనచేరి ఉనికి కోసమే పాకులాడుతున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం బీసీ సంఘాల జేఏసీ విచ్ఛిన్నానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.
ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, జారీచేసిన ఆదేశాల్లో అనేక లోపాలున్నా కూడా కొన్ని బీసీ, కులసంఘాలు, మేధావులు మాత్రం ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ వచ్చాయని బీసీల్లో పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమవుతూ ఉన్నది. దీనిపై బీసీ మేధావివర్గం, వివిధ కులసంఘాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. సర్వే ప్రారంభం కాకముందే కొందరు బీసీ నేతలు ఏకంగా ప్రభుత్వ పెద్దలను కలిసి సన్మానాలు కూడా చేశాయని, అదేమని నిలదీస్తే సర్వేను ప్రభుత్వం చేపట్టడమే మహా గొప్పనే తరహాలో అవి క్షేత్రస్థాయిలో ప్రచారం చేశాయని గుర్తుచేస్తున్నారు. సర్వేలో లోపాలుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే న్యాయపరంగానైనా కొట్లాడుతామని గొప్పగా ప్రకటించారు. కులాల వారీ లెక్కలను బయటపెట్టకుండానే చట్టాలను చేస్తే కూడా సర్కారును నిలదీయకుండా, లోపాలను ఎత్తిచూపకుండా, అంతా అయ్యాక కోర్టులో తేల్చుకుందామంటుండటంపై ఇతర బీసీ నేతలు నిప్పులు చెరిగారు. కేవలం ఉనికి కోసం, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసమే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, సర్కారు మెహర్బానీ కోసం బీసీ హక్కులను తాకట్టుపెడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ తమకు అనుకూలమైన మేధావి వర్గాన్ని, కుల, బీసీ సంఘాల నేతలను ముందుపెట్టి మంత్రాంగాన్ని నడిపిస్తూ వస్తున్నది. చట్టాలు ఆచరణలోకి తీసుకు రాకముందే కొందరు బీసీ సంఘాల ప్రతినిధులు హడావుడి చేస్తూ, సర్కారుకు జేజేలు కొట్టడం, ఢిల్లీకి తరలివెళ్లి కాంగ్రెస్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొనడం, కాంగ్రెస్ పెద్దలకు సన్మానాలు చేయడమే ఇందుకు నిదర్శనాలు. సదరు బీసీ సంఘాల ప్రతినిధుల తీరుతోనే అప్పుడే కులసంఘాలు, బీసీ మేధావులు రెండుగా చీలిపోయాయి. కానీ ఉమ్మడి లక్ష్యసాధన కోసం ఇటీవలే జేఏసీగా ఏర్పాటయ్యాయి. అయితే 18న బీసీ బంద్‌లో మళ్లీ విభేదాలు తలెత్తాయి. రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులనే బంద్‌కు ఆహ్వానించడంపై విస్మయం వ్యక్తమైంది. ఈ విషయమై పలువురు విభేదించారు.
తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓ బీసీ సంఘం నేత వ్యవహరిస్తున్నారు. ఉదయం జేఏసీ పేరిట హల్చల్ చేస్తూ, రాత్రి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంలో నమ్మించి వంచించిన పార్టీకి వంతపాడటంపై ఇతర నేతలు భగ్గుమంటున్నారు. మరో బీసీ నేత బీజేపీకి వంతపాడుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జేఏసీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని సదరు బీసీ సంఘాల నేతలకు కరాకండిగా తేల్చిచెప్పారు. అయినా సదరు నేతల తీరు మారలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే జేఏసీ నుంచి బీసీ సంఘాల నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు.
రాష్ట బంద్ విజయవంతానికి ఏర్పాటుచేసిన బీసీ సంఘాల జేఏసీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బంద్ సమయంలో తగినంత సమయం లేకపోవడంతో ఇతర బీసీ, కుల సంఘాలు, మేధావులతో మాట్లాడలేకపోయాం. వారిని కమిటీలోకి తీసుకుని రాలేకపోయాం. ఇప్పటికీ జేఏసీకి బయట ఎందరో బలమైన నాయకులు ఉన్నారు. వారందరినీ కమిటీలోకి తీసుకురావాలి. అన్నికులాల ప్రాతినిధ్యంతో కమిటీని ఏర్పాటుచేయాలి. ప్రస్తుత కమిటీని అలాగే కొనసాగిస్తూ కొత్త వాళ్లను చేర్చడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి స్వతంత్ర కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను సమన్వయం చేసి, కదిలించడానికి స్వతంత్ర దృక్పథం కలిగిన నాయకత్వం కావాలి.
– వీజీఆర్ నారగోని, బీసీ నేత
బీసీలకు కాంగ్రెస్, బీజేపీలను రాజకీయ శత్రువులుగా ప్రకటించాలని, రాజ్యాంగ సవరణ బిల్లును రాహుల్‌గాంధీ పార్లమెంట్లో బిల్లు ప్ర వేశపెట్టాలని, బిల్లు పాస్‌చేసే బా ధ్యత ప్రధాని మోదీ తీసుకోవాలని, జిల్లా స్థాయిలోనూ పూర్తిస్థాయి కమిటీలు వేయాలనే ప్రతిపాదనలను జేఏసీ కమిటీ ముందు పెట్టాను. కానీ వాటిపై స్పష్టత ఇవ్వకుండానే, రాజకీయ అస్పష్టతతోనే భవిష్యత్తు కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. రాజకీయ విధానపరమైన స్పష్టత లేకుండా ముందుకెళ్తే లక్ష్యం సాధించలేమన్నది నా అభిప్రాయం. బీసీ వర్గాల విసృ్తత ప్రయోజనాల కోసం ఏ రకంగా బీసీ జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించానో.. నేడు వారి ప్రయోజనాల కోసమే జేఏసీ కో చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. రాజ్యాంగ సవరణ ఒకటే బీసీ రిజర్వేషన్లకు శ్రీరామరక్ష. అందుకు పోరాడేందుకు సిద్ధం.
– రాజారామ్‌యాదవ్, బీసీ జనసభ అధ్యక్షుడు