హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారని..
చివరికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని మండిపడ్డారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు కడుపుమండి కాంగ్రెస్ దిష్టిబొమ్మలను కాలుస్తున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ సహా 6 గ్యారెంటీలపై చర్చను పకదారి పట్టించేందుకు విలీన డ్రామాలు ఆడుతున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.