Telangana | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతున్నది. గతేడాది రూ.18228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.8473 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. అనుకున్నదాంట్లో 46.48% ఆదాయం మాత్రమే సాధించగలిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా ఖజానాకు ప్రత్యక్షంగా దాదాపు 10 శాతం, పరోక్షంగా మరింత ఆదాయాన్ని సమకూర్చుతూ కీలకంగా ఉండేది. కానీ నిరుడు సగానికిపైగా పడిపోయింది. చివరికి.. కరోనా విపత్తు కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రభావం చూపిందని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆదాయం ఏటేటా పెరుగుతూరాగా.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ హయాంలో తిరోగమనం నమోదైంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా విపత్తు, లాక్‌డౌన్‌తో రియల్ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆ సంవత్సరంలో కూడా ప్రభుత్వం అంచనా వేసినదాంట్లో స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ ద్వారా 52 శాతం ఆదాయం వచ్చింది. 2021-22లో సెకండ్ వేవ్ విజృంభించినా, .. భూలావాదేవీలను అడ్డుకోలేకపోయింది. దీంతో ఆ ఏడాది అంచనాలో 98 శాతం రాబడి వచ్చింది. కొవిడ్ తర్వాత చాలామంది స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టారు. తెలంగాణలో భూముల ధరలు వేగంగా పెరుగుతుండటంతో మెరుగైన లాభాలు వస్తాయనే ఉద్దేశంతో బంగారం, స్టాక్స్ కంటే కూడా భూ లావాదేవీలకు మొగ్గు చూపారు. ఫలితంగా కొవిడ్‌కు ముందు వరకు రూ.7 వేల కోట్లు దాటని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. కొవిడ్ తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లను దాటేసింది. ఇది తెలంగాణ రియల్ఎస్టేట్ రంగం పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత 2022-23లో రాబడి రూ.14వేల కోట్లు దాటింది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నర తిరగకముందే స్థిరాస్తి రంగం కుప్పకూలింది. లక్ష్యంలో 46 శాతం ఆదాయం మాత్రమే సాధించి.. కొవిడ్‌ను మించిన విపత్తుగా మారింది.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో స్థిరాస్తిరంగం నేలచూపులు చూస్తున్నది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పడిపోయాయి. స్టాంపులు రిజిస్ట్రేజన్ల శాఖకు వచ్చిన ఆదాయమే ఇందుకు నిదర్శనం. కాళేశ్వరం పక్కనబెట్టడం, వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు వంటివి గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయని నిపుణులు చెప్తున్నారు. ఇక.. హైదరాబాద్‌లో హైడ్రా ద్వారా అడ్డగోలుగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. గతంలో లేక్‌వ్యూ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలు జోరుగా సాగేవని, హైడ్రా ఎఫెక్ట్‌తో ఇప్పడు చెరువుల దగ్గరలో ఉన్న నిర్మాణాలంటేనే భయపడుతున్నారని చెప్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అంటూ కొర్రీలు పెడుతుండటంతో ప్లాట్లు, ఫ్లాట్లు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చేస్తారన్న వార్తలు సైతం ఇబ్బంది పెట్టాయని, ఇక ఫార్మాసిటీ రద్దు ప్రకటన, ఫోర్త్‌సిటీ పేరుతో చేసిన హడావుడి బెడిసికొట్టాయని వారు విశ్లేషిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా రియల్ ఎస్టేట్‌కు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో నిర్మాణరంగం కుప్పకూలినట్టు చెప్తున్నారు.
ఓవైపు అమ్మకాలు పడిపోవడం, మరోవైపు పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిళ్లు తట్టుకోలేక రియల్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేడ్కల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి (39) అనే బిల్డర్.. తాను నిర్మించిన అపార్ట్మెంట్లో ప్లాట్లు అమ్ముడుపోక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో నర్సింహాగౌడ్ అనే రియల్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ ద్వారా ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.3,105 కోట్లు మాత్రమే. 2022-23 నాటికి రూ.14,228 కోట్లకు పెరిగింది. అంటే.. ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, అనేక పథకాలు, కార్యక్రమాలతో వ్యవసాయ రంగాన్ని బాగుచేయడం, భారీగా పరిశ్రమల రాక, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల వృద్ధి.. ఇలా పక్కా ప్రణాళికతో నిర్మాణాత్మకంగా అభివృద్ధి జరిగింది. దీంతో అదేస్థాయిలో రియల్టీ కార్యకలాపాలు పెరిగాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.2 లక్షలు కూడా పలకని ఎకరం భూమి విలువ.. పదేండ్లలో అనేక రెట్లు పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోనూ రూ.30-50 లక్షలు పలికింది. హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.100 కోట్ల వరకు పలికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది.
రాబడి అంచనా 18228.82 కోట్లు
వచ్చింది.. 8473.21 కోట్లు
అంచనాలో చేరిన లక్ష్యం: 46.48%
2023-24లో ఆదాయం: 14295 కోట్లు
2024-25లో ఆదాయం : 8473 కోట్లు
తగ్గుదల: 5,822 కోట్లు
తగ్గిన శాతం: 40.7%