హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హిందువుల పట్ల ద్వేషభావంతో వ్యవహరించేవారిని కాంగ్రెస్ వెనకేసుకొస్తున్నదని, ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని, వలస కార్మికులను అవమానిస్తున్నప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ర్టాలంటూ అవహేళన చేసినప్పుడు ఆ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. డీఎంకే నేతల వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని కవిత విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయం ఇస్తామని, చెప్పిన గడువులోగా ఆ హామీలను నెరవేర్చకపో తే కచ్చితంగా పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాం గ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే నాయకులు తమిళనాడులో కొన్ని వర్గాల ఓట్లను దండుకునేందుకు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని చెప్తున్న రాహుల్ గాంధీ తమ మిత్రపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ జవాబుదారీగా ఉండాలి
ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ‘ఎన్నికల గాంధీ’ అని పిలుస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. డీఎంకే నేతల వ్యాఖ్యలపై మౌనం వహించడం ద్వారా దేశానికి రాహుల్ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయమై దేశ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని, ఇం డియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికి జవాబుదారీగా ఉండాలని డిమాం డ్ చేశారు. కార్మికుల పట్ల తనకు గౌరవం ఉన్నదని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకికానని రాహుల్ గాంధీ చెప్పగలరా? అని ఆమె నిలదీశారు.
హిజాబ్‌పై కాంగ్రెస్ వైఖరేంటి?
ఎన్నికల హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని కవిత విమర్శించారు. గ్యారెంటీల పేరిట కర్ణాటక ప్రజలకు ఇచ్చిన పలు హామీలను కాంగ్రెస్ ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని గుర్తుచేశారు. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిషేధం ఎత్తివేతకు వెనుకాడుతున్నదని ఆమె తప్పుబట్టారు.