హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంతో తెలుసా? ఇప్పటికి రూ.71,495 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది. నిరుడు డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగళవారం వరకు 285 రోజుల్లో రూ.71,495 కోట్లు అప్పు చేసింది. అంటే ప్రతి రోజూ రాష్ట్ర ప్రజలపై రూ.250 కోట్ల అప్పల భారం మోపింది. ఆగస్టు 13వ తేదీ వరకే ఒక్క ఆర్బీఐ నుంచి 42,118 కోట్ల రుణం సేకరించింది.
ఈ నెల 3న రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు.. ఇలా వారం రోజుల్లోనే రూ.4,000 కోట్లు రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మంగళవారం మరోసారి రూ.500 కోట్లు అప్పు తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారమే.. గత తొమ్మిది నెలల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.46,618 కోట్ల మేర రుణాలు సేకరించింది. వివిధ కార్పొరేషన్లకు రూ.24,877 కోట్ల గ్యారంటీలు ఇచ్చింది. మొత్తంగా.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిపై గత తొమ్మిది నెలల్లోనే రూ.17,873 భారం పడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది రూ.52,576 కోట్ల రుణం సమీకరించనున్నట్టు 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించింది. రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచుతున్నారంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ ఏడాది అప్పుల లక్ష్యాన్ని రూ.62,012 కోట్లకు పెంచింది. అంటే నిరుటి కన్నా దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువ. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లెక్కించినా.. ఆగస్టు 13వ తేదీనాటికి బహిరంగ మార్కెట్ నుంచి రూ.27వేల కోట్లు రుణాలు సమీకరించింది.
అంటే ఏడాది లక్ష్యంలో దాదాపు సగాన్ని కేవలం నాలుగున్నర నెల్లలోనే చేరుకుంది. గ్యారెంటీలు కూడా కలుపుకొంటే ఈ ఏడాది లక్ష్యాన్ని దాటిపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అప్పులు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పడం కష్టమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.71,495 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను ఒక ప్రజోపయోగ ప్రాజెక్టు కోసమో, విప్లవాత్మక పథకం కోసమో ఖర్చు చేస్తాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో తెచ్చిన నిధులతో ఏ ప్రాజెక్టు చేపట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిదిన్నర నెలల్లోనే రూ.25 వేల కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చింది. ఈ అప్పులను కార్పొరేషన్లు రెండు విధాలుగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మొదటిది.. పన్నులు, చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడం, రెండోది.. ప్రభుత్వమే ఈ మొత్తాన్ని చెల్లించడం. ఎలా చూసినా ప్రజలకే నష్టమని స్పష్టం చేస్తున్నారు.
రిజర్వు బ్యాంకు నుంచి తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.46,618 కోట్లు తీసుకున్నది. అంటే ప్రతిరోజూ సగటున రూ.163 కోట్ల మేర కేంద్ర బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటున్నది. గత ఏడాది డిసెంబర్ 12న రూ.500 కోట్లతో అప్పుల వేట మొదలు పెట్టి.. సగటున నెలకు రూ.5 వేల కోట్ల చొప్పున ఆర్బీఐ నుంచి రుణాలు సేకరించింది. ఇంకా సేకరిస్తూనే ఉన్నది.