కరీంనగర్ కలెక్టరేట్, మే 25: ప్రజారోగ్య పరిరక్షణ, ఆరేళ్లలోపు చిన్నారుల్లో విద్య అవగాహన కల్పించడంలో కీలకంగా మారిన అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను (Anganwadi Recruitment) గుర్తించాం. వాటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. సాధ్యమైనత తొందరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, కేంద్రాలను మరింత బలోపేతం చేస్తాం. అంగన్వాడీల లక్ష్యం నెరవేర్చుతామని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొద్దినెలల క్రితం పత్రికా ముఖంగా ప్రకటించారు. దీంతో, నిరుద్యోగ మహిళలతో పాటు ఆ శాఖ అధికారులు, జిల్లాల్లోని అంగన్వాడీ టీచర్లు, ఆయాల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది. ఇన్నాళ్లుగా తాము పడుతున్న బాధలనుంచి, త్వరలోనే విముక్తి లభించబోతుందనే సంబురంలో టీచర్లు, ఆయాలు ఉన్నారు. అయితే, ఈ ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా, వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నా, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి గడువు సమీపిస్తున్నా ఇప్పటివరకు ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఖాళీల భర్తీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటంతో మంత్రి మాటలు నీటి మూటలేనా? అనే వ్యాఖ్యలు నిరుద్యోగ మహిళల నుంచి వస్తున్నాయి. పోస్టుల భర్తీపై చేసిన ప్రకటన మాటలకే పరిమితమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చేదెప్పుడో.. లక్ష్యం నెరవేరేదెన్నడో అనే చర్చ జిల్లాలో కొనసాగుతున్నది.
కరీంనగర్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు…
కరీంనగర్ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇవి కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, గంగాధర, హుజురాబాద్ లో ఉన్నాయి. 12 వేల మంది దాకా చిన్నారులు, 9 వేల మందికి పైగా గర్భిణులు, బాలింతలు ఉన్నారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 720 మంది వరకు అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. వీటిలో టీచర్ పోస్టులు 21, ఆయా పోస్టులు 43, హుజురాబాద్ లో 18 – 73, కరీంనగర్ రూరల్ లో 13 – 60, కరీంనగర్ అర్బన్ లో 17 – 24 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులకు పంపిన నివేదిక ద్వారా తెలుస్తుంది. మరికొన్ని కేంద్రాల్లో టీచర్, ఆయా రెండు పోస్టులు కూడా ఖాళీగానే కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, ఖాళీలున్న కేంద్రాలన్నీ సమీప కేంద్రాల్లోని టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించటంతో, అనేక ఇబ్బందులెదుర్కొంటున్నట్లు టీచర్లు, ఆయాలు వాపోతున్నారు.
నిత్యం వారు పోషణ ట్రాకర్‌లో పిల్లల వివరాలు ఆన్లైన్ చేయడం, చదువు చెప్పడం, వంట చేసి భోజనం వడ్డించడం, ఆరోగ్య, ఇతర సర్వే బాధ్యతలు కూడా నిర్వహిస్తుండగా, తమ కేంద్రంలోని పనులు తాము చేసుకోవడానికే తల ప్రాణం కాళ్ళ వద్దకొస్తుండగా, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతలు కూడా పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో తమపై అదనపు పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తుండగా, ఇప్పటికే తమ పరిస్థితి పేణంపై వేగుతున్న చందంగా ఉండగా, అదనపు భారంతో పొయ్యిలో పడ్డట్లుగా మారుతుందంటున్నారు. కాగా, అంగన్వాడీ టీచర్ పోస్టులు గతంలో పదో తరగతి అర్హతతో భర్తీ చేసేది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టులకు విద్యార్హతను పెంచింది. అంగన్వాడీ టీచర్‌తోపాటు ఆయాలుగా ఉద్యోగాలకు నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత, 18-25 ఏళ్ళ వయసు కలిగి ఉండాలనే నిబంధన పెట్టడం మహిళల్లో అసంతృప్తి రగులుతోంది. ఖాళీల్లో 50 శాతం ఆయాలకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉండగా, ఇందుకోసం ఇన్తస్సార్ పూర్తి చేసి ఉండాలంటూ పేర్కొనడంతో ఆయాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. వీటన్నీటికి పరిష్కారాలు చూపుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే సన్నాహాలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు.
ఖాళీలు గుర్తించాం.. నోటిఫికేషన్ రాగానే భర్తీ చేస్తాం
జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం ఖాళీలు గుర్తించామని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి అన్నారు. రాష్ట్ర కమిషనరేట్ నుంచి నోటిఫికేషన్ రాగానే పోస్టులను భర్తీ చేస్తాం. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లే పనిచేస్తున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే క్రమంలో నూతన మార్గదర్శకాల రూపకల్పన జరుగుతున్నది. ఇది పూర్తి కాగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే ఖాళీల వివరాలు ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు.