హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి/కందుకూరు, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులను ఏడాదిన్నరగా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు పరిహార ప్లాట్ల అప్పగింతకు సిద్ధమైంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం తమ భూముల్ని త్యాగం చేసిన రైతులను గౌరవించాల్సిందిపోయి, వాళ్లకు పరిహారంగా వచ్చిన ప్లాట్లను అగ్గువకే కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల వెలుగులోకి తీసుకురావడం, దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఫార్మా పరిహార ప్లాట్లను అధికారికంగా రైతులకు అప్పగించేందుకు రెడీ అయింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశానుసారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి లేఅవుట్ను పరిశీలించి తదుపరి చర్చలపై చర్చించారు.
మీర్ఖాన్పేటలోని లేఅవుట్లోనే వేలమంది రైతులు, జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ప్లాట్ల నంబర్లను కేటాయించనున్నారు. అనంతరం విడతలవారీగా సంబంధిత తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన గ్రీన్ ఫార్మాసిటీకి ఆ ప్రాంత రైతులు తమ భూములు ఇచ్చారు. వీరికి పరిహారంగా నగదుతో పాటు ఇంటి స్థలాలను కూడా కేటాయించేందుకు బీఆర్ఎస్ హయాంలో కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్లో భారీ లేఅవుట్ను రూపొందించి రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి, పొజిషన్ ఇవ్వకుండా ఏడాదిన్నర నుంచి ముప్పుతిప్పలు పెడుతున్నది. దీనిని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నేతలు వారిని భయభ్రాంతులకు గురిచేసి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 500-600 వరకు అనధికారికంగా ప్లాట్లను విక్రయించినట్టుగా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూముల్ని తిరిగి అప్పగిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీని తుంగలో తొక్కడమే కాకుండా వారి త్యాగాన్ని అవమానపరిచేలా వారికి పరిహారంగా వచ్చే ప్లాట్లనే కొల్లగొట్టడం ఘోరమని విమర్శించారు. దీంతో రంగారెడ్డి కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్, ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీవోలు మీర్ఖాన్పేట్లోని లేఅవుట్ను పరిశీలించారు.
ఎకరాకు అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాల్సి ఉండగా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన దాదాపు 5,720 మంది రైతులకు ఈ ప్లాట్లు దక్కాల్సి ఉంది. కేసీఆర్ హయాంలో పట్టాల పంపిణీ పూర్తయింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి స్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు రైతులకు ప్లాట్ల నంబర్లు కేటాయించి, రిజిస్ట్రేషన్ చేయించి, పొజిషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు సోమవారం మీర్ఖాన్పేటలోని లేఅవుట్లోనే రైతులను పిలిచి కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించనున్నారు.
ఎట్టకేలకు పరిహార ప్లాట్లను అప్పగించేందుకు అధికార యంత్రాంగం కదిలిరావడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు వస్తాయో? లేదోనని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు మోసపోయి కొందరు రైతులు అనధికారికంగా తక్కువ ధరకు విక్రయించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వపరంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగనున్నందున, అనధికారిక ఒప్పందాలు చెల్లవని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో గజం రూ. 30 వేలకు పైగా ఉన్నదని, ఈ క్రమంలో 121 గజాల ప్లాటు విలువ రూ. 50-60 లక్షలపైనే ఉంటుందన్నారు. అందుకే రైతులెవరూ తక్కువ ధరకు ప్లాట్లను అప్పగించవద్దని పలువురు సూచిస్తున్నారు. అధికారులు భూములిచ్చిన రైతుల పేరిటనే రిజిస్ట్రేషన్ చేయనున్నందున అవసరముంటే స్వేచ్ఛగా ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుందని, అనధికారిక ఒప్పందాలతో ఎవరైనా బెదిరిస్తే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఓ అధికారి రైతులకు సూచించారు.