CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): పచ్చని భూముల్లో ఫార్మా క్లస్టర్ వద్దు.. మా కడుపులు కొట్టొద్దు.. మాకు కడుపుకోత మిగిలించొద్దు.. అంటూ గత కొన్నాళ్లుగా ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. వినని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రైతుల నిరసనను పరిగణనలోకి తీసుకోని సీఎం రేవంత్‌రెడ్డి నిర్వాకంపైనే ఈ దాడి జరిగిందని పర్యావరణ వేత్తలు, రాజకీయ విశ్లేషకులు తేల్చిచెప్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా క్లస్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి.. కేవలం అధికారులపైన జరిగినది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలపై ప్రజాగ్రహంగా పరిగణించాలని పేర్కొంటున్నారు.
వాస్తవానికి ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 12,300 ఎకరాల భూమిని ఆనాడే సేకరించి సిద్ధం చేసింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కగానే ‘ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం’ అంటూ ముందు, వెనుకా ఆలోచించకుండా ప్రకటించేశారు. దాని స్థానంలో 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అప్పట్లోనే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒకేచోట సిద్ధంగా ఉన్న 12 వేల ఎకరాలను కాదని, హైదరాబాద్ చుట్టూ రసాయన పరిశ్రమలు పెట్టడం ఏమిటని నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. భూ సేకరణ ద్వారా పచ్చని పొలాలు నాశనం అవుతాయని హెచ్చరించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
ఒకవైపు రద్దు చేస్తామన్న ఫార్మాసిటీని మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయంగా చేపడతామన్న ఫార్మ క్లస్టర్లలోనూ భూసేకరణకు దిగడం గమనార్హం. తొలుత ఫార్మాసిటీని రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఫార్మా విలేజ్‌లు లేదా ఫార్మా క్లస్టర్లను తెరమీదికి తెచ్చింది. 2 వేల ఎకరాలతో ఔటర్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య 10 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి, నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలోనే సేకరించిన 12 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, దాన్ని కాదని పచ్చని పల్లెల్లో విషాన్ని నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ మండిపడ్డారు. మరోవైపు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో నిర్వాసితులైన రైతులు కోర్టుకు వెళ్లారు. వాళ్ల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. ఫార్మాసిటీని రద్దు చేయలేదని, కొనసాగిస్తామని కోర్టుకు చెప్పింది.
ఇదే దశలో ఫార్మా క్లస్టర్ల నోటిఫికేషన్లు మాత్రం రద్దు చేయలేదు. ఫార్మాసిటీని కొనసాగిస్తే ఫార్మా క్లస్టర్లు ఎందుకంటూ ఎంత మంది ప్రశ్నించినా ప్రభుత్వం మిన్నకుండి పోయింది. మొండిగా భూ సేకరణను ప్రారంభించింది. అటు ఫార్మాసిటీ కొనసాగిస్తామని చెప్తూనే మళ్లీ తమ జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారంటూ రైతులు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం పెంచుకున్నారు. ఈ ఆగ్రహం వికారాబాద్‌లో సోమవారం బయటపడింది. ఈ ఘటన అధికారులపై జరిగిన దాడి కాదని.. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వాకంపై జరిగిన దాడిగా పరిగణించాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఫార్మాసిటీ కోసం భూసేకరణను సొంత గడ్డ నుంచే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం సొంత గడ్డమీదే ప్రజలు ఉద్యమబాట పట్టారు. ‘గో బ్యాక్ ఫార్మా’ అంటూ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ‘మా ప్రాంతం బిడ్డ సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని భావించాం. కానీ వేలాది ఎకరాలను గుంజుకుంటూ కడుపుకోత మిగుల్చుతున్నడు. పచ్చని పొలాల్లో ఫార్మా విషాన్ని నింపి మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు’ అని రైతులు, బాధిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. రెవెన్యూ అధికారులను కోరినా, మంత్రులకు విజ్ఞప్తి చేసినా, చివరికి సీఎంకు తమ గోడును వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రభుత్వం మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదని వారికి అర్థమైంది. అందుకే అధికారులపై తిరగబడి దాడులు చేసే పరిస్థితి వచ్చిందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.