హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక సర్కార్ కొనసాగుతున్నదని బేవరెజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, సీపీఎస్ రద్దుచేస్తామని, డిజిటల్ హెల్త్‌కార్డులు జారీచేస్తామని అలవికాని హామీలిచ్చి రెండున్నరేండ్లయినా వాటిని అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కిందని ఎద్దేవాచేశారు.
తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేత కిశోర్గౌడ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తుంటే సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. రేపోమాపో సమ్మె చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని దేవీప్రసాద్ మండిపడ్డారు. రెండేండ్లుగా వారికి బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో 86 మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి రూ.14 వేల కోట్ల ఉద్యోగవిరమణ బకాయిలు విడుదల చేయాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగుల ఉసురుతగులుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగులు పెత్తనం సాగిస్తున్నారని దేవీప్రసాద్ ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్తు, ఇరిగేషన్ శాఖల్లో వారి ప్రాబల్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల ఎైక్సెజ్ కమిషనర్ వేధింపులు తట్టుకోలేక తెలంగాణకు చెందిన సిన్సియర్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు కనుసన్నల్లోనే డిప్యుటేషన్‌పై ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణలో నియమిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యే డీలిమిటేషన్లో హైబ్రిడ్ మాడల్‌ను తెరపైకి తెచ్చారని దేవీప్రసాద్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు రేవంత్ ఇంటిని ముట్టడించిన సమయంలోనే ఢిల్లీలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ ఇంట్లో ఆయన విందులో మునిగితేలడం.. ఉత్తరప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌తో చెట్టపట్టాలేసుకొని తిరగడమే ఇందుకు నిదర్శనం..’ అని వ్యాఖ్యానించారు. రేపోమాపో రేవంత్ బీజేపీలో కలవడం, కాంగ్రెస్ హైబ్రిడ్ మాడల్‌ను హోల్‌సేల్‌గా ఆ పార్టీకి అమ్మడం ఖాయమని చెప్పారు. అందుకే పార్లమెంట్లో తేజస్వీ వ్యాఖ్యలను ఖండించలేదని అన్నారు.
గత 30 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ మహిళా బిల్లు పేరిట దాగుడుమూతలాడుతున్నాయని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోభా ధ్వజమెత్తారు. రెండు పార్టీలు పరస్పరం ఒకరిపైఒకరు నెపం నెట్టుకుంటూ నారీమణులను వంచిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల గొంతునొక్కి జీఎస్టీ లాంటి బిల్లులను ఆమోదించుకున్న మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్‌తో లింక్‌పెట్టి అటకెక్కించిందని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లపై తీర్మానం చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించి, లోకల్ బాడీల్లో 50 శాతానికి పెంచి నిబద్ధతను చాటుకున్నారని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్‌లకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తేలిపోయిందని విమర్శించారు.
ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెండున్నరేండ్లు దాటినా అమలు చేయకుండా మొండిచెయ్యి చూపుతున్నారని ఉపాధ్యాయ సంఘం మాజీ నేత భుజంగరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పే రివిజన్ కమిషన్‌ను పెండింగ్ రివిజన్ కమిషన్‌గా మార్చిందని దెప్పిపొడిచారు. హామీలు అమలుచేయకుంటే ఉద్యోగుల ఆగ్రహానికి బలికాకతప్పదని హెచ్చరించారు.