‘ఒక్క పిల్లర్ కుంగిన మేడగడ్డ బరాజ్‌ను ప్రభుత్వం ఎందుకు మరమ్మతు చేయడం లేదు?’ అని బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ ఎప్పటినుంచో ప్రశ్నిస్తున్నయ్. దీని వెనుక కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే పెనుకుట్ర దాగున్నదని మొత్తుకున్నయ్. ఆ అనుమానాలే నిజమైనయ్, మొదట మేడిగడ్డకు, తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మరణశాసనం రాసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ-తెలుగుదేశం-కాంగ్రెస్ మేడిగడ్డపై ముప్పేట దాడి చేయబోతున్నయ్. మేడిగడ్డను నిండు గోదారిలో నిలువునా ముంచేసే ఇచ్చంపల్లికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కింద బనకచర్ల పేరుతో ఏపీ పట్టుకుపోతే.. పైన కావేరి కథ చెప్పి కేంద్రం ఎత్తుకుపోతే.. గోదావరి నీళ్లు లేక గోస పడబోతున్నది తెలంగాణ. ఇదీ భవిష్యత్ చిత్రం.
ఏపీ కోసం బనకచర్ల! తమిళనాడు కోసం ఇచ్చంపల్లి!
బాబు కోసం బనకచర్ల! మోదీ కోసం ఇచ్చంపల్లి!
ఇచ్చంపల్లిపై ఇంకో ‘ఇచ్చంత్రం’ ఏమిటంటే.. బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర కేంద్రం పెట్టిన ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మోదీ సర్కారు ప్రతిపాదనకు తలూపి వచ్చింది. ‘బడేభాయ్’ మాటను ఎదిరించలేక.. బేలగా, బేషరతుగా సమ్మతి తెలిపింది. గోదావరిలో మొత్తం 968 టీఎంసీల మన న్యాయమైన వాటాకుగాను ఇంకా 460 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా దక్కాల్సి ఉన్నది. వాటినీ వదిలేసింది రేవంత్ ప్రభుత్వం. కనీసం మాటమాత్రంగానైనా ఆ వాటాను ప్రస్తావించలేదు. ముష్టి 74 టీఎంసీల కోసం కేంద్రాన్ని దేబిరిస్తున్నది!
ఇది కాంగ్రెస్ చేస్తున్న మరో చారిత్రక ద్రోహం
జల కాళేశ్వరానికి రాస్తున్న మరణశాసనం!
ఫలితం: మేడిగడ్డ బరాజ్ శాశ్వతంగా ప్రమాదంలో పడుతుంది
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఏకంగా తెలంగాణ గడ్డ మీదనే.. తెలంగాణకు ఆయువుపట్టులాంటి మేడిగడ్డ బరాజ్‌కు మరణశాసనం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇచ్చంపల్లి బరాజ్ నిర్మాణానికి ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రాష్ర్టాల కన్సల్టేషన్ మీటింగ్‌లో ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించిన ఏపీ కూడా అందుకు తాజాగా అంగీకారం తెలపడం కుట్రలను బయటపెడుతున్నది. ‘గోదావరి జలాల్లో మా వాటా జలాల మళ్లింపునకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పు కోం. ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటా జలాల వినియోగానికి ప్రాజెక్టులను చేపడుతున్నాం’ అంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తేల్చిచెప్పింది. వాటా జలాలకు ఎలాంటి నష్టం ఉండబోదని హామీ ఇస్తే ఇచ్చంపల్లి నుంచి గోదావరి-కావేరీ లింక్ ప్రాజెక్టుకు అంగీకరిస్తామని తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి.
ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) భేటీలో ఆయా రాష్ర్టాలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. జీసీ లింక్ ప్రాజెక్టుపై బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలతో 6వ కన్సల్టెంట్ మీటింగ్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్‌ఫోర్స్ కమిటీ, సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం జలసౌధలో నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల అధికారులు నేరుగా సమావేశానికి హాజరుకాగా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల అధికారులు హైబ్రిడ్ మోడ్‌లో హాజరయ్యారు. ఒడిశా అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. ఈ భేటీల్లో జీసీ లింక్‌పై ఆయా రాష్ర్టాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుపై రాష్ర్టాలు లేవనెత్తుతున్న సాంకేతిక అంశాలపై చర్చించారు.
కర్ణాటక రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడుతూ ఈక్విటబుల్ రేషియో ప్రకారం తమకు మళ్లింపు జలాల్లో 45 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నదని, కనీసం 40 టీఎంసీలైనా కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. తుంగభద్ర డ్యామ్ పూడికతో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, బేడ్తి వార్దా లింక్‌తో తమకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని, దానికి బదులు తుంగభద్ర ఎగువన ప్రత్యేకంగా ఒక ఇంట్రా లింక్ ప్రాజెక్టు ఇవ్వాలని, జీసీ లింక్‌లో తమను భాగం చేయవద్దని కర్ణాటక తేల్చిచెప్పింది.
మహారాష్ట్ర తరఫు ప్రతినిధులు మాట్లాడుతూ గోదావరి, కృష్ణాలో అత్యధిక పరీవాహక ప్రాంతం తమదేనని, అయినా తమకు చుక నీటిని కూడా కేటాయించకపోవడం ఏమిటని నిలదీశారు. జీసీ లింక్‌లో నీళ్లు ఇవ్వకున్నా ఫర్వాలేదని, కానీ, ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని 41 టీఎంసీలను వాడుకునేందుకు తాము ప్రతిపాదిస్తున్న ఇంట్రా లింక్ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదీగాక ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నుంచి కృష్ణాకు తరలించే జలాల్లో ఎకువ వాటా తమకే ఇవ్వాలని తేల్చిచెప్పారు.
ఇచ్చంపల్లి బరాజ్‌తో మేడిగడ్డ బరాజ్‌కు తీవ్ర ముప్పు వాటిల్లనున్నది. అయినా ఆ ప్రతిపాదనలకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అంగీకారం తెలిపింది. భేటీలో ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ (గోదావరి) సుబ్రహ్మణ్యప్రసాద్ పాల్గొన్నారు. ఇచ్చంపల్లి నుంచి జీసీ లింకును చేపట్టేందుకు అంగీకరించారు. మళ్లించే 148 టీఎంసీల జలాల్లో తెలంగాణకు కేవలం 45 టీఎంసీలే (27శాతం) కేటాయించారని, అవి సరిపోవని 74 టీఎంసీలు (50శాతం) ఇవ్వాలని రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. తెలంగాణకు మళ్లించే జలాలను ఏ బేసిన్లోనైనా వాడుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, నీటి కోటా వినియోగానికి రెండు రిజర్వాయర్లను కేంద్రమే నిర్మించి ఇవ్వాలని కోరారు.
గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలకు రక్షణ కల్పించాలని, జలాల మళ్లింపునకు తొలుత ఛత్తీస్‌గఢ్ నుంచి అంగీకారం తీసుకోవాలని తెలిపారు. దిగువ గోదావరిలో తెలంగాణ వాటా జలాల వినియోగానికి తొలి ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే జీసీ లింక్‌లో మళ్లింపు చేపట్టేలా చూడాలని స్పష్టంచేశారు. సమ్మకసాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా ఆపరేషన్ ప్రొటోకాల్ షెడ్యూల్‌పై సిమ్యులేషన్ స్టడీస్ చేయాలని వెల్లడించారు. ఇచ్చంపల్లి నుంచి సాగర్‌కు నీటిని సరఫరా చేసేందుకు కాలువ తవ్వకం కోసం తెలంగాణలో చాలా వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ ముంపును తగ్గించాలని కోరారు.
నీటిని నేరుగా సాగర్ ప్రాజెక్టులోకి తీసుకెళ్లకుండా టెయిల్‌పాండ్‌కు తరలించి అకడి నుంచి తీసుకెళ్లాలని సూచించారు. జీసీ లింక్‌లో కర్ణాటకకు అదనంగా 16 టీఎంసీలు కేటాయించారని, అయితే నీటిని ఎక్కడి నుంచి వినియోగించుకుంటారనేది చెప్పలేదని, ఒకవేళ కృష్ణా బేసిన్లో రీప్లేస్మెంట్ పేరిట వినియోగానికి అనుమతిస్తే అది జూరాల ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని, దీనిపై స్పష్టతనివ్వాలని కోరారు. జీసీ లింక్‌లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకునేలా అనుమతివ్వాలని తెలంగాణ కోరింది.
ఏపీ ప్రతిపాదించిన మరో 4 ఇంట్రా లింక్ ప్రాజెక్టులు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్, బాబు జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను తెలంగాణ వ్యతిరేకించింది. వాటిని తిరస్కరించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు స్పష్టంచేసింది. ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర సంస్థలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసింది. అన్ని రాష్ట్రాలూ సమ్మతించాకే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలిపింది.
భేటీల్లో ఏపీ తరఫున జలవనరులశాఖ ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తి పాల్గొన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదని, అన్ని రాష్ర్టాల వినియోగాలను పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తే తమ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని తెలిపారు. జలాల మళ్లింపునకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అంగీకారం తీసుకోవాలని చెప్పారు. ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి అంగీకరిస్తున్నట్టు తెలిపారు. పోలవరం నుంచే గోదావరి- కావేరీ లింక్‌ను చేపట్టే ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
గోదావరి నుంచి జలాలను మళ్లించి సాగర్, సోమశిల ప్రాజెక్టుల్లో వేయాలన్న ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయా జలాశయాల్లో తమకు క్యారీ ఓవర్ స్టోరేజీ ఉన్నదని, ఆ వాటాలు తేల్చాలని, లేదంటే ఇతర రాష్ర్టాలూ వాటా అడిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి అకడి నుంచి నీటి తరలింపు సులువు కాదని వెల్లడించారు. తుంగభద్ర బేసిన్‌లోని కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించారు.
ఈ భేటీలో ఛత్తీస్‌గఢ్ సీఈ బండారి పాల్గొని తమ రాష్ట్ర అభిప్రాయాన్ని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని జలాలనే ప్రస్తుతం తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్ ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి గోదావరి జలాల్లో 301 టీఎంసీలను కేటాయించిందని, అందులో ఇప్పటికే 164 టీఎంసీలను వివిధ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. మిగిలిన వాటా జలాల వినియోగానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా 100 టీఎంసీల వినియోగానికి బోద్ ఘాట్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును చేపడుతున్నామని వివరించారు.
ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్తు ఉత్పత్తితో పాటు 4 లక్షల హెక్టార్లకు సాగునీటిని, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటామని తేల్చిచెప్పారు. మొత్తంగా ట్రిబ్యునల్ అవార్డు మేరకు తమ వాటా నీటిని తాము వినియోగించుకుంటామని స్పష్టంచేశారు. ఇక ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మిస్తే తమ రాష్ట్రంలో 170.6 హెక్టార్ల భూమి, 4 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. జౌర్నాల పాయింట్ వద్ద ఒడిశాను ఒప్పించి ప్రాజెక్టును నిర్మించి అందులో 50 శాతం నీటి వినియోగానికి అనుమతివ్వాలని కోరారు.
జీసీ లింక్ ప్రాజెక్టుపై రాష్ర్టాలు వెల్లడించిన అభిప్రాయాలను ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ అతుల్‌జైన్ స్పందించారు. రాష్ర్టాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటినీ దాదాపు తోసిపుచ్చారు. తెలంగాణ కోరిన మేరకు మళ్లింపు జలాల్లో 50 శాతం వాటా ఇవ్వడం కుదరదని కరాకండిగా తేల్చిచెప్పారు. అదీగాక ఛత్తీస్‌గఢ్ లేవనెత్తిన అంశాలకు జవాబిచ్చారు. ఆ రాష్ట్ర వాటా జలాలను ముట్టుకోబోమని వెల్లడించారు. ప్రస్తుతం జీసీ లింక్‌లో మళ్లించేవి గోదావరి జలాలుగానే భావించవద్దని, హిమాలయ నదుల నుంచి గోదావరికి మళ్లించబోయే జలాలను తరలిస్తున్నట్టుగా భావించాలని సూచించారు.
ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాల వినియోగానికి మరో 15 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుందని, అప్పటివరకు హిమాలయ నదుల నుంచి జలాలను గోదావరికి మళ్లిస్తామని తెలిపారు. అప్పటివరకు గోదావరి జలాలను తాత్కాలికంగానే జీసీ లింక్ కోసం మళ్లిస్తామని, ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఎప్పుడైతే నీటిని వినియోగించుకుంటుందో అప్పటి నుంచి జీసీ లింక్ ద్వారా నీటి తరలింపు నిలిపేస్తామని వివరించారు. అప్పటి వరకు జీసీ లింక్‌లో తాతాలికంగానే ఛత్తీస్‌గఢ్ నీటిని వాడుకుంటామని స్పష్టంచేశారు. గోదావరిలో ఒక చుక కూడా వాడుకోబోమని స్పష్టంచేశారు. అన్ని రాష్ర్టాలూ పెద్దమనసు చేసుకుని ముందుకు రావాలని, జీసీ లింక్ ప్రాజెక్టుకు అంగీకారం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టాలు ప్రతిపాదిస్తున్న ఇంట్రా లింక్ ప్రాజెక్టులను తోసిపుచ్చారు.
నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)లో భాగంగా తీసుకున్న ప్రాజెక్టులకే కేంద్రం నిధులు సమకూర్చుతుందని, అందులో భాగంగా ఏ ప్రాజెక్టుకూ నిధులు సమకూర్చబోదని తేల్చిచెప్పారు. త్వరలోనే అన్ని రాష్ర్టాలతో మరోసారి కన్సల్టేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా జీసీ లింక్ ప్రాజెక్టుకు తమిళనాడు, పుదుచ్చేరి ఇప్పటికే అంగీకారం తెలిపాయి. సమావేశానికి ఒడిశా, మధ్యప్రదేశ్ దూరంగా ఉన్నాయి. భేటీలో ఎన్‌డబ్ల్యూడీఏ సీఈ దేవేందర్‌రావు, తెలంగాణ తరఫున ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఇంటర్‌స్టేట్ ఎస్ఈ విజయ్ కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.