2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు?
13 నెలలుగా ఉద్యోగుల వాటా, తన వాటా జమ చేయని ప్రభుత్వం
ఇప్పటికే 2,600 కోట్లపైగా నష్టపోయిన రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు
నెలకు రూ.200 కోట్లు చెల్లించకుండా రేవంత్ సర్కారు తాత్సారం
భవిష్యత్తులో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం.. ఉద్యోగుల ఆందోళన
సీపీఎస్ రద్దు హామీని అటకెక్కించి.. ‘భవిష్య నిధి’తో బంతాట!
డీఏ ఎరియర్స్ సైతం వాయిదాపద్దతిలో జమ చేస్తున్న ప్రభుత్వం
హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. 13 నెలలుగా సాగుతున్న ఈ తతంగంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ):‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేస్తాం. పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేస్తాం’ ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అక్కడితో ఆగలేదు. అంతకుమించిన అన్యాయాన్ని చేస్తూ వారి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్నది. ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయిన సీపీఎస్ సొమ్మును వారి ప్రాన్ అకౌంట్లో జమ చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను జమచేయడం పక్కనపెడితే.. ఉద్యోగి నెలవారీ జీతం నుంచి రికవరీ చేసిన వాటాను కూడా జమచేయడంలేదు.
ఇదేదో ఒక నెల, రెండు నెలలు కాదు, ఏకంగా 13 నెలల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నది. 2024 జనవరి నుంచి నవంబర్ 2024 వరకు 11 నెలలు, 2025 ఏప్రిల్, మే రెండు నెలలు కలిపి మొత్తంగా 13 నెలల వాటాను సర్కారు చెల్లించలేదు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. . రాష్ట్రంలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులంతా సీపీఎస్ పరిధిలోకి వస్తారు. వీరి మొత్తం వేతనంతోపాటు డీఏ నుంచి 10 శాతం ఉద్యోగి వాటాగా, మరో 10 శాతం ప్రభుత్వవాటాగా ప్రాన్ అకౌంట్లో జమచేస్తారు. దీనిపై వడ్డీ వస్తుంది. షేర్మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు వీటికి అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం 2.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరు సీపీఎస్ పరిధిలోకే వస్తారని చెప్తున్నారు. వీరి వేతనం నుంచి ఉద్యోగి వాటాగా నెలకు రూ. 100 కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ.100 కోట్లు మొత్తంగా రూ. 200 కోట్లు ప్రాన్ అకౌంట్లకు జమచేయాల్సి ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, 13 నెలలుగా అకౌంట్లలో జమ కాలేదు. అంటే రూ.2,600 కోట్లను ప్రభుత్వం సొంతానికి వాడుకున్నదన్నమాట. వీటికి వడ్డీ కూడా లెక్కిస్తే అదనంగా మరో రూ. 260 కోట్లు కలుస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితంగా సీపీఎస్ ఉద్యోగులు తమ వాటాతోపాటు, ఆ వాటాపై వచ్చే వడ్డీని కూడా నష్టపోయారు. ప్రాన్ అకౌంట్లోని మొత్తంపై సగటున 9-10 శాతం వడ్డీ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ 13 నెలల్లో కోల్పోయిన వడ్డీయే అక్షరాలా రూ. 260 కోట్లుగా అంచనా. ఉదాహరణకు.. ఓ టీచర్ జీతం నుంచి ఉద్యోగి వాటాగా రూ.12 వేలు, ఎంప్లాయర్ (ప్రభుత్వ వాటా)గా రూ.12 వేలు మొత్తం రూ.24 వేలు ప్రతి నెల ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో జమకావాలి. కానీ, జమ కావడంలేదు. అంటే.. రూ.24 వేలపై నెలకు 10 శాతం వడ్డీ అంటే నెలకు రూ.2,400 వడ్డీని ఆ ఉద్యోగి కోల్పోతున్నారన్నమాట. ఇలాగే రాష్ట్రంలోని 2.2 లక్షల మంది అసలుతోపాటు వడ్డీని కూడా నష్టపోతున్నారు.
సీపీఎస్ విధానంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా రెండింటిని ప్రాన్ అకౌంట్లల్లో జమచేసి, 9-10శాతం వడ్డీతో సహా అంతా ప్రతి నెలా షేర్మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఎస్బీఐ, ఎల్ఐసీ, ఐసీఐసీఐ యూటీఐ పెన్షన్ఫండ్ మేనేజర్లు పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారు. ఈ షేర్లు కొనడంతో లాభాలు వస్తే ఆయా లాభం ఉద్యోగుల ఖాతాలోకి వస్తుంది. 13 నెలలుగా ఉద్యోగి వాటా, సర్కారు వాటా చెల్లించకపోవడంతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లభించే ఆదాయాన్ని కూడా ఉద్యోగులు కోల్పోతున్నారు. ఉద్యోగి రిటైర్డ్ అయితే, ఆయా ఉద్యోగికి సంబంధించి ప్రాన్ అకౌంట్లో ఎంత వరకు జమచేశారో అంతే మొత్తాన్నే తీసుకుని మొత్తం పెన్షన్‌ను నిర్ధారిస్తారు. వాటాను జమ చేయకపోవడంతో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక ఉద్యోగి రిటైర్డ్ అయితే జమ అయిన మొత్తం నుంచి 60 శాతం నగదుగా ఇస్తారు. 40 శాతాన్ని మళ్లీ షేర్మార్కెట్లో పెడతారు. దీని నుంచే పెన్షన్ అందుతుంది. దీంతో ఉద్యోగికి అందే మొత్తం నగదు, పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం పొంచి ఉంది.
సీపీఎస్ ఉద్యోగుల సొమ్ము వాటాను ప్రభుత్వం జమ చేయడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక ప్రయోజనాలు అడగవద్దని బహిరంగంగానే ప్రకటించారు. తనను కోసుకుతిన్నా రూపాయి లేదని కుండబద్దలు కొట్టారు. ఈ 13 నెలల సొమ్మును భవిష్యత్‌లోనూ వాటా సొమ్ము జమ చేస్తారా? అంటే అనుమానంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఉద్యోగులు నెలకు రూ. 2600 కోట్లు, వడ్డీ, షేర్‌మార్కెట్ లాభాలను నష్టపోవాల్సిందే. గతంలో పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ పొందే సమయంలో డ్రా చేసిన జీతంలో సగం పెన్షన్‌గా అందేది. కానిప్పుడు నెలకు రూ.1500 -2000 పెన్షన్‌గా అందనున్నది. ఉద్యోగి, సర్కారు వాటా వాటాను జమచేయకపోతే ఇక అది కూడా అందని ద్రాక్షేకానున్నది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం.. ఉద్యోగి నుంచి వసూలు చేసిన కంట్రిబ్యూషన్‌ను అతడి ప్రాన్ అకౌంట్లో మొత్తం జమయ్యే వరకు వేచిచూడాల్సి వస్తున్నది. ఎప్పుడైనా ఆపదకో, సంపదకో విత్‌డ్రా చేసుకుందామంటే కూడా ఆ అవకాశం లేదు. పెండింగ్‌లోని మొత్తం ప్రాన్ అకౌంట్లో జమ అయితేనే విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం జమ అయితేనే పెన్షన్ ప్లాన్‌ను పర్చేజ్ చేసుకునే చాన్స్కోల్పోయినట్లే.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పాత పింఛన్‌ను అమలుచేస్తామని హామీనిచ్చింది. ఏకంగా మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా కనీసం సీపీఎస్ రద్దు మాటే ఎత్తడం లేదు. ఇదిలా ఉంటే 2003 డీఎస్సీ టీచర్ల పాలిట సీపీఎస్ శాపమైంది. డీఎస్సీ నోటిఫికేషన్ 2003లో ఇచ్చినా, ఉద్యోగాలను 2004లో భర్తీచేశారు. వాస్తవానికి నోటిఫికేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని సీపీఎస్‌ను అమలుచేయాల్సి ఉండగా, కానీ పోస్టింగ్ తేదీ ఆధారంగా సీపీఎస్‌ను అమలుచేయడంలో ఆయా టీచర్ల పాలిట శాపంగా మారింది. దీంతో వీరంతా బలవంతంగా సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. ఈ ఘోర పాపానికి కాంగ్రెస్‌పార్టీయే కారణం.
ఉద్యోగుల డీఏ ఎరియర్స్ కూడా జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా ప్రాన్ అకౌంట్లో జమకావడంలేదు. గతంలో ఇచ్చిన ఒక డీఏ ఏరియర్స్ 17 నెలల ఇన్స్టాల్మెంట్స్లో ఐదు మాత్రమే పూర్తయ్యాయి. 12 నెలలవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన డీఏ ఎరియర్స్‌ను 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. అదే జీపీఎఫ్ వారికి డీఏ బకాయిలు మొత్తం ఒకే సారి జీపీఎఫ్‌కు జమచేస్తున్నారు. ఎరియర్స్ కూడా ఇన్స్టాల్మెంట్లోనా అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో వారం రోజుల్లో జూలై 1న మరో డీఏ పెండింగ్‌లో పడుతుంది. దీంతో పెండింగ్ డీఏలు ఐదుకు చేరుతాయి. అటూ డీఏలు, ఇటూ ఎరియర్స్ రెండు బకాయిలు పడటం ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి. ఈ విధానం రద్దు చేసే వరకు నిర్దేశిత సమయంలో ఉద్యోగి వాటా, రాష్ట్రవాటాను జాప్యం చేయకుండా ప్రాన్ అకౌంట్లల్లో జమచేయాలి. ప్రాన్ అకౌంట్లల్లో జమ చేయకపోవడంతో ఉద్యోగులంతా నష్టపోతున్నారు. డీఏ ఏరియర్స్‌ను ఇన్స్టాల్మెంట్లల్లో చెల్లించడం వల్ల కూడా నష్టం జరుగుతున్నది. డీఏ బకాయిలను కూడా జీపీఎఫ్ తరహాలో ఒకేసారి చెల్లించాలి.
– నరేందర్‌రావు, టీఎస్ సీపీఎస్ఈయూ
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ హామీని విస్మరించింది. పైగా 13 నెలలుగా ఉద్యోగులు, ప్రభుత్వ వాటాను ప్రాన్ అకౌంట్లో జమ చేయకపోవడం అత్యంత దారుణం. డీఏ ఎరియర్స్‌ను ఇన్స్టాల్మెంట్లల్లో ఇవ్వడంతో మేం నష్టపోతున్నాం. ఒక సీపీఎస్ ఉద్యోగి నెలకు మూడు బిల్లులు చేయాల్సి వస్తున్నది. సీపీఎస్ విధానం ఉద్యోగులకు శాపంగా మారింది. దీని నుంచి విముక్తి కల్పించాలి.
– హన్మాండ్ల భాస్కర్, టీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి