(దమ్మక్కపేట నుంచి కడపత్రి ప్రకాశ్‌రావు) కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ రూరల్ : ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగాల్సిన దుస్థితి వచ్చింది. కాళేశ్వరం నీళ్లిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ సర్కారు నిర్వాకం రైతులకు శాపంగా మారింది. నిన్నమొన్నటి దాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న అన్నదాతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని రేవంత్ సర్కారు తెచ్చింది. ఎలాంటి గొడవలు లేకుండా పచ్చగా ఉన్న గ్రామల్లో సాగునీటి చిచ్చు పెట్టింది. సరిపడా నీళ్లివ్వని సర్కారు వైఫల్యం కారణంగా ఊర్ల మధ్యన ఘర్షణలు తలెత్తుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో అనుభవించిన సాగునీటి కష్టాలు, నీటి పంచాయితీలు పునరావృతమవుతున్నాయి.
ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడం, కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో కాకతీయ కెనాల్ పరిధిలో వేసిన వేలాది ఎకరాల పంటలు నెర్రెలు బారుతున్నాయి. కండ్ల ముందే పచ్చని పొలాలు ఎండిపోతుంటే అన్నదాతల గుండెలు అవిసిపోతున్నాయి. ఈ క్రమంలో అరకొర నీటికి కొందరు అడ్డుకట్ట వేయడం, పక్కన రైతులు వాటిని తొలగించే క్రమంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేట-కాట్రపల్లి గ్రామాల్లో సాగునీటి కోసం రెండు రోజులుగా ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదుల నీటిని నమ్ముకొని సాగుచేసిన ఈ రెండు గ్రామాలకు సాగునీరివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆ ఊర్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వివాదం కాస్తా చినికిచినికి గాలివానలా మారడంతో ఏకంగా ఇరు గ్రామాల రైతుల పంచాయితీ హుజూరాబాద్ ఠాణాకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామస్థుల్లో నెలకొన్నది.
కాట్రపల్లి-దమ్మక్కపేట గ్రామాల రైతులు.. దేవాదుల నీటిని ఆధారంగా చేసుకొని పంటలు సాగుచేస్తారు. దేవాదుల నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వచ్చే నీటిని ఉత్తర కాలువ ద్వారా ఈ గ్రామాల రైతులు వినియోగించుకుంటారు. కాలువ పరిధిలో రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 300 ఎకరాల వరకు సాగు చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీరు అంతంత మాత్రంగానే రావడంతో వచ్చిన నీటిని ఒడిసి పట్టుకొని పొలాలను కాపాడుకొనేందుకు రైతులు స్వచ్ఛందంగా దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి, ఇటీవలే కాలువ పూడిక తొలగించుకున్నారు. అయినా వచ్చే నీరు సరిపోవడం లేదు. వేసిన పొలాలు కండ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేక రెండు రోజుల క్రితం కాట్రపల్లి రైతులు, దమ్మక్కపేటకు నీరు వెళ్లకుండా కెనాల్‌కు అడ్డుకట్ట వేసి, వారి పొలాలకు మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతో దమ్మక్కపేట రైతులు అడ్డుకట్టను తొలగించే ప్రయత్నంలో ఇరు గ్రామాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. ఒక దశలో కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఇరు గ్రామాల రైతులు దూషణలకు దిగడంతో గొడవ పెద్దదిగా మారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పి పంపించేశారు. తిరిగి తెల్లవారి అవే పరిస్థితులు నెలకొనడంతో పంచాయితీ కాస్తా మంగళవారం హుజూరాబాద్ ఠాణాకు చేరింది. రెండు గ్రామాల రైతులు ఓపిక పట్టాలని చెప్పిన పోలీసులు, బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లారు. ఏసీపీ మాధవి ఆదేశాల మేరకు సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు, ఇరు గ్రామాల రైతులను పిలిచి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా సరిపడా సాగునీరిచ్చి పొలాలు ఎండకుండా చూస్తామని అధికారులు గాని, సర్కారు గాని హామీ ఇచ్చిన దాఖలాల్లేవు. బుధవారం క్షేత్రస్థాయికి ఇరిగేషన్ అధికారులు వచ్చినా, సాగునీరు సరిపోయేంత ఇస్తారా? ఇవ్వరా? అన్నదానిపై స్పష్టత ఇవ్వకుండానే వెళ్లిపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ పాలనలో నీటి ఘర్షణలు మచ్చుకు కూడా కనిపించకుండా పోయాయి. కాలువలకు గండ్లు కొట్టడం.. నీటిని మళ్లించుకోవడం, రైతులు ఘర్షణలకు దిగడం లాంటి సందర్భాలు కనుమరుగయ్యాయి. దశాబ్దాలుగా రైతులు పడ్డ సాగునీటి గోసను కేసీఆర్ తీర్చడం, అనుకున్న దానికంటే పుష్కలంగా నీళ్లివ్వడంతో రైతులు రంది లేకుండా బతికారు. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయడంతో ఎక్కడా పొలాలు ఎండిపోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు పోయి మళ్లీ పాతరోజులు వచ్చాయి.
రెండేండ్ల క్రితం వరకు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం ద్వారా సజీవ నదిగా కనిపించిన వరద కాలువ, నేడు చుక్కనీరు లేక ఎడారిగా మారింది. కాలువలో నీళ్లు లేకపోవడం, కాలువకు తూములు పెట్టి, చెరువుల్లోకి నీళ్లను మళ్లించే పరిస్థితి లేకుండా పోవడంతో జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కథలాపూర్, కోరుట్ల, భీమారం, మేడిపల్లి, మల్యాల మండలాల్లో కాలువ పరీవాహక ప్రాంత రైతుల పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాట్లు వేసిన పొలాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టు (రాజరాజేశ్వర జలాశయం) వరకు 122 కిలోమీటర్ల పొడవునా వరద కాలువ వెంట ఉన్న అనేక మండలాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇంత వరకు సరైన వరద రాలేదు. ప్రాజెక్టు ఇప్పటి వరకు దాదాపు పూర్తి సామర్థ్యమైన 81 టీఎంసీల నీటి మట్టానికి చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 40 టీఎంసీలే ఉన్నాయి. అది కూడా గత నెల చివరి వారంలో ఎగువ ప్రాంతంతోపాటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో పడిన భారీ వర్షాల వల్ల ఆ మాత్రం నీరు చేరింది. 40 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో వరద కాలువకు నీటిని వదలడం సాధ్యం కాని పనిగా మారింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఉన్న గాయత్రి పంప్‌హౌస్‌కు నీటిని తరలించి, అక్కడి నుంచి నీటిని గ్రావిటీ కాలువ ద్వారా రెండున్నర కిలోమీటర్లు తీసుకెళ్లి, షానగర్ సమీపంలో వరద కాలువకు అనుసంధానం చేస్తారు. వరద కాలువ 102వ కిలోమీటర్ వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటరీ గేట్లను ఎత్తితే నీరు దిగువన ఉన్న మిడ్ మానేరుకు చేరుతుంది. ఒకవేళ క్రాస్ రెగ్యులేటరీ గేట్లను ఎత్తకుండా నీటి విడుదలను కొనసాగిస్తే నీరు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువ 73వ కిలోమీటర్ వద్ద నిర్మించిన మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి 34వ కిలోమీటర్ వద్ద నిర్మించిన మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు చేరుతాయి. అక్కడి నుంచి ప్రాజెక్టుకు పది మీటర్ల దూరంలో నిర్మించిన ముప్కాల్ పంప్‌హౌస్‌కు అక్కడి నుంచి ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. అయితే మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యను మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాలకు చెందిన వరద కాలువ పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.
ఈ నెల 4న ఎల్లంపల్లి నుంచి నీటిని రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌస్‌కు ఎత్తిపోశారు. దాదాపు 12 గంటల పాటు పంపులు నడిపించారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి నీటిని వరద కాలువకు తరలించారు. అయితే 102వ కిలోమీటరు వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటరీ గేట్లను మూసివేయడంతో నీరు దిగువన మిడ్ మానేరుకు వెళ్లలేదు. పునర్జీవ పథకం ద్వారా నీరు వరద కాలువ ఎగువ భాగానికి చేరుకున్నది. మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్ వద్ద గేట్లు వేయడంతో నీరు అక్కడి వరకు నిలిచిపోయింది. వరద కాలువ 73వ కిలోమీటర్ నుంచి 102వ కిలోమీటర్ మధ్యలో మాత్రమే నీరు మీటర్ మందంలో నిలిచిపోయింది. ఈ ప్రక్రియను రాంపూర్ ఎగువ ఉన్న వరద కాలువ మండలాల రైతులు, ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. 73వ కిలోమీటర్ ఎగువన, 102వ కిలోమీటర్‌కు దిగువన ఉన్న రైతులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
ప్రభుత్వం తీరు వల్ల కేవలం చొప్పదండి నియోజకవర్గంలోని కొన్ని మండలాల రైతులకే ప్రయోజనం కలిగేలా ఉన్నదని, మెట్పల్లి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో ఉన్న వరద కాలువ పరీవాహక మండలాల రైతులు రైతులు కాదా? వారి పంటలు పంటలు కాదా? అని ఆయా మండలాల రైతులు ప్రశ్నిస్తున్నారు. మేడిపల్లి, భీమారం, కథలాపూర్, మెట్పల్లి మండలాల్లోని వరద కాలువ జీవం లేకుండా తయారైందని. కాలువలో చుక్క నీరు కనిపించడం లేదని వాపోతున్నారు. వరద కాలువలోకి నీళ్లు వస్తాయి, చెరువులు నిండుతాయి, ఊటలు పెరుగుతాయి అని భావించిన తమను ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటి విడుదలలో సర్కారు వివక్షను ఎండగడుతూ వేములవాడ, కోరుట్ల నియోజకవర్గాల పరిధి రైతులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. కథలాపూర్ మండలంలో కొద్దిరోజుల క్రితం కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నీరు ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరసన విరమించారు. కానీ కేవలం వరద కాలువలో కొంత భాగానికి నీరు నింపి మిగిలిన చోట నీరు నింపకపోవడంపై రైతులు విస్మయానికి గురవుతున్నారు. ఈ విషయమై శుక్ర, శనివారాల్లో రైతులు, ప్రజలు నిరసనలకు దిగేందుకు సమాయత్తమవుతున్నారు.
రాష్ట్రంలో మళ్లీ సమైక్య పాలన నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ప్రస్తుతం కాట్రపల్లి -దమ్మక్కపేట రైతుల ఘర్షణ మాత్రమే బయటకు వచ్చినా, ఇలాంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో ఉండేవి. రాత్రికి రాత్రి కాలువలకు గండ్లు పెట్టి, రైతులు తమ పొలాలకు నీటిని తీసుకెళ్లేవారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కాకతీయ కెనాల్- దాని ఉపకాలువలకు అనేక సార్లు గండ్లు పెట్టారు.
దీంతో అప్పట్లో రైతులపై కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం గోదావరిలో వందలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఎస్సారెస్పీ నుంచి కూడా నీటిని విడుదల చేయడం లేదు. ఫలితంగా ఎస్సారెస్పీ పరిధిలోని వేలాది ఎకరాల్లో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఇటు వర్షాలు లేక.. అటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు రాక పచ్చని పొలాలు ఎండు ముఖం పడుతున్నాయి. మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటే హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని, చొప్పదండి తదితర నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి అయినా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయే ప్రమాదమున్నది.
నాకు 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. బుద్ధితెలిసినప్పటి సంది దీన్నే నమ్ముకొని బతుకుతున్న. ఒకప్పుడు మా కథలాపూర్ నాన్ ఆయకట్టు మండలంగా ఉండేది. అప్పుడు వ్యవసాయం పెద్దగా సాగేది కాదు. మా కథలాపూర్ అంటేనే కరువు మండలంగా పేరుగాంచింది. కథలాపూర్ మండలమే కాదు, మెట్పల్లి, మేడిపల్లి, భీమారం మండలాల రైతుల పరిస్థితి కూడా ఇదే. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊరు పరిస్థితి మెరుగైంది. వ్యవసాయం మంచిగ చేసుకునే పరిస్థితులు వచ్చినయి. నాడు సీఎం కేసీఆర్ వరద కాలువకు తూములు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు కాలువకు డైరెక్ట్‌గా మోటర్లు పెట్టుకునే అవకాశం కల్పించిండు. వరద కాలువను ఏడాది పొడవునా నింపి ఉంచిండు. అయితే ఎస్సారెస్పీ నీళ్లతోటి లేదంటే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసి వరద కాలువను జీవనదిగా మార్చిండు. దీంతో రైతులు పుష్కలంగా పంటలు సాగు చేసిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరువును తెచ్చింది. -తీపిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి. కథలాపూర్
నాకు పదెకరాల భూమి ఉన్నది. ఒకప్పుడు బతుకుదెరువు కోసం దుబాయి పోయిన. తెలంగాణ వచ్చినంక వరద కాలువకు తూములు పెట్టి, కాళేశ్వరం నంచి రివర్స్‌లో ఎత్తిపోసి నీళ్లు వరద కాలువలకు తెచ్చి, తూములతోటి నీళ్లిచ్చుడు మొదలు పెట్టినంక మాకు మంచిరోజులు వచ్చినయి. బతుకుదెరువుకు దేశం పోవుడు బంద్‌పెట్టి ఇక్కన్నే ఎవుసం చేసుకుంటున్న. ఉన్నంతలో అందరం కలిసి మంచిగనే ఉన్నం. వరద కాలువ నిండా నీళ్లతోటి యాడాది పొడవునా ఉండటం, కాలువకే మోటర్లు పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి ఉండటంతో నాలుగైదేండ్ల సంది రంది లేకుండ పోయింది. వరద కాలువల నీళ్లు యాడాది మొత్తం ఉండటంతో మా పొలాల వద్ద మోట బావులు, బోర్లల్లో నీటి ఊట ఎక్కువైంది. 24 గంటలు కరెంట్ ఉండటంతో పుష్కలమైన పంట పండింది. అంతా మంచిగా సాగుతుందన్న నమ్మకం ఏర్పడ్డది. ఇంతలోనే ఎలక్షన్లు వచ్చి కేసీఆర్ సర్కారు పోంగనే మాకు ఇబ్బంది మోపైంది. కాళేశ్వరం నీళ్లు బందైనయ్. వరద కాలువను కాంగ్రెసోళ్లు ఎండవెట్టిండ్రు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు కాకతీయ కాలువకే వచ్చేటట్టు లేవు. ఇగ వరద కాలువకు ఎట్ల వస్తయి? కాలువ ఎండిపోవడంతో మా మోటర్లు బంద్ పడ్డయి. భూగర్బజలాలు ఇంకిపోయినయి. బోర్లు నడుస్తలేవు. నీళ్లు ఊరుత లేవు. అంతా కరువు లెక్క అయ్యింది. పది రోజుల కింద వేసిన పొలం మొత్తం నాశనమైంది. ఎట్ల బతుకుడో అర్థమైతలేదు.