HCU Lands | కొండాపూర్, ఏప్రిల్ 9: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు తమవేనంటూ టీజీఐఐసీ బుధవారం రాత్రికిరాత్రే సూచిక బోర్డును ఏర్పాటుచేసింది. భూములపై వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతుండగా దొంగల్లా సూచికబోర్డులు ఏర్పాటుచేయడంపై వర్సిటీ అధ్యాపక, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీ కనీసం పరిశీలనకు రాకముందే భూములు తమవేనంటూ బోర్డులు ఏర్పాటుచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే బుల్డోజర్లతో ఆ భూముల్లోని అడవులను తొలగించి, వన్యప్రాణుల ఆవాసాన్ని తుడిచిపెట్టారని, భవిష్యత్తులో భూములను కూడా తమ లాభాల కోసం వ్యాపారులకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన భూములపై పూర్తి హక్కులు తమవేనని, ఎట్టి పరిస్థితుల్లో ఇంచు భూమిని కూడా వదులుకునేది లేదని హెచ్చరించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో నివాసం ఉంటున్న వన్యప్రాణుల ఫొటోలతో ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, భూములపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫొటోల్లో ఉన్నవి ఏఐ సాయంతో సృష్టించినవి కావని, ఇక్కడే అడవుల్లో ఉంటున్న వన్యప్రాణుల ఫొటోలని, వాటిని కూడా విద్యార్థులు స్వయంగా తీసినవని ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు.