రవీంద్రభారతి, ఆగస్టు 17 : కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టితో ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నయాపైసా ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు కూడా ఇవ్వలేదని, ఇది సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ సర్పంచ్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావ కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గ్రామీణ వ్యవస్థను అభివృద్ధి చేశారని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో భూముల రేట్లు పదింతలు పెరిగేలా చేశారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ భూములతోపాటు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘గ్రామపంచాయతీలకు సంబంధించిన జనరల్ ఫండ్స్, పన్నుల ద్వారా వసూలైన నిధులపై ఉన్న ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎస్ఎఫ్సీ (స్టేట్ ఫైనాన్స్ కమిషన్)నిధులను విడుదల చేయాలి. గ్రామాల్లో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. సర్పంచ్ల జేఏసీ గ్రామీణ సమస్యలపై పోరాడి పల్లెల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుర్వి యాదయ్యగౌడ్, వివిధ జిల్లాల అధ్యక్షులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీల పాలనలో ఆటంకాలను తొలగించి, గ్రామ స్వరాజ్యసాధనకు దోహదపడేలా ఉప సర్పంచ్‌లకు వర్తింపజేస్తున్న ఉమ్మడి చెక్‌పవర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పదవీ బాధ్యతలు స్వీకరించి ఎనిమిది నెలలు కావస్తున్నా, ఆర్థిక అధికారాలు లేక సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపింది.
ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్నయాదవ్ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిషారానికి సర్పంచ్‌లు తమ సొంత డబ్బు వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సర్పంచ్‌లు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నజరానాలు వెంటనే విడుదల చేయాలని, సర్పంచ్ల నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.23 వేలకు పెంచడంతోపాటు మరో 8 డిమాండ్లు నెరవేర్చాలని లేఖలో కోరారు.