TIMS | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది. ఈ భవనాన్ని స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దవాఖాన భవనాలు, స్థలాలను యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయనున్నది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టిమ్స్‌ను వైద్యాధికారులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్)కు అప్పగించాలని ఉత్తర్వుల్లో సూచించింది. జాతీయ, అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లకు అక్కడ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రాభవాన్ని కోల్పోయిన గచ్చిబౌలిలోని క్రీడా గ్రామాన్ని దవాఖానగా మార్చాలని నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన 1261 ఐసీయూ బెడ్లు, అధునాతన వైద్య పరికరాలతో దవాఖానగా మార్చింది. ఇందులో ప్రతిరోజూ వేలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడింది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఇక్కడి దవాఖానను ఆధునీకరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా నగరానికి నలుమూలల అత్యాధునిక టిమ్స్‌ను నిర్మించాలని భావించి 2024 ఏప్రిల్‌లో అప్పటి సీఎం కేసీఆర్ సనత్‌నగర్, బొల్లారం, అల్వాల్‌లో టిమ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌ను ఆధునీకరించారు. అప్పటి నుంచి ఇక్కడ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చడంపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానలను మించి ఇక్కడ వైద్యమందిస్తు న్న తరుణంలో క్రీడాగ్రామంగా ఎందుకు మా రుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ మార్క్ ను చెరిపేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తు న్నారని ఎక్స్, ఫేస్బుక్ వేదికగా నెటిజన్లు కాం గ్రెస్ సర్కారు తీరుపై మండిపడుతున్నారు.