Bharat Summit | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రెండు రోజులు.. 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు.. స్టార్ హోటళ్లలో బస ఏర్పాట్లు… వెరసి రూ.30 కోట్లకుపైగా ఖర్చు. ఇవీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్-2025 కార్యక్రమ విశేషాలు. కాంగ్రెస్ ఎజెండాలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు శుక్రవారం ప్రారంభంకానున్నది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తూ నిర్వహిస్తున్న సదస్సు వల్ల తెలంగాణ ప్రజలకు, ఒనగూరె ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎజెండాను అమలుచేసేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్ సమ్మిట్ ఎజెండాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. దేశంలో రాజ్యాంగం పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సమన్యాయం తదితర అంశాలపై భారత్ సమ్మిట్‌లో చర్చిస్తామని మంత్రులు చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు పెట్టి ఇలాంటి అంశాలపై చర్చించడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి తెలంగాణ అప్పులపాలైందని, దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నది. తద్వారా దేశ, అంతర్జాతీయ వేదకలపై తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీసిందనే విమర్శలున్నాయి. అప్పుల పేరుతో నిన్న, మొన్నటివరకు తెలంగాణను బద్నాం చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని నవ్వులపాలు చేయాలనే కంకణం కట్టుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సు పెట్టి మరీ చర్చించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తున్నది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల ముందు భారత్‌ను తక్కువ చేసి చూపుతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదంటూ రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రచారాన్ని అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఈ సదస్సుకు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ముఖ్యులు హాజరై ప్రసంగించనున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాకుండా ప్రభుత్వ సమావేశం ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
భారత్ సమ్మిట్‌కు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం చెప్తున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నట్టు సమాచారం. ఈ సదస్సును హెచ్ఐసీసీ నోవెటాల్ హోటల్లో నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న అతిథులకు స్టార్ హోటళ్లలో లగ్జరీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలున్నాయి. ఈ నిధులను మొత్తం తెలంగాణ సర్కారే భరిస్తున్నట్టు తెలిసింది. రైతులకు పరిహారం, రైతుభ రోసా, రుణమాఫీకి డబ్బుల్లేవంటున్న సర్కారు.. రాష్ట్ర ప్రజలకు ఉపయోగంలేని సదస్సుకు రూ.30 కోట్లు పెట్టి నిర్వహించడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.