మంచిర్యాల, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేసిన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎలాంటి అనుమతులులేకుండా చేసిన ధర్నాతో పలువురు ఇబ్బందులు పడ్డారని హెడ్‌కానిస్టేబుల్ అన్వర్‌హుస్సేన్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు సహా 30 మందిపై 189(2), 126(2), 132,ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. అదే రోజు కాంగ్రెస్ నాయకులు సైతం బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేశారని, వారిపై ఏం కేసులు పెట్టారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ధర్నా చేస్తే వచ్చిన ఇబ్బందులు కాంగ్రెస్ నాయకులు చేసినప్పుడు రాలేదా అంటూ ప్రశ్నించారు. న్యాయం కోసం ధర్నా చేస్తే కేసులు నమోదు చేయడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు పేర్కొన్నారు.