హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ) : ఐఏఎస్ అమోయ్‌కుమార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందిన అమోయ్‌ను ప్రభుత్వం వేధించడం దారుణమని మండిపడ్డారు.గత ప్రభుత్వం భూములకు అక్రమం గా క్లియరెన్స్ ఇచ్చి ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని, అలా చేయకుండా అమోయ్‌కుమార్‌ను బద్నాం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వేధింపులు మానకపోతే బీసీ సంఘాలన్నీ ఏకమై అమోయ్‌కు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై కేసు నమోదు చేసి, భూ రిజిస్ట్రేషన్ల అక్రమాలపై విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీజీపీ జితేందర్‌ను కలిశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటివరకు అమోయ్ కుమార్‌తోపాటు ఎమ్మార్వో జ్యోతి, మాజీ ఆర్డీవో వెంకటాచారిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణకు సంబంధించిన వివరాలను శుక్రవారం డీజీపీకి వివరించినట్టు తెలిసింది. ఆ సమాచారాన్ని సీఎస్ శాంతికుమారికి పంపి, కేసుల నమోదుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్ర పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్లు, వాటిపై జరిగే దర్యాప్తు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదుకు ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయగా తెలిసింది.