హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘పేదల వైద్యం విషయంలో రాజీపడం. పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు వైద్య సేవలను బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం. రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యరంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తాం.’ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని శాసనమండలి సాక్షిగా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్), నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం.. 14,633 వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి.
కానీ, రాష్ట్రంలో 5,625 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల కొరత 38%గా ఉన్నది. ఏటా నియమించే వైద్యుల సంఖ్య 250-300 దాటడం లేదని, ఇలా అయితే ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు 12 ఏండ్లు పడుతుందని వైద్యులు వాపోతున్నారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ పరిధిలో 723 పోస్టులు మంజూరు కాగా, 578 మంది వైద్యులు పనిచేస్తున్నారు. ఈ శాఖ పరిధిలో 145 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్) పరిధిలో 1,818 పోస్టులు మంజూరు కాగా, 1,503 మంది వైద్యులు పనిచేస్తున్నారు. ఈ విభాగం పరిధిలో 315 ఖాళీలు ఉన్నాయి. ఇక వీటి నియామకాలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం గమనార్హం. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో 4,347 పోస్టులు మంజూరు కాగా, 1,968 మంది వైద్యులు పనిచేస్తుండగా.. 2,379 ఖాళీలు ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో 7,745 పోస్టులు మంజూరు కాగా, 2,786 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 2,410 నియామక దశలో ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.
డీఎంఈ పరిధిలోని టీచింగ్ దవాఖానల్లో వైద్యుల కొరత వైద్య విద్యకు సవాల్‌గా మారింది. కొన్ని విభాగాల్లో జీరో ఫ్యాకల్టీ సమస్య వేధిస్తున్నట్టు సర్వేలో తేలింది. డీఎంఈ పరిధిలో 2,786 పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రభుత్వం కేవలం 607 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. డీఎంఈ పరిధిలో 607 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నియామకాలు చేపట్టకపోవడంతో దవాఖానల్లో వైద్యుల కొరత నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో ముందుచూపుతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్యుల నియామకాలు చేపట్టడం లేదు. టీచింగ్ దవాఖానల్లో 1,200 మంది వైద్యులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, వారి కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. నియామకాలు చేపట్టాలని వైద్యవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.