హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలతో తమ బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు నీళ్లు లేక, పంటలు పండక పొలాలు బీళ్లుగా మారాయని, ఒక్కో గ్రామంలో వందలాది ఎకరాలు పడావుగా ఉండేవని గుర్తుచేస్తున్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టు కట్టడమే కాకుండా కొండపోచమ్మసాగర్ వరకు రిజర్వాయర్లు నిర్మించి నీళ్లను నింపడం, ఆ నీటిని చెరువులకు మళ్లించడంతో భూగర్భజలాలు పెరిగాయని చెప్తున్నారు.
చెరువులు నిండుగా ఉండటం, బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు రావడంతో బీడు భూములనేవే లేకుండా పోయాయని చెప్తున్నారు. ఒకప్పుడు చెప్పుకునేందుకు ఎకరాల కొద్దీ భూములున్నా వానలపైనే ఆధారపడి ఒకటి రెండు ఎకరాల్లో పంటలు వేసి నష్టపోయేవారిమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత భరోసా పెరిగిందని, తమ పొలాలు మొత్తం పండించడంతోపాటు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. అమ్ముకొని పోదామనుకున్న పొలాలనే నమ్ముకొని బతికేలా భరోసా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాళేశ్వరంలో నీళ్లు నిలపకపోవడంతో యాసంగి పంటలకే ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా నీరందక చాలా వరకు భూములను ఎండబెట్టారని చెప్తున్నారు. తాము చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలను పండించామని, ఏడాదికాలంగా కాళేశ్వరం జలాలు రాకపోవడంతో చెరువులు, బావులు అడుగంటి పోయాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందు వర్షాలు సమృద్ధిగా కురవకపోతే పంటలను మధ్యలోనే వదిలేసేవాళ్లమని, పెట్టుబడులు చేతికి రాక అప్పుల్లో కూరుకుపోయేవాళ్లమని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వాడుకలోకి తేకపోతే మళ్లీ పాతరోజులు ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఏడాదికాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు కాళేశ్వరంను పడావు పెట్టి గోదావరి నీటిని దిగువకు వదిలేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ప్రజల కడుపుకొట్టే ప్రయత్నం మానుకోవాలని, కాళేశ్వరంను మళ్లీ వినియోగంలోకి తేవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
మర్కూక్, జూన్ 21: కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ పచ్చబడిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి శనివారం నాటికి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి పూలుచల్లి పూజలు చేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా తలపించేదని అన్నారు. ఎడారిగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ నిర్మించి రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సాగు,తాగు నీరు అందించినట్టు తెలిపారు. ప్రస్తుత అసమర్థ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ర్టానికి అన్నం పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందలు మోపడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు కారణంగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లేటోళ్లం. కేసీఆర్ కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్లొచ్చినయి. పదేండ్లు ఏ రందీ లేకుండా పంటలు పండించుకున్నం. వానకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా మా పొలాలకు పుష్కలంగా నీళ్లు అందాయి. కోతలు అయినంక కూడా మా మళ్లల్లో నీళ్లు చూసినం. కాళేశ్వరం ద్వారా మా చెల్క భూముల్ని పొలాలుగా మార్చుకున్నం. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికి వస్తున్నది. మొన్న ఎండా కాలంలో నీళ్లు లేక మా పొలాలు మొత్తం ఎండిపోయినయ్.
– ధరావత్ మోతీరాం, పాచ్యానాయక్ తండా, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా
మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించకముందు మా ఊర్లో కొద్దిపాటి వడ్లు పండేవి. ఇప్పుడు మా ఒక్క ఊర్లోనే 100 లారీల వడ్లు పండుతున్నాయి. ఊర్లో వరి, మక్క, పొద్దుతిరుగుడు, చిక్కుడు, మిర్చి ఇతర కూరగాయపంటలనూ సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు పంట దిగుబడులు కూడా పెరిగాయి. మా ఊరికి, మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు మధ్యలో కూడవెళ్లి వాగు ఉండటంతో ఎడాదిపాటు గోదావరి నీళ్లతో వాగు నిండుకుండలా కనినిస్తుంది. మా అహ్మదీపూర్ పెద్ద చెరువులో ఐదు మీటర్ల వరకు మట్టి తీశారు. దాంతో ఎప్పుడూ ఎండిపోకుండా నీళ్లతోనే కళకళలాడుతున్నది. కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుతోనే రైతుల బతుకులు మారాయి. 24 గంటల కరెంట్‌తో రైతులు పొలాల వద్ద పడుకునే అవసరం లేకుండా పోయింది. ఎన్ని తరాలు మారినా కేసీఆర్ చేసిన మంచి పనులను ప్రజలు మరిచిపోరు.
– మంద స్వామి, అహ్మదీపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా
శ్రీరాంసాగర్ కాల్వలో నీళ్లు రాకుంటే పరిస్థితి ఆగమే ఉండేది. కొరిపెల్లి గ్రామంలో 4.10 ఎకరాల భూమి ఉంటే బోరు ద్వారా 1.20 ఎకరాల భూమిలో పొలం వేసి, మిగతా దాంట్లో పత్తి వేసిన. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక కాల్వల్లో నీళ్లు పుష్కలంగా రావడంతో ఉన్న పొలమంతా సాగు చేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఈసారి యాసంగిలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడినం. కాల్వ మీద ఆధారపడి రూ.60 వేలు ఖర్చు చేసి కాల్వ నుంచి పొలం వరకు పైప్‌లైన్ వేసిన. ఇప్పుడు కాల్వ పారకుంటే అన్ని విధాలా నష్టపోతా.
-దోనాల రత్నాకర్‌రెడ్డి, కొరిపెల్లి గ్రామ రైతు
నాకు ఎకరన్నర భూమి ఉన్నది. అరెకరంలో చిక్కుడు, అరెకరంలో బెండ, మరో అరెకరంలో వరివేశాను. గతంలో చౌదరిపల్లిలోని బంధం చెరువు నిండితేనే మా బాయిలో నీళ్లుండేవి. పంటచేతికొచ్చే సమయానికి ఎండిపోయేవి. కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ మా ఊరు పక్క నుంచే పోతున్నది. చౌదర్పల్లి బంధంచెరువు నిండటంతో 180 ఫీట్లకే బోరు పడింది. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు పుణ్యమా అని ఎప్పటికీ నీళ్లుంటున్నాయి. అప్పుడు అమ్ముకొని పోదామనుకున్న భూముల్నే నమ్ముకొని బతికేటట్టు చేసిండు కేసీఆర్.
– మొగుళ్ల శ్రీను, సింగాయిపల్లి , సిద్దిపేట జిల్లా
కేసీఆర్ కడుపు సల్లగుండ.. ఆయన పాలనలోనే మాకు వడ్ల గింజలు పండినయ్. రైతులందరి ముఖాలు కొద్దికొద్దిగా తెల్లబడుతుండే. మాయదారి కాంగ్రెస్ సర్కారు వచ్చినంక ఏడాదిన్నరలోనే కాట్రపల్లి రైతులమంతా కష్టాలు పడుతున్నం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మైలారం పెద్ద చెరువు (బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. మా ఊరి చెరువులు, కుంటలు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఊరేది. నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది. పదేండ్లు వానకాలం, యాసంగి పంటలు పండించిన. కాళేశ్వరంను పక్కన పెట్టినంక వానకాలంలో కూడా నీళ్లు లేక రెండు ఎకరాల భూమి బీడు పెట్టుకొని ఒక ఎకరమే నాటేసుకున్న. యాసంగి అయితే ఉన్న మూడు ఎకరాలు పడావు పెట్టిన.
– బెల్లి రాజు, కాట్రపల్లి, వరంగల్ జిల్లా
కేసీఆర్ ఇచ్చిన నీళ్ల సౌలత్తోనే రైతులు పుష్కలమైన వరి సాగు చేస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును మా ఊరి పక్కనే నిర్మించడంతో పంటల సాగుకు అనువుగా ఉన్నది. మా ఊర్ల 300 మంది రైతులు 1300 ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను నిర్మించక ముందు బోర్లలో నీళ్లు లేక సగానికిపైగా పంట ఎండిపోయేది. పుష్కలంగా నీళ్లు ఉండటంతో పైపులేసుకొని పంటలు పండించుకుంటూ బతుకుతున్నాం. గతంలో మా ఊర్లో ఐదు లారీల వడ్లు పండితే.. ఇప్పుడు పంటకు 50 నుంచి 55 లారీలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నాం. నేను 16 ఎకరాల్లో వరి పంట వేశాను. కౌలుకు తీసుకొని మరో 20 ఎకరాల్లో వరి, మక్క పంటలు వేశాను.
– పంజ రాజమల్లు, సింగాటం, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీళ్లు లేక రైతులు వ్యవసాయం వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్, బొంబాయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడింది. నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఒక్క ఎకరం మాత్రమే వరి పండించాను. కాళేశ్వరం కట్టిన తర్వాత మా ప్రాంతంలో కాల్వల ద్వారా పుష్కలమైన నీళ్లు రావడంతో 4 ఎకరాల భూమి మొత్తం సాగు చేసిన.
– గుంటి రవికుమార్, బొల్లంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా
కేసీఆర్ పుణ్యమా అని కాశేశ్వరం ప్రాజెక్టు కట్టాక గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. మా గ్రామంలో 60 ఏండ్ల నుంచి పడావుగా ఉన్న బంజరు భూమిని 2021లో సాగు భూమిగా మార్చుకున్నం. మా గ్రామంలోని వట్టికుంట చెరువు కింద ఒకప్పుడు 300 ఎకరాల ఆయకట్టులో 50 ఎకరాలే సాగయ్యేది. ఆరు దశాబ్దాల తర్వాత 2021లో తొలిసారి 300 ఎకరాల్లో పంటలు పండాయి. గతంలో రూ.లక్ష కూడా విలువ చేయని భూముల ధరలు ఇప్పుడు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం మళ్లీ అస్తవ్యస్తంగా మారింది.
– బెడద కర్ణాకర్, మామిడాల, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా
గోదావరిపై బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే సాగునీరు వచ్చేదికాదు. పంటల సాగు కష్టమయ్యేది. మాకు వ్యవసాయమే జీవనాధారం. చిన్నప్పటి నుంచి సాగుచేస్తున్న. వేములపల్లి శివారు పాలేరు వాగు వద్ద నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. కాళేశ్వరం కట్టకముందు భారీ వర్షా లు పడితేనే వాగు పారి, బావులు, బోర్లలో నీటి ఊటలు వచ్చేవి. పత్తి, మిరప, వరి సాగుచేసేటోళ్లం. కాళేశ్వరం కట్టిన తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా పాలేరు వాగు కళకళలాడుతూ రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ప్రాజెక్టు నిర్మించకపోతే పంటలు పండకపోవు.
– కన్న అంతయ్య, కుమ్మరికుంట్ల, మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలినాళ్లలోనే తొలి సీఎం కేసీఆర్ గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణకు సాగునీటిని అందించారు. గోదావరి తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయింది. గోదావరిపై నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి సాగునీళ్లు వస్తున్నాయి. కాళేశ్వరం మా సాగు కష్టాలను తీర్చింది.. కన్నీళ్లు తుడిచింది.
– గుండా ప్రతాప్‌రెడ్డి, దామెర, హనుమకొండ జిల్లా
మా ఊరికి కాల్వల ద్వారా గోదావరి నీళ్లు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. కేసీఆర్ మా రైతుల పాలిట దేవుడు. రైతుల కోసం దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెచ్చిండు. మా గ్రామానికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం నీళ్లు రావడం మా అదృష్టం. నాలుగేండ్లుగా మా గ్రామంతో పాటు పక్క ఊళ్లకూ గోదావరి నీళ్లు పారడం సంతోషంగా ఉన్నది. నాకు ఐదెకరాల భూమి ఉంటే.. కాల్వలో ఒక ఎకరం భూమిని కోల్పోయాను. దానికి సంబంధించిన ప్రభుత్వ పరిహారం అందింది. ఇపుడు పొలం పక్క నుంచి కాల్వ ద్వారా నీళ్లను చూస్తే.. కడుపు నిండినట్టుగా ఉన్నది. భూమి పోయిన బాధ కంటే కాల్వల ద్వారా పంటకు నీళ్లు రావడమే ఎక్కువ సంతోషంగా ఉన్నది. కాళేశ్వరం నీటితో పుష్కలంగా రెండు పంటలు పండించుకుంటున్నాం.
– వీరబోయిన మైసయ్య, అప్పనపల్లి, సిద్దిపేట జిల్లా
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాతే వర్ధన్నపేట ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా వచ్చింది. కాల్వల ద్వారా ఎగువ ప్రాంతానికి దేవాదుల, ఎస్సారెస్పీ ఉప కాల్వల ద్వారా కింది ప్రాంతానికి నీరు సమృద్ధిగా రావడంతో పంటలు బాగా పండినయి. వరితోపాటు వాణిజ్య పంటలు కూడా పండించినం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక యాసంగికే నీళ్లు రాలేదు. చాలావరకు పంటలు వేసుకోలేదు. కాళేశ్వరం మీద కాంగ్రెస్ లేనిపోని కుట్రలు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే రైతులకు తిప్పలే. వెంటనే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలి. లేకపోతే పంట భూములు బీళ్లుగా మారుతాయి.
– నాంపెల్లి వెంకన్న, ఆదర్శ రైతు, వర్ధన్నపేట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ గడ్డ సస్యశ్యామలమైంది. బీఆర్ఎస్ పాలనలో నడి వేసవిలో సైతం కాళేశ్వరం నీటితో పంట పొలాలు పచ్చగా ఉండగా, చెరువులు మత్తళ్లు దుంకాయి. ఒక్క ఎకరం కూడా ఎండిన సందర్భాలు లేవు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మళ్లీ రైతు ఆత్మహత్యలు, వలసలు పెరిగి తెలంగాణ రాష్ట్రం వెనకబడే ప్రమాదం పొంచి ఉన్నది.
– గంట సమ్మిరెడ్డి, రైతు, వెల్లంపల్లి, హనుమకొండ జిల్లా
కాల్వ కింద, చెరువు కింద, బావి కింద కలిపి నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. అయినా నీళ్లు అందకపోయేవి. నా వయసున్నోళ్లు ఎంతోమంది వలస పోయినరు. కొందరు భూమిని అగ్గువకు అమ్ముకున్నరు. కాల్వల్లోకి నీళ్లు రాక, తుమ్మలు మొలిచినయి. మాకు వలసలే గతయ్యాయి. 2014 తర్వాత మా దశ మారింది. కేసీఆర్ సీఎం కాగానే చెరువుల్లో పూడికతీసి, కాల్వలు మంచిగ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మా జీవితాలు మలుపు తిరిగినయి. రికాం లేకుండా కాల్వల నిండా నీరు వచ్చింది. చూద్దామన్నా బీడు భూములు కనబడడలేదు. రాళ్లు, రప్పలను చదును చేసుకొని మళ్లీ పొలంబాట పట్టినం. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు కోరల్లో కొట్టుమిట్టాడింది. మబ్బులు చూసి వ్యవసాయం చేసే రోజుల నుంచి కాలంతో పనిలేకుండా మూడు పంటలు పండించుకున్నం. మాకు మేలు చేసిన కేసీఆర్‌ను ఎప్పటికీ మరువం.
-బత్తిని చెన్నయ్య, రైతు, కురవి
మా భూములన్నింటికీ రంగనాయకసాగర్ కాలువ నీళ్లే ఆధారం. సాగర్ నుంచి చినరాయుని చెరువులోకి నీళ్లు వదలక ముందు వానకాలం పంట మాత్రమే పండేది. యాసంగిలో 5,10 గుంటలు మాత్రమే పంటవేసే వాళ్లం. అది కూడా మధ్యలోనే ఎండిపోతుండె. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక రెండు పంటలు పుషలంగా పండుతున్నాయి. గుర్రాలగొందిలో పెదరాయుని, చిన్నరాయుని చెరువులు గోదావరి నీళ్లతో నింపడంతో పుషలంగా పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండటం లేదన్న వారు గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. కాళేశ్వరం లేకపోతే రైతుకు బతుకుదెరువు లేదు.
– బోయిని స్వామి, గుర్రాలగొంది, సిద్దిపేట జిల్లా