నిన్నటిదాకా రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం.. చివరిపాట కూడా పాడేసింది! ‘రుణమాఫీ పూర్తయ్యింది. వందశాతం అమలు చేసేశాం’ అన్న సీఎం ప్రకటనతో అవాక్కవడం రైతుల వంతయ్యింది. కనీసం నాల్గో జాబితాలోనైనా తమ పేరు వస్తుందనుకుని ఆశగా ఎదురుచూసిన రైతులు చివరకు హతాశులయ్యారు.
సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. సర్కారు ధోకాపై కన్నెర్ర చేశారు. ‘రుణమాఫీ ఎవరికైంది? మా సంగతేంది?’ అంటూ ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. ఇక2 లక్షలపైన రుణం ఉన్న రైతుల పరిస్థితి మరీ దారుణం. సర్దిచెప్పేవారు లేరు. సమాధానం చెప్పేవారూ లేరు.
Runa Mafi | రాష్ట్రప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో అందరికీ రుణమాఫీ జరిగినట్టు సీఎం రేవంత్ సహా మంత్రులు చెబుతున్నారు. అయితే చాలా మంది రైతులు మాత్రం తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ. 2 లక్షలలోపు రుణం తీసుకున్నా తమకెందుకు కావడం లేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
సాంకేతిక కారణాలు చెబుతూ అధికారులు దాటవేస్తున్నా, అన్నదాతలు మాత్రం అయోమయంలో పడ్డారు. మూడు విడతల్లో పేరు రాని వారు నాలుగో విడత జాబితా కోసం ఎదురు చూశారు. అందులో అయినా తమ పేరు వస్తుందేమోనని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తమకు మాఫీ ఎందుకు కాలేదో తెలియడం లేదంటూ పలువురు రైతులు ‘నమస్తే తెలంగాణ’తో తమ మనోవేదనను ఇలా పంచుకున్నారు.
నా రుణం మాఫీ కాలేదేం?
‘రైతులమందరం దరఖాస్తు చేసుకున్నం. రెండు నెలలక్రితమే ఇంట్లో అందరి ఆధార్ కార్డులు ఇచ్చినం. అయినా రుణమాఫీ కాలేదు. అట్లాంటప్పుడు అప్లికేషన్లు ఎందుకిచ్చినం? అంత సక్కగ ఉంటే గిట్లెందుకైతది’ అంటూ నర్సింహులపేట రైతువేదికలో ఏవో వినయ్ కుమార్‌ను సోమవారం నిలదీశారు మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం స్టేజీ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొబ్బ అశోక్‌రెడ్డి. దంతాలపల్లి మండలంలోని ఏపీజీవీబీ శాఖలో తన పేరిట లక్షా 70వేల పంట రుణం ఉన్నదని, రేషన్‌కార్డులో పేరు లేదనడంతో రెండు నెలలక్రితం దరఖాస్తు కూడా ఇచ్చానని తెలిపారు. అయినా ప్రభుత్వం చెప్తున్నట్టు తనకు రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనతోపాటు దరఖాస్తు చేసుకున్న 300 మంది రైతులకూ మాఫీ కాలేదని వాపోయారు. – నర్సింహులపేట
నా బ్యాంకు ఖాతాకు జాటోత్ రమేశ్ అనే అతడి ఆధార్ కార్డు నంబర్‌ను అధికారులు నమోదు చేశారు. 4 నెలల నుంచి పీఏసీఎస్, ఏవో ఆఫీస్ చుట్టూ తిరిగితే తప్పును సరిదిద్దేందుకు దరఖాస్తు చేయమన్నారు. ఇప్పటి వరకు అధికారులు నా ఖాతకు వేరే వ్యక్తి ఆధార్ నంబర్ తొలగించకపోవడంతో నా రూ.55 వేల రుణం మాఫీ కాలేదు. పేద రైతులకు అన్యాయం చేస్తే కుటుంబం ఉసురు తుగులుతుంది.
-జేరిపోతుల రమేశ్, కొమ్ములవంచ రైతు
దంతాలపల్లి మండలం ఏపీజీవీబీ బ్యాంకులో రూ. 2.70 లక్షలు అప్పు తీసుకున్నా. రూ.2లక్షలకుపైన ఉన్న రూ.80వేలు బ్యాంకు లో చెల్లించి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. బ్యాంకులో కట్టిన 80 వేలు అప్పుగా తీసుకొచ్చిన. మిత్తి పెరుగుతున్నది.
– అజ్మీరా ఆశానాయక్, గోపతండా
బ్యాంక్ అధికారుల తప్పిదంతో రుణమాఫీ ఐత లేదు. పంట రుణం రూ.1.50 లక్షలు తీసుకు న్న. యూనియన్ బ్యాంక్ అధికారులు పంట రుణం రెండు సార్లు తీసుకున్నట్టు నమోదు చేసిన్రు. దీంతో రుణమాఫీ కావడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులతోపాటు కలెక్టర్‌ను కలిసి చెప్పినా ఫలితం లేదు. అధికారులు చేసిన తప్పును సరిదిద్దాలని కోరితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ నమోదులో ఎడిట్ ప్రక్రియకు అనుమతి ఇవ్వలేదని అధికారులు తిప్పుతున్నరు.
– పేర్ల రాకేశ్, మనుగొండ, వరంగల్
ఊకల్ రైతు సహకార సంఘంలో రూ. 55 వేల పంట రుణం ఉంది. రెండు సార్లు మాఫీ ప్రకటించిన జాబితాల పేరు లేదు. సహకార సంఘం సీఈవో, వ్యవసాయ అధికారులను అడిగితే ఆన్లైన్లో చెక్ చేసి నీ బ్యాంకు ఖాతాకు మరో రైతు ఆధార్‌కార్డు నంబర్ లింక్ అయిందని చెప్పిన్రు. వచ్చే జాబితాలో మాఫీ అయితదన్నరు. ప్రభుత్వం రూ. రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ చేశామని చెప్తున్నది కానీ నాకు రూ. 55 వేల మాఫీ రాలేదు.
-జిర్ర శరత్‌కుమార్, రైతు, మచ్చాపురం, వరంగల్
పరకాలలోని డీసీసీ బ్యాంకులో నా కుటుంబానికి రూ.1.8లక్ష ల లోన్ ఉన్నది. నా పేరు మీద రూ. లక్షా పదివేలు, కొడుకు పేరుమీద రూ. 74వేల రు ణం ఉన్నది. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలో నా పేరులో హెచ్ అనే అక్షరం తేడా ఉండగా, మా కొడుకు పేరు అనుదీప్ బదులు చిరుదీప్గా నమోదు కావడంతో రుణమాఫీ కాలేదు. రూ. సీఎం రేవంత్‌రెడ్డి ఏమో 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసినం అని అంటున్నడు.. నాకే మో రుణమాఫీ గాకపాయె.
– తాళ్లపల్లి సంధ్యారాణి, నర్సక్కపల్లి, నడికూడ, హనుమకొండ
2021లో శాయంపేట పీఏసీఎస్‌లో రూ.95వేలు రుణం తీసుకున్న. ఇప్పటి వరకు దీనిని రూ.1.42లక్షలు చేశారు. ఇందులో సీఈవో రూ.32వేలు అదనంగా కలిపి పెంచేశారు. కానీ నాకు రుణమాఫీ కాలేదు. నాభార్య స్వాతి పేర 2023 నవంబర్‌లో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాం. రూ.2లక్షల కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు కట్టాలని అధికారులను అడిగితే కట్టినా రుణమాఫీ జరగదు, ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. చాలా మంది భార్యాభర్తలు రూ.2లక్షల రుణం కోసం పైనున్న డబ్బులు చెల్లించారు. కానీ ఎవరికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పూర్తయినట్టు సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా రూ.2లక్షల రుణమాఫీని భార్యాభర్తలకు వర్తింపజేయాలి.
– దాసి శ్రావణ్‌కుమార్, రైతు, గోవిందాపూర్, శాయంపేట, హనుమకొండ
బ్యాంక్ ఆఫ్ బరోడా ఐనవోలు బ్రాంచిలో 2024 జనవరిలో నా పేరు మీద రూ. 99 వేలు, భార్య స్వరూప పేరు మీద రూ.95 వేల రుణం తీసుకున్న. ఇద్దరిదీ కలుపుకొని రూ. లక్షా 94 వేల రుణం ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాటలు నమ్మి బ్యాంక్‌లో రూ. 20 వేలు జమ చేసిన. అయినప్పటికీ లోన్ మాఫీ కాలేదు. మంత్రి నాగేశ్వర్రావు రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న అమౌంట్‌ను బ్యాంక్‌లో జమ చేయాలని చెప్పడంతో మా ఇద్దరి పేర్ల మీద రూ.20 వేల బ్యాంక్‌లో జమ చేశాం. అయినా రుణమాఫీ కాలేదు.
– పెంతల రవి, రైతు, ఒంటిమామిడిపల్లి, హనుమకొండ
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిం ది. నాకు 3ఎకరాల భూమి ఉంది. బ్యాంకు లో రూ.1.42 లక్షల రు ణం ఉండగా మూడో వి డతలో రుణమాఫీ కాలేదు. వ్యవసా యాధికారులు విచారణ చేసి రేషన్ కార్డులో పేరు లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదన్నరు. మా కుటుంబంలో నా ఒక్కడి పేరు మీదనే వ్యవసాయ భూమి, క్రాప్ లోన్ ఉంది. వ్యవసాయాధికారులు కుటుంబ వివరాలు సేకరించి కుటుంబ సభ్యుల నిర్ధారణ చేసుకుని కుటుంబంలో ఒకరికి మాత్రమే అప్పు ఉందని నిర్థారించి వివరాలను నమోదు చేసుకున్నారు. 4వ విడతలో కూడా రుణమాఫీ కాలేదు.
– మేకల యాదగిరి రైతు, నారాయణగిరి, ధర్మసాగర్, హనుమకొండ
నేను యూనియన్ బ్యాంకు ఊకల్ బ్రాంచి లో పంట రుణం తీసుకు న్న. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీసుకున్న రూ. 2లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. నేను, నా భార్య పేరుమీద ఉన్న 2లక్షల పైన ఉన్న రూ. లక్షా 36వేలను అప్పులు తీసుకొచ్చి ఆగస్టులోనే బ్యాంకులో రుణం కట్టినం. ఇప్పటి వరకూ రుణమాఫి కాలేదు. ముఖ్యమంత్రి, మంత్రులేమో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేశామంటున్నరు. రుణమాఫీ కాలేదు, రైతుభరోసా లేదు.. దీంతో మరింత అప్పుల పాలయ్యాం. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధుతో పంటల సాగుకు డబ్బులు సమయానికి సక్కగొచ్చేవి.
– కొనకటి మొగిలి, రైతు,మొండ్రాయి, సంగెం, వరంగల్
ఐదెకరాల వ్యవసాయభూమి ఉంది. యూబీఐలో పంట పెట్టుబడి కోసం క్రాప్‌లోన్ రూ. రెండు లక్షలు తీసుకున్న. రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో సంబురపడ్డ. మూడోవిడత రుణమాఫీ చేసేముందు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రెండు లక్షల లోపు క్రాప్‌లో న్ రుణాలుంటే మాఫీ చేస్తామని చెప్పడంతో అప్పు తెచ్చి కట్టిన. అయినా ఇప్పటి వరకు రుణమాఫీ కాలే. నా భార్య రాణి పేరిట రెండెకరాల వ్యవసాయభూమి ఉం ది. పంట పెట్టుబడికి ఆమె రూ. 90వేలు క్రాప్‌లోన్ తీసుకుంది. ఆ 90వేలు కూడా మాఫీ కాలే. ఒకే రేషన్ కార్డుపై ఒకరిది మాత్రమే మాఫీ చేస్తామని అధికారులు అంటున్నరు. నా పేర ఉన్న 2లక్షలు మాఫీ కాకున్నా, భార్య పేరుతోఉన్న 90వేలు మా ఫీ కావాలే కదా. విజయోత్సవాల పేరిట కళాకారులు వచ్చి రుణమాఫీ అయిందని చెప్పుతున్నరు. నాకేమో కాకపాయే.
-మేకల రవి, రైతు, లక్ష్మీపూర్, హనుమకొండ
మాకున్న భూమి మీద కొంచవెల్లి గ్రామీణ బ్యాంక్‌లో నా పేరున రూ.1.60 లక్షలు, భార్య పేరున రూ.లక్ష రుణం తీసుకున్నం. ఇద్దరికీ కలిపి రూ. 2 లక్షలు రుణమాఫీ చేసి మిగతా రూ. 60 వేలు కట్టమంటే కట్టేటోళ్లుం. ఇప్పుడు రూపాయి కూడా మాఫీ కాకపాయె. ఎన్నికలప్పుడు అందరికీ రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెసోళ్లు అధికారంలోకి రాగానే మాట మార్చిన్రు.
– ఇస్లావత్ గోపాల్, కల్వాడ, ఆసిఫాబాద్ జిల్లా
అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబీలో ఉన్న రూ 1.68 లక్షల పంట రుణం మాఫీ కాలేదు. రూ.2 లక్షలలోపు రుణమాఫీ జాబితాలో పేరు లేదు. మొదటి విడతలో రుణమాఫీ కాలేదని అధికారులను అడిగితే.. నీ భార్య, నీ పేరు కలిసి రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్నందున మాఫీ కాలేదని చెప్పారు. భార్య పేరుతో ఉన్న పంట రుణం మొత్తాన్ని మార్చిలోనే చెల్లించానని చెప్పగా బ్యాంకు నుంచి నోడ్యూ సర్టిఫికెట్ తెచ్చుకొని మరోసారి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మళ్లీ రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నా మాఫీ రాలేదు. ఇప్పుడు వ్యవసాయ, బ్యాంకు అధికారులను అడిగితే.. జాబితా పంపించామని చెప్పారు. రుణమాఫీ వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-పలగాని పుల్లయ్య, రైతు, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఏదులాపురం సొసైటీలో పంటరుణం తీసుకున్నా. అసలు వడ్డీ కలిపి రూ.1.50 లక్షలు అయ్యిందని సొసైటీ వాళ్లు చెప్పారు. పేరు కూడా పైకి పంపామన్నారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రెండు నెలలుగా తిరుగుతున్నా. నాలుగో విడత వచ్చిందంటే మళ్లీ వచ్చాను. దీంట్లో కూడాపేరు లేదు. నాతోపాటు రుణాలు తీసుకొని నాకంటే ఎక్కువగా వడ్డీ అయినోళ్లకు మాఫీ వచ్చింది. ఎవరిని అడగాలో తెలియడం లేదు.
-బోజెడ్ల కృష్ణయ్య, రైతు, మంగళగూడెం, ఖమ్మంరూరల్ మండల, ఖమ్మం జిల్లా
నాకున్న ఏడెకరాల పట్టా భూమిపై రవీంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో రూ. లక్షా 60 వేల క్రాప్ లోన్ తీసుకున్న. నాలుగు విడతల్లో రుణమాఫీ చేసినా ఏ లిస్టులోనూ నా పేరు రాలే దు. బ్యాంకుకు వెళ్లి అడిగినప్పుడల్లా వస్తదని చెప్పి పంపిన్రు. ఇప్పుడేమో అందరికీ రుణమాఫీ చేసినమంటున్నరు. ప్రాణహిత బ్యాక్ వాటర్‌లో పంటలు మునిగితే ఇప్పటి వరకు అధికారులు సర్వే చేసింది లేదు.
– రౌతు శంకర్, గూడెం, ఆసిఫాబాద్ జిల్లా
నారాయణపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1.60 లక్షల పం ట రుణం తీసుకున్న. రెగ్యులర్‌గా రెన్యువల్ చేశాను. బ్యాం కు, వ్యవసాయ శాఖ అధికారులు ఆధార్ కార్డులో బాలునాయక్ చవాన్‌గా ఉంది. బ్యాంకు ఖాతాలో లంబాడీ బాలుగా ఉంది. దీంతో రుణమాఫీ కా లేదని, రెండు నెలల కిందట అధికారులు పేర్లు సరిచేసి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిని. నా కొడుకు బీఆర్ఎస్ నుంచి సర్పంచ్‌గా గెలుపొందినా, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.
-బాలు నాయక్, రైతు, పిల్లిగుండ్ల తండా, నారాయణపేట జిల్లా