హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మూసీ వరదల్లో చిక్కుకుకుని మునిగిన బస్తీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను అనాథల్లా వదిలేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూసీ పరీవాహకంలోని మూసానగర్, శంకర్‌నగర్, వినాయకవీధి, అంబేద్కర్‌నగర్‌లో ఇండ్లలో నిత్యావసరాలు, సామగ్రి ధ్వంసమై మూడు రోజులుగా బస్తీల ప్రజలు తిండి లేక అవస్థలు పడుతున్నారు.
పునరావాసం, పరిహారం అందించాల్సిన రెవెన్యూ అధికారులు బస్తీల వైపు కన్నెత్తి చూడటంలేదు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ముంపు ప్రాంతాలను పరిశీలించడంలేదు. ప్రభుత్య అధికారులు స్పందించి నిత్యావసరాలు పంపిణీ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ధ్వంసమైన సామగ్రి కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తమ ఇండ్ల చుట్టూ తిరిగే ప్రజాప్రతినిధులు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటంలేదని మండిపడుతున్నారు.
మూసీ ముంపు బస్తీల్లో వరద మిగిల్చిన బురద మేటలను తొలగించి అధికారులు చేతులు దులుపుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, సామగ్రి వరద బురద పాలై నిరాశ్రయులమయ్యామని వాపోతున్నారు. మూడురోజులైనా ఒక్క అధికారి కూడా బస్తీల్లోకి రాలేదని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ అటువైపు కన్నెత్తి చూడలేదని, కనీసం సంబంధిత అధికారులను పంపించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు రాలేదని అంటున్నారు. వరద బాధితులకు అండగా ఉండి, పరిహారం చెల్లించాల్సిన కలెక్టర్ స్పందించకపోవడం దారుణమని వాపోతున్నారు. నిత్యావసరాలు, పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.