హైదరాబాద్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రూ.15 వేలు ఇస్తామన్న రైతుభరోసా నగదును కుదించి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతు, కూలీలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇచ్చారు? ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు? ఎన్నికోట్లు జమచేశారో? చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు సవాల్ విసిరారు. గతంలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమచేస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరమని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఏటా నాట్ల ముందే రైతుబంధు నగదు విడుదల చేశామని తెలిపారు. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓట్లకోసమే రైతుభరోసా ఇస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ బూటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.