హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : గురుకుల విద్యాలయాల్లో శానిటేషన్ వర్కర్లను తొలిగించి, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతోనే ఆ పనులు చేయించడం అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. విద్యార్థులతో శానిటేషన్ పనులు చేయించడం నేరమని బుధవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ఎస్సీ గురుకులా ల్లో చదివే పిల్లలు ‘ఏమైనా పోష్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్‌పైకి ఫుడ్ రాదు అనడం? ఎందుకు ఇలాంటి ప నులు చేయరు? వాటిని చేయాల్సిందే’ అని స్వయంగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారి అన డం దారుణమని విమర్శించారు. పిల్లల పట్ల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన ఆ అధికారిని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో కొనసాగుతున్న స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లను తొలిగించాలని కాంగ్రెస్ సర్కా ర్ నిర్ణయించడం దారుణమని ధ్వజమెత్తారు. ఆయా గురుకులాల్లో విద్యర్థులతో వెట్టిచాకిరీ చేయించాలని చూడటం అమానుషమని మం డిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వీపిం గ్, శానిటేషన్ కోసం ప్రతి గురుకులానికి రూ.40 వేలు కేటాయించారని, వాటితో తాత్కాలిక పద్ధతిలో నలుగురు సిబ్బందితో పనులు చేయించారని గుర్తుచేశారు. మే నెల నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ సర్కార్ తొలగించడంతో మరుగుదొడ్లు, ఇతర గదుల శుభ్రతతోపాటు గురుకుల పాఠశాల, హాస్టల్ ఆవరణలోని పనులన్నీ గురుకుల విద్యార్థులే చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులను తొలిగించడం తీవ్ర అన్యాయమని కవిత నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలోని 240 గురుకులాల్లో అసిస్టెంట్ కేర్టేకర్లను తొలిగించి, వారు చేసే వార్డెన్ పనులను అక్కడి విద్యార్థులతోనే చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటి వరకు వార్డె న్లే అన్నిరకాల పనులు చూసుకున్నా, విద్యార్థులు కమిటీగా ఏర్పడి, క్వాలిటీని చెక్ చేసుకునే సంప్రదాయం ఉండేందని, కానీ ఆ పిల్ల లే ఇక నుంచి వంటశాల నిర్వహణతోపాటు మెస్ పనులు కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. వివక్షల నుంచి తప్పించడానికే ఎస్సీ గురుకుల హాస్టళ్లు ఏర్పాటు చేసి, పిల్లలను చదివించేదని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యార్థులకు క్వాలిటీని మాత్రమే తనిఖీ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. పూర్తిస్థాయి వార్డెన్, శానిటేషన్ వర్కర్లు చేసే పనులను పిల్లలతో చేయించొద్దని కోరారు.