హైదzరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నమ్మి ఓట్లేసి గెలిపించిన రైతులను, హైకోర్టును ఒకే విషయంలో, ఒకేసారి మోసం చేయడం సాధ్యమా? ఫార్మాసిటీ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత సులువుగా ఈ ఘనతను సాధించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, భూములను తిరిగి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులను మభ్యపెట్టింది. ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ప్రకటించినా, భూములను తిరిగి ఇవ్వకుండా అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఇదే విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసం చేసింది. ఫార్మాసిటీని కొనసాగిస్తామంటూ హైకోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించింది. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందిన భూముల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అదే ‘ఫోర్త్ సిటీ’ అని అదే వేదిక మీద అధికారికంగా ప్రకటన చేసింది. ఒకవైపు హిల్ట్ పేరిట పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు 20వేల ఎకరాల్లో రూపుదిద్దుకోవాల్సిన పరిశ్రమల జోన్‌ను నామరూపాల్లేకుండా చేసి పారిశ్రామిక రంగాన్నే సర్వనాశనం చేసేందుకు నడుంబిగించింది.
రద్దు చేస్తున్నాం.. చేయలేదు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటును చేపట్టిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించి.. 14వేల పైచిలుకు భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకుంది. ఒకవేళ ఫార్మాసిటీకి కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే రైతులు తమ భూములను తిరిగి పొందవచ్చనే నిబంధనను పొందుపరిచింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు సాధించింది. ఈ మేరకు దాదాపు 300-400 వరకు ఫార్మా కంపెనీలు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములను తిరిగి ఇస్తుందని రైతులు ఎంతో సంబురపడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. ఫార్మా సిటీని రద్దు చేశామని ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు అనేకసార్లు పరోక్షంగా ప్రకటించారు. దీంతో షరతు మేరకు తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం నాలుక మడతేసింది. రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మా సిటీని రద్దు చేశామని రైతులు భ్రమ పడుతున్నారంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హైకోర్టును తప్పుదోవ పట్టించింది.
ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్త డ్రామా
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టింది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోని బేగరికంచె వద్ద సీఎం రేవంత్ రెడ్డి ‘ఫోర్త్ సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 150 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఫార్మా సిటీ భూములను ఒకదాని తర్వాత ఒకటిగా ఇతర అవసరాలకు కేటాయిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు వేలాది ఎకరాల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ మేరకు పలు సమావేశాలు, సభల్లో సీఎం, మంత్రులు ప్రకటనలు కూడా చేశారు. కానీ కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం బయటికి రానీయడం లేదు. ఇందులో ఏ ఒక్క ఉత్తర్వు బయటికొచ్చినా హైకోర్టు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠ గంగపాలు కావడం ఖాయం. ప్రజాపాలన అంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వులను సైతం తొక్కిపెట్టడం గమనార్హం.
అంతర్జాతీయ వేదికపై మోసం బట్టబయలు
తాజాగా గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు పంపిన ఆహ్వానాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫార్మా సిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ వేదిక, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకుంది. అంటే ఫార్మా సిటీ భూముల్లోనే ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా అంగీకరించింది. సమ్మిట్ ముగింపులో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగిస్తూ 13,500 ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన 13,500 ఎకరాల్లోనే ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అంగీకరించినట్లయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ఏమనిచెప్పింది?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తం..సంబంధిత రైతులకు భూములను తిరిగి ఇస్తం.
హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిందేమని?
రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నం.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీని రద్దు చేసినమని రైతులు భ్రమ పడుతున్నరు.
ఇప్పుడు సర్కారు చెప్తున్నదేంటి?
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది. 13,500 ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
నమ్మి ఓటేసిన రైతులను.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మోసం చేస్తున్న సర్కారు తీరు అంతర్జాతీయ వేదికగా బట్టబయలైంది.