Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేసింది. ఈ సారి ఏకంగా భూములను తనఖా పెట్టి మరీ రూ.పది వేల కోట్లు అప్పు చేసింది. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి టీజీఐఐసీ ద్వారా ఈ అప్పు చేసింది. రేవంత్రెడ్డి సర్కారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు రూ.1.37 లక్షల కోట్ల అప్పుచేసింది. ఇదే పద్ధతిలో అప్పులు కొనసాగిస్తే కాంగ్రెస్ ఐదేండ్ల పాలన పూర్తయ్యేనాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరనున్నది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ 30 వరకు కేంద్రం విధించే రుణ పరిమితి (ఎఫ్ఆర్బీఎం) మేరకు ఆర్బీఐ నుంచి రూ.52,118 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్ 3న రూ.2,000 కోట్లు, డిసెంబర్ 17న మరో రూ.1,500 కోట్లు రుణం పొందారు. డిసెంబర్ 31న మరో రూ.409 కోట్లు తీసుకొనేందుకు ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొన్నారు. వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటూ రూ.61,991 కోట్లు పొందారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా తీసుకున్న రుణాలు రూ.10,099 కోట్లు ఉన్నట్టు అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి భట్టి చెప్పారు.
6.5 లక్షల కోట్లు ఎలా తీర్చాలి
ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా తెలంగాణ సర్కారు తాజా గా రూ.10 వేల కోట్లు రుణం పొం దింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం బదిలీచేసింది. పదేండ్లలో వడ్డీతోసహా తిరిగి చెల్లిస్తానని షరతులతో టీజీఐఐసీ రుణం తీసుకున్నది. తాజాగా వచ్చిన రూ.10 వేల కోట్లను రైతు భరోసాతోపాటు ఇతర పథకాలకు వినియోగించాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు కాలేదు.. ఒక్క ప్రాజెక్టుకు ఇటుక పేర్చిందీ లేదు.. కొత్తగా ఒక్క వినూత్న పథకం ప్రారంభించిదీ లేదు.. అయినా ఏడాది కాలంలోనే సుమారు లక్షన్నర కోట్ల అప్పల భారం తెలంగాణ ప్రజలపై మోపడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.4,17,496 కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం, సచివాలయం వంటి అనేక భారీ ప్రాజెక్టులు నిర్మిస్తే గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో అప్పులు చేయడం ఏమిటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఐదేండ్లలోనే సుమారు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే వచ్చే ప్రభుత్వం ఎలా తీరుస్తుందని నిలదీస్తున్నారు.
ఈ ఏడాది అప్పుల చిట్టా..