రేవంత్ ప్రభుత్వంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ చిచ్చు
కమిషన్‌కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు
కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ఏడాదిన్నగా పాట్లు
నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు
కమిషన్‌కు కీలక డాక్యుమెంట్లివ్వకుండా కుతంత్రాలు
జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కీలక విషయాలు
క్యాబినెట్ నిర్ణయంతోనే కాళేశ్వరంపై ముందుకెళ్లామని
కమిషన్ విచారణలో కేసీఆర్, హరీశ్, ఈటల స్పష్టీకరణ
మినిట్స్ ఇవ్వాలని సర్కార్‌కు మూడోసారి కమిషన్ లేఖ
కమిషన్ లేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం
ఎన్డీఎస్ఏ నివేదిక డొల్ల అని ఇప్పటికే ఎల్అండ్టీ నిలదీత
ప్రతికూలతలతో సహచరులపై ‘ముఖ్యనేత’ రుసరుసలు
‘చెరపకురా… చెడేవు’ అన్నారు పెద్దలు! కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కారు పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. తెలంగాణ వరప్రదాయిని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే ఏడాదిన్నర కుట్రలు నిష్ఫలమవుతున్నాయనే సంకేతాలు ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారులో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజుకున్నది.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): శత్రువుకు శత్రువు… మిత్రుడు అన్నట్టు సంవత్సరన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ తాము నోటికొచ్చినట్టు చేసిన ఆరోపణలకు ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో అధికారిక ముద్ర పడుతుందనే ఆశలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కానీ ఎన్డీఎస్ఏ నివేదిక డొల్ల అని ఎల్అండ్టీ తేల్చడంతో కేంద్రం కూడా చేతులెత్తేసింది. తాజాగా చివరిదశకు చేరుకున్న పీసీ ఘోష్ కమిషన్ ముచ్చటగా మూడోసారి ‘గత ప్రభుత్వ క్యాబినెట్ మినిట్స్’ కావాలంటూ పట్టుబట్టడంతో రాష్ట్ర ప్రభు త్వం తలపట్టుకున్నట్టు తెలుస్తున్నది. చివరకు ఇది ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో ఒక సహచరునిపై ‘ముఖ్య’నేత రుసరుసలదాకా వెళ్లినట్టు తెలిసింది. అందుకే సదరు సహచరుడిని ఇరకాటంలో పెట్టేందుకే ‘ముఖ్య’ కేంద్రం నుంచి ఘోష్ కమిషన్ లేఖ విషయాన్ని లీకుగా వదిలారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘ఏమనుకుంటె.. ఏమాయె?!’ అని తాము వేసిన ఉచ్చు తమ మెడకే చిక్కుకుంటుందనే నైరాశ్యం ‘ముఖ్య’ శిబిరాన్ని ఆవహిస్తున్నదని విశ్వసనీయ సమాచారం. అందుకే అంశం ఎంత పెద్దదయి నా సరే.. ఓ చిన్న లాజిక్‌తో పరిసమాప్తం అవుతుందనేది చారిత్రక 2వ పేజీలో మొదటిపేజీ తరువాయి…
సత్యం. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై సంవత్సరంన్నర కాలంగా చోటుచేసుకుంటున్న రాజకీయ రాద్ధాంతం కూడా ఆ లాజిక్ ముంగిటకు వచ్చి నిలబడింది. అదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దూదిపింజలా ఎగిరిపోయిన ఎన్డీఎస్ఏ నివేదిక
మేడిగడ్డ బరాజ్‌లోని ఒక పిల్లర్ కుంగిన మరుసటి రోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 24 వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన రసాభాభస అంతాఇంత కాదు. తాము ఊహించినట్టుగానే నివేదిక వస్తుంది.. చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టును చెరిపివేయవచ్చనే ఆశతో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఆశాభంగాన్ని కలిగించింది. వాస్తవానికి ఎన్డీఎస్ఏ విచారణలో భాగంగా అధికారులు అనేక కీలక డాక్యుమెంట్లను అడిగినప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటికీ మించి అసలు ఎన్డీఎస్ఏకు తెల్వకుండానే కుంగిన ప్రాంతంలో గ్రౌటింగ్ చేపట్టారని ఆ సంస్థ తన తుది నివేదికలో కుండబద్దలు కొట్టింది. దీంతో తామేమీ చేయలేమంటూ ఎటూ తేల్చకుండానే నివేదికను వెలువరించింది. కుంగుబాటు ఎలా జరిగిందనే సాంకేతిక అంశాలను పొందుపరిచిన అధికారులు అసలు దీనికి బాధ్యులెవరు? అసలు లోపం ఎక్కడ జరిగింది? అనే వివరాలే వెల్లడించలేదు. బరాజ్ పునరుద్ధరణకు ఏం చేయాలనే కనీస సిఫారసులు లేకుండానే తుది నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇదంతా డొల్ల నివేదిక అంటూ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ దిమ్మతిరిగేలా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ ఏమీ చెప్పలేదు సరే.. కనీసం మీరైనా ఏం చేయాలో చెప్పండి అదే చేస్తాం! అంటూ బంతిని సర్కారు కోర్టులోకి నెట్టింది. తామేదో బీఆర్ఎస్ను బద్నాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే సాంకేతిక అంశాల్ని తమ నెత్తిన పెట్టారంటూ సర్కారు పెద్దలకు దిక్కుతోచక కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండ్యాతో కమిటీ వేసి ఎన్డీఎస్ఏ ఎపిసోడ్‌కు శుభం కార్డు వేశారు.
కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంకట స్థితిలో పడిపోయింది. కారణం.. పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రాస్తున్న లేఖలు. ఇంజినీర్లను సాంకేతిక అంశాలపై విచారించిన కమిషన్.. కేసీఆర్ క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత ముఖ్యకార్యదర్శులు, ఐఏఎస్‌లను ప్రభుత్వపరంగా ప్రొసీడింగ్స్, ఫైల్స్ నిర్వహణపై విచారణ చేసి.. మరోసారి క్యాబినెట్ మినిట్స్ కోసం లేఖ పంపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొక్కిపెడుతూ వచ్చింది. నాటి ముఖ్యమంత్రి, నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులు కూడా కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఇక కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ అత్యంత కీలకంగా మారింది. ఇటీవల మూడోసారి క్యాబినెట్ మినిట్స్ కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మినిట్స్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ కేసీఆర్ ఒక్కరే కాదు! క్యాబినెట్ సమష్టి నిర్ణయమనేది ప్రస్ఫుటం అవుతుంది. అంటే ప్రక్రియ అంతా రాజ్యాంగ బద్ధంగా జరిగినట్టే. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడమనేది అసాధ్యం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచించడం లేదు. ఇంతకాలం సాగదీసిన కాళేశ్వరం ప్రాజెక్టు అనే భారీ అంశానికి ఇక శుభం కార్డు పడుతుందన్నది ప్రభుత్వ పెద్దలకు బోధపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే ఏడాదిన్నర ప్రయత్నాలు ఇక పటాపంచలు కానున్నాయి.
ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ భేటీలో కాళేశ్వరం అంశాన్ని ప్రధాన ఎజెండాగా తొలుత నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసుకొని క్యాబినెట్ మీటింగ్‌కు వచ్చారు. కానీ చివరి క్షణంలో ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. క్యాబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాకపోవడానికి ఓ సీనియర్ మంత్రి మీద అనుమానమే కారణమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
క్యాబినెట్ భేటీకి గంట ముందే సీనియర్ మంత్రితో ముఖ్య నేత దాదాపు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈ భేటీలో ఒకరికొకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ చేతికి వెళ్తున్నాయని, ఆయనకు చేరవేస్తున్న వారు ఎవరని ముఖ్యనేత నిలదీసినట్టు తెలిసింది. మనలో ఐక్యత లేకపోవటంతోనే ప్రజల్లో ప్రభుత్వం చులకనై పోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ తాము అనుకున్న దిశలో వెళ్లటం లేదని, తద్వారా బీఆర్ఎస్పై రాజకీయంగా ఎక్కుపెట్టిన తుపాకీ గుండు చివరకు తమవైపే వస్తుందనే రీతిలో తీవ్ర పదాలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అందుకే కాళేశ్వరం అంశాన్ని క్యాబినెట్ ఎజెండానుంచి తొలగిస్తున్నానని సదరు మంత్రి ముఖం మీదనే చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వంలో రేగిన ఈ కాళేశ్వరం చిచ్చు చివరకు ‘ముఖ్య’ కేంద్రం నుంచి లీకులకు దారి తీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఘోష్ కమిషన్ కేసీఆర్ క్యాబినెట్ భేటీ మినిట్స్‌ను ఇవ్వాలని సర్కారుకు లేఖ రాసిందని, దీనిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నదనే లీకులు ఎంపిక చేసిన మీడియాకు వెళ్లాయి. కానీ తెల్లారేసరికి అది రేవంత్ సర్కారుకు ప్రతికూలంగా జనంలోకి వెళ్లడంతో నాలుక్కరచుకోవడం లీకువీరుల వంతైంది. కేసీఆర్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన రోజున ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో కాళేశ్వరంకు సంబంధించిన నివేదికలన్నీ బయటపెడతానని చెప్పారు. కానీ ఇంతవరకు వాటి ఊసెత్తకపోవడం గమనార్హం.
ముఖ్యనేత నుంచి ఊహించని ఆరోపణలు రావటంతో నిశ్చేష్టుడైన సదరు మంత్రి తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిసింది. తాను నిఖార్సైన కాంగ్రెస్ నేతనని, పదవుల కోసం పార్టీలు మార రాలేదని ఆయన ఎదరుదాడికి దిగినట్టు తెలిసింది. ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చేంత ఖర్మ తనకు పట్టలేదని, మీలాంటి వాళ్లు ఈ పార్టీ కాకుంటే ఇంకో పార్టీకి వెళ్తారని ఘూటుగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తాను లీకులు ఇచ్చినట్టు ఆధారాలు చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానంపై ఆయన ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసినట్టు సమాచారం.్ర
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో 2023 అక్టోబరు 21న ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకున్నది. బరాజ్‌లోని 85 పిల్లర్లకు ఒకటి కుంగిపోయింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై రాజకీయ రాద్ధాంతం మొదలుపెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమనే కోణంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఏకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ రంగాన్నే నిర్వీర్యం చేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు.
దశాబ్దాల సాగునీటి గోస అనుభవించిన తెలంగాణ రైతాంగాన్ని ఒడ్డుకు చేర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మంత్రివర్గ సమష్టి నిర్ణయంతో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నిధుల సమీకరణ, కేంద్ర జల సంఘం, కేంద్ర అటవీ, పర్యావరణ, ఇతరత్రా విభాగాల నుంచి రావాల్సిన అనుమతుల కోసం తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌తో లైడార్ సర్వే చేయించారు. ఎల్అండ్టీ వంటి ప్రపంచ దిగ్గజ నిర్మాణ కంపెనీలకు పనులు అప్పగించారు. ఇవన్నీ కేసీఆర్ సొంత నిర్ణయాలే అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ కమిటీలు, కమిషన్ల ముందుకొచ్చేసరికి అసలు నిజాలు బట్టబయలవుతాయి. పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలోనూ ఇదే జరిగిందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ విచారణల సమయంలో అప్పటి ప్రభుత్వం సమష్టిగా తీసుకున్న నిర్ణయాల పరంపరను డాక్యుమెంట్లతో సహా కమిషన్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. దీంతో కమిషన్ తదుపరి అడుగులు అటువైపు వెళుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.