హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం (ఆర్‌వైవీ) పథకం కింద యువత స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందజేస్తామని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా గత ఫిబ్రవరిలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. పథకం అమలుకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అట్టహాసంగా వెల్లడించింది. ప్రతీ నియోజకవర్గంలో 5,000 మంది అర్హులైన యువతకు జూన్ 2 నుంచి 9 వరకు రుణాలను మంజూరు చేస్తామని ఊదరగొట్టింది. పత్రికా ప్రకటనలతో సొంతప్రచారానికి తెరలేపింది. కానీ, ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి రుణం కూడా విడుదల చేయలేదంటే సర్కారు పనితీరుకు అద్దం పడుతుంది. ఈ పథకం కింద సబ్సిడీ రుణాలను అందిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
ఆర్‌వైవీ పేరిట ఫిబ్రవరిలో దరఖాస్తులను స్వీకరించగా, నాటి నుంచి ఆ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోయింది. ప్రభుత్వ పెద్దలను అడిగినా స్పందన కరువైంది. ప్రభుత్వం ఆ రుణాలను ఇస్తుందా? ఇవ్వదా? అనేది తెలియక దరఖాస్తుదారులైన యువత ఆందోళన చెందుతున్నది. తక్షణం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. ఆర్‌వైవీ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు 10 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ రుణాల కోసం ఏప్రిల్14 వరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 16,23,643 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఎస్సీలు 3,64,691 మంది, ఎస్టీలు 1,74,365, బీసీలు 7,28,229, ఈబీసీలు 31,998, మైనార్టీలు 1,82,186, క్రిస్టియన్ మైనార్టీలు 3,712 మంది చొప్పున ఉన్నారు.
70% మందికి నిరాశ
ఆర్‌వైవీ పథకంలో రుణసాయం కోసం 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 4,93,234 లక్షలు అంటే 30.37% మందికే రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో దరఖాస్తుదారుల్లో దాదాపు 70% మందికి కాంగ్రెస్ సర్కార్ ఆదిలోనే నిరాశ మిగిల్చింది. ప్రతీ 10 మందిలో కేవలం ముగ్గురికే రుణాలను ఇవ్వనుండగా, ఏడుగురికి మొండిచేయి చూపింది. నిర్ణీత సంఖ్య మేరకైనా రుణాలను ఇప్పటికీ ఇవ్వనేలేదు. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. జనాభా దామాషా, క్యాటగిరీల వారీగా మంజూరైన యూనిట్ల మేరకు అర్హులను మే 20లోగా మండలస్థాయి కమిటీలను ఎంపిక చేయాలని, ఆ జాబితా జిల్లా కమిటీలు పరిశీలించి అదే నెల 31లోగా తుది జాబితాను సిద్ధం చేసి ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు రుణమంజూరు పత్రాలను పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు తెలిపింది. కానీ ఎంపికైన అర్హుల జాబితాను ఎక్కడా ప్రకటించలేదు. ఆ ప్రక్రియ నాటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడని దుస్థితి నెలకొన్నది.
50 వేల యూనిట్‌కే పరిమితం?
ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు బ్రేకులు వేయడానికి మరో కారణం ఉన్నదని సంక్షేమశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు యూనిట్లకే రుణ పరిమితిని విధించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తద్వారా ఎక్కువ మందికి రుణాలను ఇచ్చినట్టుగా ఉంటుందని, దాన్నే ప్రచారం చేసుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యూ నిట్‌లలో కోత విధించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అందుకు అనుగుణంగా అధికారులకు ఇటీవలే ఆదేశాలను సైతం జారీ చేసినట్టుగా తెలుస్తున్నది. యూనిట్ల మార్పునకు ఎంపీడీవోలకు అవకాశం కల్పించినట్టు సమాచారం. ఆ రుణాలు సైతం ఇప్పట్లో మంజూరయ్యే ప రిస్థితి కనబడటం లేదని, మరింత జాప్యంకాక తప్పదని అధికారులే చెప్తున్నారు.
తొలుత 5 రకాల యూనిట్ల విభజన
తొలుత ప్రభుత్వం మొత్తంగా రూ.6 వేల కోట్ల సబ్సిడీ రుణ మొత్తాన్ని 5 రకాల యూనిట్లుగా విభజించింది. కేవలం రూ.50 వేల యూనిట్ మాత్రమే 100% సబ్సిడీతో అందిస్తున్నది. రూ.లక్ష యూనిట్లో రూ.90 వేలు ప్రభుత్వం, 10 వేలను రుణంగా, రూ.2 లక్షల యూనిట్లో రూ.1.60 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.40 వేలను బ్యాంకు రుణంగా, రూ.3 లక్షల యూనిట్లో రూ.2.10 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.90వేలను బ్యాంకు రుణంగా, రూ.4లక్షల యూనిట్లో రూ.2.80 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.1.20లక్షలను బ్యాంకు రుణంగా అందివ్వాలని నిర్ణయించింది. మొత్తంగా 85,000 మందికి 50 వేల యూనిట్లు, లక్ష మందికి 50 వేల నుంచి లక్ష యూనిట్లు, లక్ష మందికి లక్ష నుంచి 2లక్షల యూనిట్లు, మరో లక్ష మందికి 2లక్షల నుంచి 3లక్షల యూనిట్లు, 1,08,234 మందికి 2లక్షల నుంచి 4లక్షల యూనిట్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆర్‌వైవీ కోసం వచ్చిన 16,23,643 దరఖాస్తుల్లో దాదాపు 75 శాతానికి పైగా అర్జీలు కేవలం రూ.4 లక్షల యూనిట్‌కే పెట్టుకున్నట్టు సంక్షేమవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆ మేరకు మంజూరు చేయాలన్నా దాదాపు 4,500 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అంచనా.