హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ) : కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో గౌడన్నల ఆత్మగౌరవ పతాకగా హైదరాబాద్‌లో నిర్మించిన నీరాకేఫ్‌ను హోటల్‌గా మార్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు నీరా కేఫ్‌ను రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ‘ప్రభుత్వం ఎక్సైజ్, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వంలో గౌడన్నలు, కల్లుగీత కార్మిక సంఘాలు చేసిన పోరాటం ఫలించింది.
నీరా కేఫ్‌ను హోటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఫిబ్రవరి 22న ‘నమస్తే తెలంగాణ’ కథనంలో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో గౌడ సంఘాలు, కల్లుగీత కార్మికులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఫిబ్రవరి 23న కేఫ్‌ను సందర్శించిన శ్రీనివాస్‌గౌడ్ ‘నీరా కేఫ్‌ను తరలించడమంటే.. గౌడన్నల గుండెలపై తన్నడమే’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం రాష్ట్రంలోని గౌడ సంఘాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమించారు. దీంతో పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం స్పందించింది. ‘నీరాకేఫ్‌ను ఎక్కడి తరలించడం లేదు’ అంటూ వార్త రాసిన ‘నమస్తే తెలంగాణ’ రిజాయిండర్ పంపింది. 24 గౌడ సంఘాల నేతలు ఉద్యమ కార్యచరణ ప్రకటించి మార్చి 17న హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్నామని అల్టిమేటం జారీ చేశారు.
దీంతో దిగొచ్చిన ప్రభుత్వం నీరా కేఫ్‌ను తరలించబోమని ఆగమేఘాల మీద సర్క్యూలర్ జారీ చేసింది. ‘సర్క్యూలర్ వద్దు జీవో ముద్దు’ అంటూ గౌడన్నలు ఆందోళనలు చేయడంతో జీవో విడుదల చేస్తూ మార్చి 24న జీవో ఇచ్చింది. ఈక్రమంలో గత ఫిబ్రవరి 22 నుంచి మార్చి 22 వరకూ నీరా కేఫ్ గురించి ‘నమస్తే తెలంగాణ’ వరసగా కథనాలు రాయడం పట్ల గౌడ సంఘాలు, కల్లుగీత కార్మిక సం ఘాల నేతలు అభినందనలు తెలిపారు. తమ పోరాటాలకు తలొగ్గి ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, గౌడ, కల్లుగీత సంఘాల నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గౌడ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు హర్షం వ్యక్తంచేశారు.