హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు బిగించే.. ప్రైవేట్ డిస్కంలకు రెడ్‌కార్పెట్ పరిచే కొత్త విద్యుత్తు చట్టానికి కాంగ్రెస్ సర్కారు పరోక్షంగా మద్దతునిస్తున్నది. బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టానికి కాంగ్రెస్ సర్కారు వంతపాడుతున్నది. ఈ చట్టాన్ని వ్యతిరేకించకుండా… కనీసం రాష్ట్రం నుంచి అభిప్రాయాలు తెలుపకుండా పరోక్షంగా స్వాగతిస్తున్నది. విద్యుత్తు చట్టం (సవరణ)-2025 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 33 రకాల సంస్కరణలను ఈ చట్టం ద్వారా ప్రతిపాదించింది. ప్రైవేట్ వ్యక్తులకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌లు జారీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది.
ఈ డ్రాఫ్ట్ బిల్లుపై రాష్ర్టాలు నవంబర్ 30లోపు తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్రం గడువు విధించింది. ఈ గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేయలేదు. ఇదే విషయంపై ఇటీవల కొందరు విలేకరులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆరా తీయగా, తమ అధికారుల బృందం ఈ డ్రాఫ్ట్‌పై అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. కేంద్రం విధించిన గడువు కూడా ముగిసిందని, బిల్లుపై మౌనం దాల్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా బీజేపీ తెచ్చిన బిల్లుకు సహకరిస్తున్నదని విద్యుత్తురంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరచినట్టే
ప్రైవేట్ రంగానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌లు జారీచేయడమంటే ప్రైవేట్ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరచినట్టే. ఇప్పటికే విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అదానీ, టాటాపవర్, టోరెంట్, రిలయన్స్ వంటి కంపెనీలు ప్రవేశించాయి. టాటా పవర్ ముంబై, ఢిల్లీ, అజ్మీర్, ఒడిశా, టోరెంట్ పవర్ సూరత్, రిలయన్స్ కంపెనీ ముంబైలో సేవలందిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ కంపెనీలు మన దగ్గర మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజల ఆస్తి అయిన డిస్కంకు చెందిన విద్యుత్తు తీగలను వాడుకునేందుకు ఒప్పుకోవాల్సిందే. ఈ చట్టంతో ప్రైవేటీకరణకు దారితీస్తుందని, డిస్కంల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రాఫ్ట్ బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయంగా విద్యుత్తు ఉద్యోగులు ఆందోళనలకు రెడీ అవుతున్నారు. 2026 జనవరి 30న చలో ఢిల్లీకి ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘాలు పిలుపునిచ్చాయి.
సబ్సిడీలు ఎత్తివేస్తరు..
ప్రైవేట్ లైసెన్స్ వ్యవస్థ వస్తే విద్యుత్తు సరఫరా వ్యవస్థ మొబైల్‌లా మారిపోతుంది. ఒకే ప్రాంతంలో రెండు, మూడు విద్యుత్తు పంపిణీ కంపెనీలుంటాయి. ఫలితంగా ప్రభుత్వ డిస్కంలు కుదేలవుతాయి. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే.. రైతులకు ఉచిత విద్యుత్తు అందదు. గృహజ్యోతి వంటి పథకాలపై ఆశలు వదులుకోవాల్సిందే. సమయానికి బిల్లుల కట్టకపోతే ప్రైవేట్ లైసెన్స్‌దారు నిర్దాక్షిణ్యంగా కనెక్షన్ కట్‌చేస్తారు. ప్రీ పెయిడ్ మీటర్లు పెడితే ముందే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తినా.. మరమ్మతులు అవసరమైతే డిస్కంలు ఉచితంగా చేసిపెడుతున్నా యి. భవిష్యత్తులో వీటికి కూడా చార్జీలు వసూలు చేసే ప్రమాదం లేకపోలేదు. మీటర్ కాలిపోతే డిస్కంలే ఉచితంగా సమకూరుస్తున్నాయి. కానీ ప్రైవేటు రేపు మీటర్‌కు ఇంత అని చెప్పి వసూలు చేసినా కట్టాల్సిందే.
చట్టంలోని ముఖ్యమైనవి..