ఖైరతాబాద్, సెప్టెంబర్ 25: కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు సాధనే ఎజెండాగా పెట్టుకొని బీసీల్లోని అన్నివర్గాలు ఏకతాటిపైకి రావాలని మాజీ ఎంపీ కృష్ణయ్య, బీఆర్ఎస్ నేత ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం బీసీ జాతీయ సంక్షేమ సంఘం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సమగ్ర కులగణన-సామాజిక న్యాయం’ అన్న అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు మాట్లాడారు. సమగ్ర కులగణన, రిజర్వేషన్లు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలిపెట్టేది లేదని, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు. కేవలం బీసీ గణన జరిపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సమగ్ర కులగణన చేసి, రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతుంటుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సెక్రటరీ జనరల్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎర్ర సత్యనారాయణ, లాల్‌కృష్ణ, కేవీ రావు, రవికుమార్, నరసింహ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు బుధవారం సచివాలయం లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఇతర రాష్ర్టాల్లోని విధానాలను తెలుసుకోవాలని కమిషన్‌కు సీఎం సూచించారు. వెంటనే బీసీ కులగణనకు కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు.