జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ) : రాణీరుద్రమదేవి ధీరత్వం.. సమ్మక్క సారలమ్మ వీరోచిత పోరాటస్ఫూర్తిని దెబ్బతీసేలా తెలంగాణ మహిళలతో విదేశీ అందగత్తెల కాళ్లు కడిగించి ఓరుగల్లు పరువుతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవైపు ప్రభుత్వం దివాలా తీసిందని ప్రకటించిన ముఖ్యమంత్రి కాస్మెటిక్ కంపెనీలకు లాభాలు తెచ్చే ప్రపంచ అందాలపోటీలు నిర్వహించడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు.
అకాల వర్షాలు, వడగండ్లవానతో దారుణంగా నష్టపోయి కన్నీళ్లు పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందాల పోటీలకు వందల కోట్లు వెచ్చించడం శోచనీయమని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ నాయకులకు పైసా వసూల్‌గా మారుతున్నదని విమర్శించారు. పల్లెల్లో రూ.50వేలు, పట్టణంలో లక్ష రూపాయలు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. పైసలు ఇచ్చినోళ్లకో.. లేకుంటే కాంగ్రెస్ నేతల బంధుగణానికో పథకం వర్తిస్తున్నదని, పక్కా ఇండ్లకు లంచం తీసుకోవడం చట్ట విరుద్ధమ ని.. కలెక్టర్ జోక్యం చేసుకొని అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసంలో కూడా పైసల వసూళ్లు మొదలుపెట్టారని ఆరోపించారు.
‘బీఆర్ఎస్ కార్యకర్తల చెమట చుక్క లు.. ఎమ్మెల్యే పల్లా ఆర్థికసాయంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. కేసీఆర్, కేటీఆర్, పల్లా పేరెత్తితే నాలుక చీరేస్తా జాగ్రత్త’ అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు సహా అనేక అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టి, మొట్టికాయలు వేసినా బుద్ధి మారడం లేదని చెప్పారు. సీఎం డబ్బుల్లేవ్ అంటుంటే కడియం శ్రీహరి మాత్రం నియోజకవర్గ అభివృద్ధికి రూ.800కోట్లు తెచ్చానంటూ గొప్పలు చెబుతున్నారని, ఆయన ఇప్పటివరకు 8పైసలు కూడా తేలేదని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఈసారి కడియంకు డిపాజిట్ రాదని స్పష్టం చేశారు.