హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు కడుతున్న బడా వ్యాపారులను వదిలేసి.. మా ఇండ్లు లాక్కుంటరా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్ల నుంచి పేదల ఇండ్లు, పేదల స్థలాలే టార్గెట్‌గా పాలన సాగిస్తున్నది. మా తాతల నుంచి ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయం.
-వీ దశరథ్, హనుమాన్‌నగర్ బస్తీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) / బండ్లగూడ : మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. పనిలోపనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదలు నివాసముండే హనుమాన్‌నగర్ బస్తీపై కన్నేసింది. సర్వే నంబర్లు 322, 323, 324లో సుమారు 600 కుటుంబాలు 50 ఏండ్ల నుంచీ నివాసం ఉంటుండగా వారిని ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. ఇటీవల కలెక్టర్ సైతం బస్తీకి వెళ్లి తక్షణమే ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొన్నది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హనుమాన్‌నగర్ మొత్తం ప్రభుత్వ భూమి అని.. అక్కడి నుంచి ఖాళీ చేస్తే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తామని బస్తీవాసులతో కలెక్టర్ చెప్పారు.
చుట్టూ విల్లాలు హైరైజ్ భవనాలు ఉండటంతో హనుమాన్నగర్పై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాలంతరీ కార్యాలయానికి ఎదురుగా, ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉండటంతో ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. బస్తీలో 600 కుటుంబాలున్నాయి. చుట్టుపక్కల ఖాళీ స్థలం కలుపుకొని 19 ఎకరాలకు పైగానే బస్తీ విస్తరించి ఉంటుంది. హనుమాన్నగర్ను ఆనుకొని సర్వే నంబర్ 310, 311, 312లోని 35 ఎకరాల్లో ఖరీదైన విల్లాలున్నాయి. ఒక్కో విల్లాను బహిరంగ మార్కెట్లో రూ.16 కోట్లకు విక్రయిస్తున్నారు. అక్కడ గజం రూ.లక్షకు పైనే పలుకుతున్నది. ఈ క్రమంలో హనుమాన్నగర్ను స్వాధీనం చేసుకొని బహిరంగ వేలం వేస్తే ఎకరం రూ.70 కోట్లకు పైగా అమ్ముడు పోతుందని ప్రభుత్వం స్కెచ్ వేసింది.
2007లో 170 ఇండ్లకు పట్టాలు
హనుమాన్ నగర్ బస్తీకి అప్పట్లో మంత్రి ఇంద్రారెడ్డి కరెంట్ కనెక్షన్‌తోపాటు కాలనీలకు తాగునీటి వసతి కల్పించారు. అనంతరం 2007లో అప్పటి ప్రభుత్వం 6.30 ఎకరాల భూమి కేటాయించింది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 170 ఇండ్లకు పట్టాలు కూడా అందజేశారు. దాదాపు 600 కుటుంబాలు ఉండటంతో ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని విన్నవించడంతో మరికొందరికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో పట్టాల పంపిణీ ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బస్తీవాసులు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు పైప్లైన్లు వేసింది. జీవో 58, 59 కింద హనుమాన్ నగర్ బస్తీ కుటుంబాలకు పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. విధివిధానాలను రూపొందించింది. ఈలోగా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది.
నివాస హక్కుల కల్పించిన ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామంటున్న హనుమాన్‌నగర్‌లో పేదలు 50 ఏండ్ల నుంచీ నివాసం ఉంటున్నారు. గుడిసెలు, చిన్న ఇండ్లు కట్టుకొని పనులు చేసుకొని బతుకుతున్నారు. ప్రభుత్వం నుంచి హనుమాన్‌నగర్ పేరిటనే వారికి ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఇంటి నంబర్లు కూడా ఇచ్చారు. హనుమాన్‌నగర్ పిల్లలు చదువుకునేందుకు 7వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలను కూడా ప్రభుత్వం 1991లోనే నిర్మించింది. విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కూడా వర్తింపజేశారు. మున్సిపల్ అధికారులు నెలనెలా ఇంటి పన్ను కూడా వసూలు చేస్తున్నారు. బస్తీలో నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికీ కనెక్షన్లు లేకున్నా జలమండలి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. దాదాపు నాలుగు తరాలుగా అక్కడ ఉంటున్న పేదలను భూముల ధరలు పెరగడంతో ఖాళీ చెయ్యిమంటే ఎక్కడికి పోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చిన వెంటనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే తొలుత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బస్తీ ఖాళీ చేయనివ్వకుండా అడ్డుకుంటానని మాటిచ్చారు. తర్వాత మాట మార్చి ప్రభుత్వ స్థలం ఖాళీ చేయాల్సిందేనని తెగేచి చెప్పినట్టు హనుమాన్‌నగర్ వాసులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నంబర్లు, కరెంట్ కనెక్షన్ ఇచ్చి భరోసా కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ కన్ను తమ ఇండ్లపై పడిందని, రియల్ ఎస్టేట్‌కు అమ్ముకునేందుకు హనుమాన్నగర్ను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని మండిపడుతున్నారు.
ఇక్కడి నుంచి మేం కదలం
భూముల రేట్లు పెరగడం, మా బస్తీ పక్కనే విల్లాలు ఉండటంతో మమ్మల్ని రోడ్డున పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పాలకులు కుట్ర చేస్తున్నరు. మా తాతల కాలం నుంచి హనుమాన్‌నగర్ బస్తీలో ఉంటున్నం. ఇప్పటికే మాలో కొంతమందికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చింది. అప్పటి మంత్రి ఇంద్రారెడ్డి కరెంటు, నీళ్లిచ్చిండ్రు. సబిత ఇంద్రారెడ్డి 170 కుటుంబాలకు పట్టాలిచ్చిండ్రు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మా కుటుంబాలన్నింటికీ భరోసా కల్పించేందుకు కృషి చేసింది. ఇప్పుడు కూడా మా పక్షాన నిలబడి మా ఇండ్లు కాపాడుతామని హామీ ఇస్తున్నది. మేం పుట్టింది, పెరిగింది ఇక్కడే.. మాకు అన్ని అనుమతులున్నయి. ఇక్కడి నుంచి మేం కదలం. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాకు సహకరించి మా ఇండ్లు ఖాళీ చేయకుండా కాపాడాలి.
– బీ నారాయణస్వామి,హనుమాన్‌నగర్ కాలనీ అధ్యక్షుడు