హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన బిల్లులను ఇచ్చేది లేదని సమాచారశాఖ తెగేసి చెబుతున్నదని పలువురు ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లుల కోసం దాదాపు రెండేండ్ల నుంచి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రమంతటా వైభవంగా నిర్వహించించింది.
ఆ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఎంప్యానల్ ఏజెన్సీలతో సమాచారశాఖ పలు డాక్యుమెంటరీలను రూపొందించి దశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శించింది. అందులో భాగంగా గిరిజన సంక్షేమశాఖ నుంచి 10 ఏజెన్సీలు దాదాపు రూ.6 కోట్ల విలువైన పలు డాక్యుమెంటరీలను రూపొందించాయి.
వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించడం లేదు. ఆ డబ్బుల కోసం సదరు ఏజెన్సీల నిర్వాహకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ఆ బిల్లులను చెల్లించేది లేదని ఉన్నతాధికారులు తెగేసి చెప్తున్నారని వాపోతున్నారు. చిన్నచిన్న డాక్యుమెంటరీలను రూపొందించుకుంటూ జీవనోపాధి పొందుతున్న తమ పొట్ట కొట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.