మద్దూరు(ధూళిమిట్ట)/ దుల/పెద్దకొత్తపల్లి జనవరి 29: యూరియా కోసం రైతుల కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యూరియా లోడ్‌తో ఉన్న లారీని చూసిన రైతులు వెంటనే ఆన్లైన్ చేసి ఇవ్వాలని ఏవో రమేశ్‌ను కోరారు. ముందు ఆన్లైన్ చేసుకున్న వారికే ఇస్తామని, ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటే 24 గంటల్లో అందుబాటులో ఉన్న ఏ షాపు నుంచి అయినా పంపిణీ చేసేలా చూస్తామని ఏవో సూచించారు.
షాపు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నాకు దిగారు. ఎస్సై జగన్మోహన్ సిబ్బందితో చేరుకొని రైతులకు నచ్చజెప్పగా వెనుదిరిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట సింగిల్ విండో కార్యాల యం ఎదుట తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌కు రైతులు తెల్లవారుజామునే చేరు కొని క్యూలో నిల్చున్నారు.