హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు పాపం.. శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపించిందని ఆరోపించారు. నిలువరించాల్సిన రేవంత్ ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాని మంత్రులు డొంకతిరుగుడు మాటలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాడు సూడో మేధావులను అడ్డంపెట్టుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించినా 27 వేల ఎకరాల భూ సేకరణ చేశామని, రూ.27 వేల కోట్లు ఖర్చుచేశామని స్పష్టంచేశారు. పదేండ్లలో ఏడు అనుమతులు సాధించి 90% పనులు పూర్తిచేశామని తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌పై అక్కసుతోనే మిలిగిన 10% పనులు పూర్తిచేయడం లేదని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించడం తప్ప చేసిందేమీలేదని, రెండేండ్లలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం చెప్తున్నది నిజమే అయితే చేసిన పనులను చూపించాలని సవాల్ విసిరారు.
పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలోనే అన్ని అనుమతులు సాధించి చకచకా పనులు పూర్తిచేశామని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. 2023 మార్చిలో కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ, జూన్‌లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, జూలైలో కేంద్ర గిరిజన శాఖ, కేంద్ర భూగర్భ జలబోరు, 2023 సెప్టెంబర్‌లో ఫైనల్‌గా అటవీ శాఖ ద్వారా అనుమతులు వచ్చాయని వివరించారు. 10-08-2023న పర్యావరణ అనుమతి ఇవ్వాలని సంబంధిత మంత్రిత్వ శాఖను కోరామని వెల్లడించారు. ఈ అనుమతి కూడా వచ్చి ఉంటే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం జరిగేదని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కేసీఆర్ పాలనలో ఏ ఒక్క అనుమతి కూడా సాధించలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తెలిసి అబద్ధం చెబితే క్షమాపణలు కోరాలి.. తెలియకుండా మాట్లాడితే అవగాహన తెచ్చుకోవాలి.. మీ పార్టీ నేతలకు సోయి తెప్పించాలి..’ అని హితవు చెప్పారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టుకు చేసింది శూన్యమని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. సర్కార్ నిర్లక్ష్యంతోనే మొదటికే మోసం వచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డ, అల్లుడి వైఖరితోనే పాలమూరు జిల్లా ప్రజలు అరిగోసపడాల్సి వస్తున్నదని ఎద్దేవా చేశారు. దుందుభి నదిపై అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించి నదిని సజీవం చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ‘మేం చెప్పింది తప్పనుకుంటే దుందుభి నది పక్కన ఉండే మీ అత్తగారి ఊరైన పొలంపల్లి వాసులను అడుగు..’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌కు చురకలేశారు. ఇప్పటికైనా బిల్లుల చెల్లింపు లెక్కలు చెప్పడం మాని, పాలమూరు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేసి నీరందించాలని డిమాండ్ చేశారు.
పాలమూరు ప్రాజెక్టును జూరాలపై కడితే బాగుండేదని కాంగ్రెస్ నేతలు తలలో మెదడు లేకుండా మాట్లాడుతున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘జూరాల 17.9 టీఎంసీల బరాజ్.. మొత్తం కెపాసిటీ 11 టీఎంసీలు.. నీరందించే సామర్థ్యం 1.1 లక్షల ఎకరాలు, ఇక్కడ ఏటా 20 నుంచి 25 రోజులు మాత్రమే వరద ఉంటుంది.. 125 కెపాసిటీ కలిగిన పంపులు పెడితే రెండు రోజుల్లోనే నీళ్లు అయిపోతయ్.. ఇట్లయితే జూరాలపై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలకు 1.1 లక్షల ఎకరాలు, భీమా ఫేస్ 1,2 కింద 2.23 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ కింద 77 వేల ఎకరాలు.. మొత్తంగా సుమారు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లందించడం వీలుకాద’ని స్పష్టంచేశారు. అందుకే నీటిపారుదల నిపుణులతో చర్చించి రీడిజైన్ చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలను దృష్టిలో పెట్టుకొనే పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టామని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ 45 టీఎంసీలకు ఒప్పుకొని పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల నీటిహక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే, కొందరు బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడంలేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామంటూ గతంలో పాలమూరు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి పన్నెండేండ్లయినా అతీగతిలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కనీసం తెలంగాణ నీటి వాటాను తేల్చకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేత, కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిర శ్రీరామ్..సెక్షన్-3 కింద నీటి వాటా తేల్చేపని ఎందుకు చేయలేదని నిలదీశారు. ‘ఆయన మహారాష్ట్రకు సలహాదారుడా? కాంగ్రెస్ పార్టీకా? సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ పాల్గొన్న మీటింగ్‌ల్లో ఆయన ఎలా పాల్గొంటారు? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయిందనడానికి ఇది నిదర్శనం కాదా?’ అని ప్రశ్నించారు.
కృష్ణాలో 299 టీఎంసీల నీటివాటాకు కేసీఆర్ ఒప్పుకున్నారని మంత్రి ఉత్తమ్ మాట్లాడటం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రాజెక్టులు కట్టకుండా చేసిన నిర్లక్ష్యంతోనే తాత్కాలికంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కేంద్ర జలవనరుల శాఖ, ఆంధ్రా, తెలంగాణ అధికారుల సమావేశం జరిగిన జూన్ 2015న మినిట్స్ చూడకుండా అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మేం చెప్పింది తప్పని ప్రస్తుత నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌తో చెప్పిస్తారా? అని ప్రశ్నించారు. కానీ, కాంగ్రెస్ మాత్రం 299 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణకు శాశ్వత ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రంగినేని అభిలాష్‌రావు, కురువ విజయ్‌కుమార్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.