వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్కువ ఉండే గోదావరిపై బృహత్ కాళేశ్వరాన్ని నిర్మించింది. కృష్ణా జలాల సద్వినియోగానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు పూర్తిగా, నల్లగొండ జిల్లాలో కొంత.. మొత్తంగా 12.3 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు పీఎల్ఎంఆర్ఎల్ను చేపట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా తారుమారైంది.
ముందుచూపు లేని పాలకులు పాలమూరును కకావికలం చేస్తున్నారు. హక్కు జలాలను, ఆయకట్టు లక్ష్యాన్ని సగానికి కుదించుకున్నారు. శ్రీశైలాన్ని వదిలేసి పూడిక నిండిన జూరాలను నమ్ముకుంటున్నారు. పక్కనున్న కృష్ణా నీళ్లను వదిలేసి, ప్రాణహిత నీళ్లు పట్టుకొస్తామని బీరాలు పలుకుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): ఏ రాష్ర్టామైనా, ఏ ప్రభుత్వమైనా గతంలో కంటే ప్ర జలకు మెరుగైన పాలన అందించాలని, మంచి వసతులు కల్పించాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా సాగునీటి రంగంలో నీటి కేటాయింపులను పెంచేందుకు మొగ్గుచూపుతుంది. గత ప్రాజెక్టులకు మరిన్ని మె రుగులు దిద్దాలనుకుంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఉన్న వాటాల్లో కోత పెడుతున్నది. ఉన్న ఆయకట్టుకే నీరివ్వలేని ప్రాజెక్టుపైనే అదనపు భారం మోపుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని(పీఆర్ఎల్ఐఎస్) కకావికలం చేస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 90 టీఎంసీలు కేటాయించింది. అంతేకాదు కల్వకుర్తి ఆయకట్టుకు భరోసా కల్పించే లా కూడా ప్రణాళికలు సిద్ధంచేసింది. కానీ నేడు ఆ వాటన్నిటికీ గండి కొడుతున్నది. ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్‌కు పేరు వస్తుందనే దు గ్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టు ను ఛిన్నాభిన్నం చేస్తున్నట్టు స్పష్టం అవుతున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకవైపు రాచకొండలు, మరోవైపు అనంతగిరి పర్వతశ్రేణి సహా ఎన్నో గుట్టలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూమి 14లక్షలు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు. సాగునీటి ప్రాజెక్టు లేని ఏకైక జిల్లాగా రంగారెడ్డి జిల్లా దీనస్థితికి చేరింది. తెలంగాణ ఏర్పాటునాటికి దాదాపు లక్ష ఎకరాల భూమి సాగులో ఉండగా, అది కూడా కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువుల కిందే సాగయ్యాయి.
ఉమ్మడి పాలకులు ఒకవైపు కుట్రపూరితంగా చెరువులను ధ్వంసం చేసి, మరోవైపు రంగారెడ్డి జిల్లాకు ఒక్క ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీటిని అందించేందుకు చొరవ చూపలేదు. సమైక్య పాలకుల కుట్రలకు ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా 95శాతం కృష్ణా బేసిన్లో ఉండగా, కృష్ణా నదికి 150కిలోమీటర్ల దూరం లో ఉన్నది. కానీ ఉమ్మడి పాలకులు రంగారెడ్డి జిల్లా కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నుంచి జలాలను తీసుకొచ్చి సాగునీరందించేలా ప్ర ణాళికలు రూపొందించారు. అదీ తెలంగాణ ఉద్య మం ఊపందుకున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు మొత్తంలో నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీల కన్నా తక్కువే.
నిరంతరం మోటర్లు నడిస్తే తప్ప నీరు రాని దుస్థితి. సూటిగా చెప్పాలంటే ప్రాజెక్టు ఉండాలి కానీ నీరు రాకూడదనే తరహాలో కుట్ర పన్నారు. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే 70 ఏండ్ల సమైక్య పాలనలో దక్కిన కృష్ణా జలాలు శూన్యం. ఆ కుట్రలకు చెక్ పెడుతూ రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించేందుకు కేసీఆర్ సీఎం అయ్యాక ప్రణాళికలను సిద్ధంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి రంగారెడ్డికి జీవనాడిగా నిలిచేలా, హక్కుగా రావాల్సిన కృష్ణా జలాలు దక్కేలా రూపకల్పన చేశారు. పీఆర్ఎల్ఐఎస్లో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారానే దాదాపు 9 లక్ష ల ఎకరాల ఆయకట్టు ఉండ గా, అందులో అత్యధికం గా ఉమ్మడి రంగారెడ్డి జి ల్లాకు సంబంధించిందే 5 లక్షల ఎకరాలు ఉండటం విశేషం.
ఉద్దండాపూర్ రి జర్వాయర్ ఎడమ ప్ర ధాన కాలువ మొత్తం 120 కిలోమీటర్లు కాగా, తద్వారా వికారాబాద్ జిల్లాలో దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సా గునీరు అందుతుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 16.5 కిలోమీటర్ వద్ద నుంచి మరో రెండు ప్రధాన కాలువలను తీయనున్నారు. ఒకటి 90 కిలోమీటర్ల మద్దూరు కాలువ. దీని కింద 1.74 లక్షల ఎ కరాలు ఉండగా, అదికూడా అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో, అతిస్వల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నది. మరో కాలువ 20 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ వరకు ఉన్నది. ఈ కాలువ కింద మ హబూబ్‌నగర్ జిల్లాలో 27వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఉద్దండాపూర్ దక్షిణ ప్రధాన కాలువ ద్వారా 30వేల ఎకరాలకు, ఫస్ట్ రైట్ కెనాల్ ద్వారా 9వేల ఎకరాలకు అందనుండగా, ఈ ఆయకట్టు మొత్తం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉన్నది.
4 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం
ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయనున్న 2వ రైట్ కెనాల్ ద్వారా మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ రిజర్వాయరే జీవనాడిగా మారుతుంది. అదీగాక ప్రాజెక్టు కింద కవర్ కాని, ఇంకా ఎత్తులో ఉన్న భూములకు కూడా సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ నుంచి వెళ్లే పలు ప్రధాన కాలువలపై పలుచోట్ల చిన్న లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నాడు భావించింది. కానీ రేవంత్‌రెడ్డి సర్కారు ఈ ప్రణాళికలన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నది. అధికారంలోకి రాగానే ఆయా కాలువల టెండర్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి ఆయకట్టుకు నీరందించేందుకు మళ్లీ సిద్ధమైంది. పీఆర్ఎల్ఐఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును సైతం తొలగించింది.
గ్రావిటీ కాదని.. కొడంగల్ లిఫ్ట్ ద్వారా
జూరాల ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత లైవ్ కెపాసిటీ 6.8 టీఎంసీలు మాత్రమే. వాస్తవాలు తెలిసినా కూడా కృష్ణాజలాలు పాలమూరుకు దక్కకూడదనే కుట్రపూరితంగా ఉమ్మడి పాలకులు జూరాలనే కేంద్ర బిందువుగా చేసి పలు ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. రాజీ వ్ భీమా స్టేజ్-1, స్టేజ్-2, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను జూరాల బ్యాక్‌వాటర్ నుంచే చేపట్టారు. జూరాల ప్రాజెక్టుతోపాటు, ఆయా లిఫ్ట్ స్కీమ్‌ల కింద మొత్తం గా ఇప్పటికే 5.48లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఉమ్మడి పాలకుల కుట్రతో ప్రస్తుతం ఒక్క పంటకే నీరందించలేని దుస్థితి. రబీలో ఎత్తిపోతలన్నీ నిలిపివేస్తున్న పరిస్థితి. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న జూరాల ప్రాజెక్టుపైనే రేవంత్ సర్కారు ఇప్పుడు అదనంగా మరో 1.50 లక్షల ఎకరాల భారాన్ని మోప డం గమనార్హం.
అదే మక్తల్-కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ స్కీమ్. వాస్తవంగా ఆయా నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 2.50 లక్షల ఎకరాల ఆ యకట్టుకు గ్రా విటీ ద్వారా నీ రందించేందుకు కేసీఆర్ ప్రణాళికల ను రూపొందించారు. పా లమూరు-రంగారెడ్డి పథకంలో ఉ ద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించేలా రూపకల్పన చేశారు. కానీ ఆ ప్రణాళికలను రేవంత్ సర్కారు పక్కనబెట్టింది. కొడంగల్ లిఫ్ట్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది. అది కూడా కేవలం 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకే. శ్రీ శైలం రిజర్వాయర్ నుంచి కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేయకుండా భీమా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన భూత్పూర్ నుంచి అదనంగా మోటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి పాలకులు సిద్ధంచేసిన ప్రతిపాదనలతోనే పనులను చేపట్టడం కాం గ్రెస్ సర్కారు ఆలోచనారీతికి అద్దం పడుతున్నది.
తెలంగాణ ఉద్యమానికి జడిసి రాజీవ్‌భీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు 20 టీఎంసీలను కేటాయించారు. ప్రాజెక్టు కింద ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలకు నీరందించేలా మొత్తంగా 2.03 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించారు. జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టును ప్రారంభించినా రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులేమీ పూర్తికాలేదు. రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాన్ని రెండు స్జేజ్లుగా చేపట్టారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై రామన్‌పాడు వద్ద పంచదేవపాడు గ్రామం వద్ద ఒకటి, ఊకచెట్టి వాగు ప్రాజెక్టుపై 2వ లిఫ్ట్‌ను ఏర్పాటుచేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా దీర్ఘకాలికంగా కరువు పీడిత మక్తల్, మాగనూరు, ఆత్మకూర్, నర్వ, చింతకుంట, దేవరకద్ర, కొత్తకోట, పెద్దమందాడి, మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బబైర్, పాన్‌గల్, వీపనగండ్ల, కో డేరు, కొల్లాపూర్ మండలాలు సహా తదితర మెట్ట ప్రాంతాల్లోని 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉన్నది. అందులో ప్రస్తుతం 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇంకా 40 వేల ఎకరాలకుపైగా నీరందించాల్సి ఉన్న ది. అంటే భీమా ప్రాజెక్టు కిందనే ఇప్పటివరకు పూర్తిస్థాయి సాగునీరు అందించలేదు. కానీ రేవంత్‌రెడ్డి సరారు మాత్రం భీమా ప్రాజెక్టు డ్యూటీని (1 టీఎంసీకి సాగయ్యే భూమి) 10,000 ఎకరాల నుంచి ఏకంగా 15,000 ఎకరాలకు పెంచింది.
త ద్వారా 20 టీఎంసీల నికర జలాల్లో 7.33 టీఎంసీలు ఆదా అవుతున్నవని చూపించి కోత విధించిం ది. 12.67 టీఎంసీల నీటితోనే భీమా కింది 2 లక్షల ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చని నిర్ధారించింది. భీమా ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించడం గమనార్హం. భీమా ప్రాజెక్టు మొత్తంలో నీటినిల్వకు భూత్పూర్, సంగంబండ, రంగసముద్రం, శంకర సముద్రం రిజర్వాయర్లు ఉండగా, వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 8.3 టీఎంసీలే. భీమా స్కీమ్‌లో ప్రధానమైన, మొదటిదైన భూత్పూర్ రిజర్వాయర్ (1.3టీఎంసీలు) నుంచే ప్రస్తుతం నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ రిజర్వాయర్ నుంచే 7టీఎంసీల జలాలను తరలించాల్సి ఉన్నది. సర్కారు తీరుతో రాజీవ్‌భీమా భీమా ఆయకట్టు సైతం ప్రశ్నార్థకంగా మారనున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయి అనేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా ఓ నిదర్శనం. టీడీపీ హయాంలో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల్లో తొలుత 2.20 లక్షల ఎకరాల ఆయకట్టును చూపారు. అందుకు 25 టీఎంసీల వరద జలాలనే కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టి ఆయకట్టును 3.50 లక్షల ఎకరాలకు పెంచారు. కానీ నీటి కేటాయింపులను మాత్రం చేపట్టలేదు. ఆయకట్టు గ్యాప్ పెరిగి పోవడంతో ప్రస్తుతం కల్వకుర్తి ప్రాజెక్టు కింద దాదాపు 4లక్షలకు పైగానే ఆయకట్టు ఉన్నది. నాడు అరకొర పనులతో చేతులెత్తేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం తొలుత కల్వకుర్తి ప్రాజెక్టుకు తగిన విధంగా 25 టీఎంసీలకు అదనంగా మరో 15 టీఎంసీలను కేటాయించింది. అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సొంత ఆయకట్టుతో పాటు కల్వకుర్తి కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు కూడా డిజైన్ చేసింది.
అందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో ఒక తూము ఏర్పాటుచేసింది. 350 క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జితో పూర్తిచేసిన ఈ తూము ద్వారా పాలమూరు-కల్వకుర్తి ప్రాజెక్టు మధ్య ఉన్న 50 వేల ఎకరాల ఆయకట్టు, వట్టెం రిజర్వాయర్ నుంచి 1,500 క్యూసెక్కుల డిశ్చార్జితో ఏర్పాటుచేసిన తూము ద్వారా మరో లక్షన్నర ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీల్లోనే 45 టీఎంసీలకు కోత విధించింది. కేవలం 45 టీఎంసీలకే అనుమతులను సాధించాలని నిర్ణయించింది. దీంతో ఆ ప్రాజెక్టు సొంత ఆయకట్టుకే నీరందని దుస్థితి కల్పించింది. వెరసి కల్వకుర్తి ఆయకట్టుకు పెను ముప్పును తెచ్చిపెట్టింది.
ఒకప్పుడు వలసల ప్రాంతంగా ముద్రపడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను పచ్చని పసిడి పంటల నెలవుగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలన్నీ తారుమారవుతున్నాయి. దూరదృష్టి, ఉన్నతాశయంతో రూపొందించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ తన అనాలోచిత నిర్ణయాలతో విచ్ఛిన్నం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల బాటలో, ఆలోచనలతో పాలన సాగిస్తూ తెలంగాణకు తీరని విద్రోహాన్ని తలపెడుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయడమే కాకుండా, నీటివాటాను కుదించింది. ప్రాజెక్టు పరిధి నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును
తొలగించింది. భీమా ప్రాజెక్టు డ్యూటీని పెంచి, నీటి వాటాలో కోత పెట్టింది. కొడంగల్ పేరిట జూరాల ప్రాజెక్టుపై అదనపు భారాన్ని మోపుతున్నది. కల్వకుర్తి ఆయకట్టుకు తీరని ముప్పు తెచ్చిపెడుతున్నది. మొత్తంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కకావికలం చేస్తున్నది.