ములుగు, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగిస్తున్నాం’ అంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిననాడు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. ‘భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నాం. వెడల్పు చేస్తున్నాం. పూజారుల అభిప్రాయం ప్రకారం ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలు దెబ్బతినకుండా కట్టడాలు చేపడుతున్నాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు మేడారం వనదేవత సన్నిధిని రాతి కట్టడాలతో నిర్మించింది.
కానీ, ప్రభుత్వం చేపట్టిన పనుల డొల్లతనం మేడారం మహాజాతరలో తిరుగువారం కాకముందే బయటపడింది. రాతి కట్టడాలు నేలవాలుతున్నాయి. గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం చేపట్టింది. సమ్మక్క-సారలమ్మ గద్దెల కైవారం కోసం చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా నిలబెట్టిన శిలాకంబాలు అప్పుడే విరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణ ఫ్లోరింగ్ అంతా దస్కి (కిందికి దిగడం) పోతున్నది. బుధవారం తిరుగువారం ముగియక ముందే విరిగిపోతున్నాయని భక్తులు పెదవి విరుస్తున్నారు. మేడారం గ్రామస్తులు మాత్రం.. ‘నాణ్యతే మాయమైంది’ అని శాపనార్థాలు పెడుతున్నారు.
సీఎం ఆదేశాలతో మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీ ద్వారా రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పేరుతో రాతి కట్టడాల నిర్మాణం చేపట్టారు. అంతకుముందు దేవాదాయ శాఖ ద్వారా నిర్మించేందుకు ఉత్తర్వులు ఇచ్చినా, రికార్డు స్థాయిలో నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి హామీతో.. ముందు జారీచేసిన ఆర్డర్లను వారి శాఖకు బదలాయింపు చేసిన విషయం తెలిసిందే.
ఆ పనులను దేవాదాయ శాఖతోపాటు ఇతర ఇంజినీరింగ్ శాఖల అధికారుల పర్యవేక్షణ లేకుండా మాస్టర్‌ప్లాన్ పేరుతో కంపెనీ సిబ్బందితో నాసిరకంగా చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. జాతర ముగిసి తిరుగువారం కాక ముందే గద్దెల వద్ద ఏర్పాటుచేసిన శిలలు రాలిపోతూ, విరిగిపోతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ గొప్పలకు పోయి తల్లుల ఆగ్రహానికి గురవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
మేడారం పనుల నాణ్యత మేడిపండును తలపిస్తున్నదని గద్దెల ప్రాంగణాన్ని చూస్తే తెలిసిపోతుంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని భావించినప్పుడు మహాజాతరకు కనీసం ఆరేడు నెలల ముందైనా మొదలు పెట్టాలని, అలా కాకుండా రికార్డు స్థాయిలో పనులు చేశామని గొప్పలు చెప్పుకొనేందుకు హడావుడిగా చేయడం వల్ల సర్కార్ అభాసుపాలైందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు. జాతరకు కొన్ని రోజుల ముందు చేపట్టామని, చేసిన పనులు పూర్తికాక ముందే జాతర రావడం, లక్షలాది మంది భక్తుల ‘తాకిడి’తో విరిగిపోయాయని తన లోపాన్ని భక్తుల మీదకు నెట్టే ప్రయత్నం సర్కార్ చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మేడారం తల్లుల గద్దెల ప్రాంగణాన్ని రికార్డు స్థాయిలో పూర్తిచేస్తామని మేడారం అభివృద్ధి నమూనా, పనులకు శంకుస్థాపన చేసిన రోజు (సెప్టెంబర్ 23, 2025వ తేదీన) సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘వంద రోజుల్లో పూర్తిచేస్తాం. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారానికి మూడుసార్లు మేడారం సందర్శించి పనులను పూర్తిచేయాలి. అవసరమైతే ఇక్కడే ఉండాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు.
నిరుడు అక్టోబర్ 12న మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని, 90 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి పనుల్లో వేగం పెరగడంతో పాటు పనులను పర్యవేక్షించేందుకు పొంగులేటి హైదరాబాద్ నుంచి ఇతర మంత్రులతో కలిసి 11 సార్లు ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వచ్చి పనులను పరిశీలించడంతోపాటు పురోగతిపై అధికారులు, సంబంధిత కాంట్రాక్టు సిబ్బందితో సమీక్షలు నిర్వహించారు. మొత్తానికి పూర్తయిన పనులను గతనెల జనవరి 19న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
మేడారంలో రూ.101 కోట్లతో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రోజుల వ్యవధిలోనే (ప్రారంభించిన 16వ రోజుకే) బుధవారం జరిగిన తిరుగువారానికి ఒకరోజు ముందు నుంచే సమ్మక్క-సారలమ్మ గద్దెల చుట్టూ నిలబెట్టిన రాతిస్తంభాలు విరిగిపోతున్నాయి. అభివృద్ధిలో భాగంగా గద్దెల చుట్టూ కంక (వెదురు) ఆకారాన్ని పోలిన శిలాకృతులు విరిగిపోయాయి. గద్దెల ప్రాంగణంలో వేసిన ఫ్లోరింగ్ అంతా ఎక్కడికక్కడ దస్కిపోతూ, జారిపోతూ, పగుళ్లు వచ్చాయి.
కోట్లాది రూపాయలు వెచ్చించి ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక రాయిని తెప్పించి.. దానిపై ఆదివాసీ సంస్కృతిని తెలిపే ఆనవాళ్లను రూపొందించామని సర్కార్ గొప్పలు చెప్పుకున్నది. సర్కార్ చేపట్టిన పనులు ‘పైన పటారం.. లోన లొటారం’లా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చేపట్టిన పనులు 90 శాతమే పూర్తయ్యాయని, ఇంకా మిగిలి ఉన్నాయని, వాటితోపాటు ఏవైనా ఊడిపోయినా.. రాలిపోయినా తిరిగి పునరుద్ధరించే బాధ్యత సర్కార్ నెరవేరుస్తుందని అధికారవర్గాలు పేర్కొనడం గమనార్హం.

ములుగు, ఫిబ్రవరి 4(నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం తల్లుల ప్రాంగణాన్ని వెయ్యేండ్లపాటు చెక్కుచెదరకుండా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించామని గొప్పలు చెప్పుకొన్నారని, అయితే ఆ కట్టడాలు వెయ్యి గంటలు కాకముందే భక్తుల తాకిడికి విరిగిపోవడం మేడారం ప్రతిష్టను దెబ్బతిసేలా ఉన్నాయని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం ఆమె ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతితో కలిసి మేడారంలో పర్యటించి తల్లుల దర్శనం చేసుకున్నారు.
అనంతరం దెబ్బతిన్న శిలలను పరిశీలించి మీడియాతో మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుం డా టెండర్లు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తల్లుల గద్దెల ప్రాంగణంలోని శిలలు విరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి జాతరకూ రూ.100 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని తప్పును ఒప్పుకొని వనదేవతలకు ప్రభుత్వం, మంత్రి, అధికారులు క్షమాపణలు కోరాలని ఆమె సూచించారు.