Palamuru | హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల మంజూరుపై కేంద్రం మరోసారి చేతులెత్తేసింది. ఏపీ సర్కారు సమ్మతిస్తేనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జలసంఘం మరో మెలిక పెట్టింది. లేదంటే ట్రిబ్యునల్ వాదనలు ముగిసే వరకూ అనుమతుల మంజూరు కష్టమేనని తెలంగాణకు తేల్చిచెప్పింది. మరోవైపు ఏపీ సర్కారు పాలమూరు ప్రాజెక్టుపై ఆది నుంచి అనేక విధాలుగా అక్కసు వెళ్లగక్కుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులపై పీటముడి పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) అప్పటి తెలంగాణ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో శ్రీకారం చుట్టింది. మైనర్ ఇరిగేషన్లో వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించింది.
డీపీఆర్‌ను సిద్ధం చేసి 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సమర్పించారు. ఈఏసీ నుంచి పర్యావరణ అనుమతులకు అంగీకరించింది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. దాదాపు ఏడాదిన్నర గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అనుమతులు మంజూరు కాలేదు.
ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్‌జైన్‌ను కలిసి తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సారైనా అనుమతులు మంజూరు చేయాలని అతుల్‌జైన్‌ను మంత్రి కోరారు. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల జలాలను పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించారని, ప్రస్తుతం ఆ జలాల అంశం ట్రిబ్యునల్ ఎదుట విచారణ కొనసాగుతున్నదని, ఆ జలాలపై ఏపీ నుంచి సమ్మతి తీసుకోవాలని, ఆ మేరకు అంగీకారపత్రం తేవాలని, అప్పుడే అనుమతుల మంజూరు సాధ్యమని రాష్ట్ర మంత్రికి తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
లేదంటే ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకూ అనుమతుల మంజూరు అసాధ్యమని, డీపీఆర్ పరిశీలన కష్టమని కూడా కరాఖండిగా తేల్చేచెప్పినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ ఆశలపై మరోసారి కేంద్రం నీళ్లు చల్లింది. ఇదే విషయాన్ని గతంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ అనేక సందర్భాల్లో పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారు ముప్పేట దాడికి దిగుతున్నది. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ వివిధ వేదికల్లో, కోర్టుల్లో తన గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఈ దశలోనే ఏపీ అనుమతిని సీడబ్ల్యూసీ తప్పనిసరి చేసింది.