హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ప్రాక్టికల్ పరీక్షలకు పొరుగు కాలేజీల బాట పట్టాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని 80% ప్రభుత్వ గురుకులాల్లో ప్రాక్టికల్ పరీక్షల సెంటర్లను ఇంటర్ బోర్డు ఈ ఏడాది తొలగించడమే అందుకు కారణం. బోర్డు నిర్ణయంతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడనుండటంతోపాటు విద్యార్థులకు సమస్యలు తప్పవని గురుకుల ఉద్యోగ వర్గాలు తెలుపుతున్నాయి. సీసీ కెమెరాలు లేవనే సాకుతో బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దారుణమని విమర్శిస్తున్నాయి.
రవాణా ఖర్చులతో సీసీ కెమెరాలనే ఏర్పాటు చేయవచ్చని సూచిస్తున్నారు. తక్షణం సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అన్ని కలిపి 1,023 గురుకులాలు ఉన్నాయి. దాదాపు 900లకుపైగా గురుకులాల్లో ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు. 75కు పైగా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. గురుకులాల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఈ ఏడాది కేవలం 20% గురుకులాలకే ప్రాక్టికల్ సెంటర్ నిర్వహణకు ఇంటర్‌బోర్డు అనుమతించింది. 80% గురుకులాలకు సెంటర్లు తొలగించింది.
సీసీ కెమెరాలు అమర్చిన ప్రయోగశాలల్లోనే విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని గత విద్యాసంవత్సరం (2024-25) ఇంటర్‌బోర్డు నిర్దేశించింది. కానీ ప్రభుత్వం గురుకులాల్లో ఇప్పటివరకు సీసీ కెమెరాలనే ఏర్పాటు చేయలేదు. ఫలితంగా గురుకుల జూనియర్ కాలేజీల విద్యార్థులు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్లడం తప్పనిసరిగా మారింది.
ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని గురుకుల టీచర్లు హెచ్చరిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షల సెంటర్లకు తరలించడానికి విద్యార్థులకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించాల్సి ఉంటుందని, తద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొంటున్నారు. ఆ రవాణా కోసం చేసే ఖర్చుతో గురుకులాల్లో కెమెరాలనే ఏర్పాటు చేయొచ్చని టీచర్లు వివరిస్తున్నారు.